నో పీఆర్సీ.. రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 9.17 లక్షల మంది ఉద్యోగులకు 30 శాతం వేతన పెంపు వర్తిస్తుందని ప్రకటించినప్పటికీ.. అమలుకు మాత్రం దూరంగానే ఉంది. అసెంబ్లీ వేదికగా మార్చి 22న సీఎం కేసీఆర్ వేతన సవరణ ప్రకటన చేశారు. ఆ తర్వాత జూన్ నెల నుంచి రెగ్యులర్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో వేతనాలు పెంచారు. కానీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హోంగార్డు, అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యావాలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 9.17 లక్షల మంది ఉద్యోగులకు 30 శాతం వేతన పెంపు వర్తిస్తుందని ప్రకటించినప్పటికీ.. అమలుకు మాత్రం దూరంగానే ఉంది. అసెంబ్లీ వేదికగా మార్చి 22న సీఎం కేసీఆర్ వేతన సవరణ ప్రకటన చేశారు. ఆ తర్వాత జూన్ నెల నుంచి రెగ్యులర్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో వేతనాలు పెంచారు. కానీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హోంగార్డు, అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యావాలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీఆర్ఏ, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్టెడ్, డెయిలీ వేజ్ ఉద్యోగులందరికీ వేతన సవరణ జరిగినా, పెరిగిన వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 60, 63లలో 30 శాతం పెంపుగానీ ఏది తక్కువ అయితే దాన్ని వర్తింపజేయాలనే నిబంధనతో 30 శాతం పెంపు సౌలభ్యాన్ని ఈ ఉద్యోగులు పొందలేకపోతున్నారు.
పండుగకు కూడా పాత వేతనాలు
2021 మార్చి 22న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. 11వ వేతన సవరణను ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు అమలు చేస్తున్నట్లు, మొత్తంగా 9,17,979 మందికి వేతనాల పెంపుదల వర్తిస్తుందని తెలిపారు. అసెంబ్లీలో సీఎం ప్రకటన ప్రకారం 12 నెలల బకాయిలతో పాటు వేతన సవరణ జరిగి కొత్త వేతనాలు వెంటనే అందుతాయని ఉద్యోగులు ఎంతో ఆశతో చూశారు. మార్చి 22 నాడు ప్రకటన చేస్తే.. జూన్ 11న సర్కారు పది జీవోలిచ్చింది. కొత్త వేతనాలు జులై 1నాడు చెల్లిస్తామని పేర్కొన్నారు. 1 జులై 2018 నుంచి 31 మార్చి 2020 వరకు 21 నెలలపాటు వేతన సవరణ నోషనల్‌గా ఉంటుందని, 1 ఏప్రిల్ 2020 నుంచి 31 మార్చి 2021 వరకు 12 నెలల బకాయిలను ఉద్యోగులకు పదవీ విరమణ సందర్భంగా చెల్లిస్తామని జీవోలో పేర్కొంది.
1 ఏప్రిల్ 2021 నుంచి 31 జూన్ 2021 వరకు రెండు నెలల బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత హోంగార్డులు, అంగన్వాడీలు, సెర్ప్, ఉపాధి, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, వర్క్ చార్టెడ్, డెయిలీ వేజ్ ఉద్యోగులకు వేతనాల పెంపుపై విడుతలు వారీగా జీవోలిచ్చారు. కానీ వాటిని ఇంతవరకూ అమలు చేయలేదు. అంతేకాకుండా వీరందరికీ ఈ నెల కూడా పాత వేతనాలు అందుతాయని అధికారులు చెబుతున్నారు. వీరికి వేతనాలు పెంచి ఇచ్చేందుకు సంబంధిత శాఖల నుంచి ఈ నెల కూడా బిల్లులు చెల్లించలేదు. దీంతో ఈ నెల వారికి పాత వేతనాలే ఇవ్వనున్నారు.
ఇస్తారా.. లేదా..?
జీవోలు జారీ చేసినా పెరిగిన వేతనాలు అందకపోవడంతో ఈ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 30 శాతం పెంపుతో ఇస్తారా? లేదా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవోలు ఇచ్చినా.. వాటిని అభయెన్స్‌లో పెడుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి జీవోలను అభయన్స్‌లో పెట్టారని చర్చించుకుంటున్నారు.