గతాన్ని మరిచి.. సాగిపో
దిశ,వెబ్‌డెస్క్ : గతం అనేది గడిచిపోయిన జ్ఞాపకం. మనలో చాలా మంది గడిచిపోయిన ఆ గతాన్ని పట్టుకుని భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. అప్పుడు ఇలా చేసి ఉంటే బాగుండు.. ఇలా చేయకుండా ఉంటే బాగుండు అంటూ తమలో తామే మనోవేదనకు గురవుతుంటారు. నాడు కోల్పోయిన అవకాశాలనే తలుచుకుంటూ చీకట్లో మగ్గిపోవడమే కాకుండా, రేపటి వెలుగు కిరణాలను తమ చేతులను అడ్డుపెట్టి ఆపేందుకు ప్రయత్నిస్తుంటారు. గతం నింపిన ఆవేదనను వర్తమానంలో వెల్లదీస్తుంటారు. అలాంటి వారి కోసం ‘నేషనల్ డోంట్ […]
దిశ,వెబ్‌డెస్క్ : గతం అనేది గడిచిపోయిన జ్ఞాపకం. మనలో చాలా మంది గడిచిపోయిన ఆ గతాన్ని పట్టుకుని భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. అప్పుడు ఇలా చేసి ఉంటే బాగుండు.. ఇలా చేయకుండా ఉంటే బాగుండు అంటూ తమలో తామే మనోవేదనకు గురవుతుంటారు. నాడు కోల్పోయిన అవకాశాలనే తలుచుకుంటూ చీకట్లో మగ్గిపోవడమే కాకుండా, రేపటి వెలుగు కిరణాలను తమ చేతులను అడ్డుపెట్టి ఆపేందుకు ప్రయత్నిస్తుంటారు. గతం నింపిన ఆవేదనను వర్తమానంలో వెల్లదీస్తుంటారు. అలాంటి వారి కోసం ‘నేషనల్ డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ డే’ (జరిగిపోయిన దానికి బాధపడొద్దు) అనే విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రత్యేక కథనం మీ కోసం..
నా గతంలో అలా జరిగుంటే బాగుండూ.. ఇలా ఉంటే బాగుండు అని మనలో చాలా మంది అనుకుంటాం.. కానీ, నిజానికి మనం బాగుండాలంటే మారాల్సింది మన గతం కాదు.. మన పథం. నిజమే గడిచిపోయిన గతాన్ని మనం ఎప్పటికీ మార్చలేము. కానీ, గత అనుభవాలకు అనుగుణంగా మన వర్తమానాన్ని మార్చుకునే వీలుంది. తద్వారా భవిష్యత్తును చక్కదిద్దు కోవచ్చు. అందుకే తిరిగిరాని గతాన్ని తలుచుకుని భవిష్యత్తును నాశనం చేసుకోవడం అనేది మూర్ఖత్వం అని కొందరి అభిప్రాయం.
మనలో చాలా మంది గతం తాలుకు ఆలోచనల్ని వదిలించుకోవాలని ప్రయత్నిస్తారు. అందులో భాగంగా తమకు తెలియకుండానే అ ప్రయత్నంగానే గతం చేసిన గాయాలను గుర్తుకు చేసుకుంటుంటారు. ప్రతి చిన్న విషయానికే తీవ్ర మనస్థాపానికి గురవుతుంటారు. నిజమే గతాన్ని ఎంతగా వదిలించుకోవాలని మనం ప్రయత్నం చేస్తే.. అంత కన్నా ఎక్కువగా అది మన వెంటపడుతుంది. అందుకే గతాన్ని వదిలేసేందుకు మనం ఎంత దూరం పరుగులు తీసినా.. అంత కన్నా రెట్టింపు వేగంతో అది మనల్ని వెంటాడుతుంది. అందుకే గతాన్ని వదిలించుకోవడం కన్నా.. దాన్ని అర్ధం చేసుకోవడం మిన్నా. అలా చేస్తే ఆ గతం నిన్ను బాధపెట్టదు. ఇలాంటివి భవిష్యత్తులో మరోసారి రిపీట్ కాకుండా మంచి దారి చూపేందుకు దోహదపడుతుంది.
అందుకే ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మన మంచికే అనుకోవడమే మన పని అంటారు ఓ కవి. నిజమే మన జీవితంలో అనుకున్నవి అన్నీ జరగవు. అనుకున్నవన్నీ జరిగితే దాన్ని జీవితం అనరు. ఎందుకంటే జీవిత మంటేనే సుఖ దు:ఖాల కలయిక. అనుకున్న పనులు జరగనప్పుడు దాన్నే తలుచుకుంటూ వర్తమానాన్ని నాశనం చేసుకోకూడదు. అలాగే మనం అనుకోలేదు కదా అని కొన్ని పనులు జరగకుండా ఆగిపోవు. వాటంతటవే జరిగిపోతాయి. దానికి నీ అనుమతి అవసరం లేదు. అలా అనుకోకుండా జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఆ గాయాల్ని గుర్తు చేసుకుంటూ అక్కడే ఆగిపోకూడదు. ఏం జరిగినా మన మంచికే అని దృఢ నిశ్చయంతో బతుకు జట్కాబండిని పరుగులెత్తించాల్సిందే.