‘ధరణి’కి దూరంగా వేల ఎకరాల భూములు..?

దిశ, న్యూస్‌బ్యూరో : పాలకులు, టీఆర్ఎస్ వర్గాలు పవిత్రమైనదని ప్రశంసిస్తున్న ‘ధరణి’లో వేలాది మంది రైతుల వివరాలు నమోదుకు నోచుకోలేదు. రైతుబంధు సాయానికి నోచుకోనివారూ ఉన్నారు. ఊర్లకు ఊర్లే డేటా క్రోఢీకరణకు దూరంగా ఉన్నాయి. అలాంటి చిన్న, సన్నకారు రైతులు సమగ్ర భూ సర్వే వరకు ఎదురుచూడాల్సిందేనని కొత్త ఆర్వోఆర్ చట్టం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ సాయం కోసం ఎందరో ఎదురుచూస్తున్నారు. అవసరాల కోసం భూములను అమ్ముకునే పరిస్థతి కూడా లేదు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పిన […]

Update: 2020-09-13 21:54 GMT

దిశ, న్యూస్‌బ్యూరో : పాలకులు, టీఆర్ఎస్ వర్గాలు పవిత్రమైనదని ప్రశంసిస్తున్న ‘ధరణి’లో వేలాది మంది రైతుల వివరాలు నమోదుకు నోచుకోలేదు. రైతుబంధు సాయానికి నోచుకోనివారూ ఉన్నారు. ఊర్లకు ఊర్లే డేటా క్రోఢీకరణకు దూరంగా ఉన్నాయి. అలాంటి చిన్న, సన్నకారు రైతులు సమగ్ర భూ సర్వే వరకు ఎదురుచూడాల్సిందేనని కొత్త ఆర్వోఆర్ చట్టం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ సాయం కోసం ఎందరో ఎదురుచూస్తున్నారు. అవసరాల కోసం భూములను అమ్ముకునే పరిస్థతి కూడా లేదు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పిన మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ మాత్రమే కాదు. ఇలాంటివి ఇంకా అనేకం ఉన్నాయి. కీసర మండలం బోగారం పక్కనున్న బర్సీగూడ, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఓ గ్రామం, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఓ గ్రామం, శంషాబాద్ మండలంలో ఓ గ్రామం, ఇబ్రహింపట్నం డివిజన్లో ఓ గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా అలాగే ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాలకు నక్షలు లేవు. అక్కడి రైతులకు భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయ లేదు. వారందరికీ రైతుబంధు సాయం అందడం లేదని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. లక్ష్మాపూర్ సంగతి తేల్చాలని కలెక్టర్, రెవెన్యూ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలోనూ కమిటీ వేశారు. ఇప్పటి వరకు ఆ రైతులకు పాస్ పుస్తకాలు చేతికందలేదు. మేడ్చల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి మల్లారెడ్డి దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క ఊరిని సర్వే చేసి పట్టాలు ఇచ్చేందుకు రెండున్నరేండ్లయినా ఫలితం దక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేపట్టి పూర్తి చేసే దాకా సమస్యలు యథాతథంగా ఉంటాయి. దీంతో హక్కులు పక్కాగా లేని వేలాది మంది రైతు కుటుంబాలు నిరాశలోనే ఉండాల్సిందేనని రెవెన్యూ చట్టాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బిలా దాఖలాలేవి?

