ఆ జిల్లా నుంచే ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ..!

దిశ, నల్లగొండ: చాపకిందనీరులా ప్రవహిస్తూ వస్తున్న స్వేరోల రాజకీయ కార్యచరణకు నల్లగొండ జిల్లా నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గురుకులాల సెక్రటరీ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు తీవ్రమయ్యాయి. స్వేరోలు మహనీయులను కొనియాడుతూ ప్రతి ఏడాది మే 5 నుంచి నెలరోజుల పాటు భీం దీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. దీని ముగింపు సభను నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 18న నిర్వహించి, అక్కడే రాజకీయ కార్యచరణపై ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లు […]

Update: 2021-07-20 20:00 GMT

దిశ, నల్లగొండ: చాపకిందనీరులా ప్రవహిస్తూ వస్తున్న స్వేరోల రాజకీయ కార్యచరణకు నల్లగొండ జిల్లా నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గురుకులాల సెక్రటరీ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు తీవ్రమయ్యాయి. స్వేరోలు మహనీయులను కొనియాడుతూ ప్రతి ఏడాది మే 5 నుంచి నెలరోజుల పాటు భీం దీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. దీని ముగింపు సభను నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 18న నిర్వహించి, అక్కడే రాజకీయ కార్యచరణపై ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. అప్పటికే కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో.. ఆ సభను కాస్తా రద్దు చేయాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించారు. దీంతో స్వేరో కమిటీలో పనిచేస్తున్న యువకులు, నాయకులు కొంత అసంతృప్తికి గురైయ్యారు. ప్రస్తుతం స్వేరోస్‌ హీరో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ రంగప్రవేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

ఈ నెల 24న నార్కట్‌పల్లిలో సమావేశం

ఇప్పటివరకు స్వేరో కమిటీ మీటింగ్‌లు అధికంగా నార్కట్‌పల్లిలోని జరిగాయి. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా అనంతరం కూడా అదే వేదికగా స్వేరో కమిటీ నాయకులతో ఈ నెల 24న సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అక్కడే తన భవిష్యత్ కార్యచరణపై కమిటీ సభ్యులతో ముచ్చటించనున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తికి గురైన ఫిట్ ఇండియా, స్వేరోలతో భవిష్యత్‌లో నల్లగొండలో చేపట్టబోయే కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది.

రన్ ఫర్ కంట్రీతోనే రాజకీయ నిర్ణయం..

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలనపై చేసిన పోరాటం ఆధారంగా, విద్యార్థుల్లో, యువకుల్లో భయాన్ని పోగొట్టాలనే ఉద్దేశ్యంతో ఆగస్టు 8వ తేదీన రన్ ఫర్ కంట్రీ పేరుతో 5కేఎం రన్‌ను నిర్వహించనున్నారు. భీం దీక్ష ముగింపు సభ రద్దు చేసిన చోటనే మరో కార్యక్రమానికి నల్లగొండ వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లాల స్వేరో కమిటీ నాయకులు పాల్గొననున్నారు. అక్కడే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయరంగ ప్రవేశానికి శ్రీకారం పడనున్నట్లు తెలుస్తోంది.

ఆ ఫొటో కూడా కారణమా..?

ఈ నెల 18న ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గురుకులాల 5వ తరగతి వీ-టీజీ సెట్ ప్రవేశ పరీక్షకు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇటువంటి ఘటనే భద్రాద్రి జిల్లా ముల్కలపల్లి పాఠశాలలో వెలుగుచూసింది. పిల్లలు పరీక్ష రాస్తుండగా.. వేల సంఖ్యలో వారి తల్లింద్రుడులు పాఠశాల ఎదుట నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందుకు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పొగుడుతూ నెటిజన్లు కామెంట్లు పెట్టడంతో ఈ సంఘటన రెండు రోజులు ట్రెండింగ్‌గా మారింది. దీంతో తెలంగాణ అధికార పార్టీ నేతలకు వెక్కసంగా మారిందని, దీంతో ఆయనను ఒత్తిడికి గురిచేసినట్లుగా ప్రవీణ్ కుమార్ సన్నిహితుల ద్వారా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటికే గురుకులాలపై ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవచ్చని జీవో విడుదల చేయడం, దీనికి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేయడం కూడా ఒక కారణమైంది.

Tags:    

Similar News