వికారాబాద్ జిల్లా ఆలంపల్లి, రంగారెడ్డి జిల్లా కందుకూరు, కడ్తాల మండలాల సరిహద్దు సరస్వతిగూడలో బిలా దాఖలా భూములు (సర్వే చేయని భూములు) ఉన్నాయి. ఆలంపల్లిలో 400 ఎకరాలు ఉంది. సరస్వతిగూడలోనూ ఎకరా రూ.కోటి దాకా పలికే భూమి 50 ఎకరాల వరకు ఉన్నట్లు సమాచారం. వాటిని పక్కనే ఉన్న పట్టాదారులు కలిపేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ సెటిల్డ్ భూముల వివరాలు ధరణిలో నమోదు కాలేదని తెలిసింది. వీటికి టిప్పణీలు లేవు. ఇవి పూర్తిగా ప్రభుత్వ భూములే. వీటిని కాపాడితే ప్రజా ప్రయోజనాలు నెరవేరుతాయని ఓ ఆర్డీఓ అభిప్రాయపడ్డారు. పూడూరులో కొందరికి పట్టాలు జారీ చేస్తే తాను దగ్గరుండి సర్వే చేయించానని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ సురేష్ పొద్దార్ చెప్పారు.

వారికి సర్వే నంబరు వేసి తిరిగి పాస్ పుస్తకాలు జారీ చేశామని చెప్పారు. జిల్లాల సరిహద్దులుగా ఉన్న ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూమి ఓవర్ ల్యాప్ జరిగింది. ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం భూ సేకరణ జరిపేందుకు సర్వే చేసేటప్పుడు అప్పటి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులుగా ఉన్న కందుకూరు, కడ్తాల (ప్రస్తుతం ఇది కూడా రంగారెడ్డి జిల్లాలోనే ఉంది) మధ్యలో 600 ఎకరాల భూమి ఓవర్ ల్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. పక్కనే ప్రభుత్వ భూమి ఉండడంతో సర్దుబాటు చేశారు. అలా చాలా ప్రాంతాల్లోనూ ఉన్నాయి. వాటి రక్షణ చర్యలేవీ కనబడలేదని అధికారులు అంటున్నారు.

సీఎం చెప్పిన కథ..

మేడ్చల్, యాదాద్రి, సిద్ధిపేట జిల్లాల సరిహద్దు గ్రామం లక్ష్మాపూర్. శివాలయ గర్భగుడి కలశంపై ఉన్న శాసనం ఆధారంగా సగ భాగం మహారాజ కందస్వామి, మిగతా సగం కొట్టాల జాగీర్దార్ ఆధీనంలో ఉండేది. దాని పరిధిలోనే గుడి, ఠాణా, మైసమ్మ గుడి ఉన్నాయి. అందుకే దీన్ని కొట్టాల లక్ష్మాపూర్ గా పిలుస్తారు. మహారాజ కందస్వామికి సంబంధించిన భూములను గతంలోనే పంపిణీ చేసి, వివరాలను పైస్లా పట్టి, సేత్వార్, చెస్లాలో చేర్చారు. ప్రస్తుతం ఈ భూములు సాగు చేసే రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కొట్టాల జాగీర్థార్ భూములు అనుభవిస్తున్న రైతులు మూడు రకాలుగా ఉన్నారు. జాగీర్దార్ వారసుల నుంచి కొనుగోలు చేసి పైస్లా పట్టి, సేత్వార్ లో పేర్లు నమోదైనవారు. జాగీర్దార్ భూములను సేత్వార్ కాలం నుంచి సాగు చేసుకుంటూ భూమిని అనుభవిస్తున్నవారు. 1980 తర్వాత భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయగా, లావోణీ పట్టాలతో సాగు చేస్తున్నవారు.

మొదటి రకం రైతులకు సేత్వార్, ఖాస్రాలో ఒకే సర్వే నంబరు 120 గా ఉంది. పేదలకు ఇచ్చిన భూములపైనా అదే సర్వే నంబరు వేశారు. అంతకు ముందు ఈ ఊరి రికార్డులు భువనగిరి తాలుకాలో ఉన్నాయి. మేడ్చల్లో అవి దొరక లేదు. రైతులు పట్టాలు చేయాలని జాగీర్దార్ వారసులను ఎన్నిసార్లు ప్రాధేయపడినా చేయలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి గ్రామ నక్ష దొరకకుండా చేశారు. భూమినంతా అటవీ శాఖకు సేల్ డీడ్ చేశారు. దాంతో సంబంధిత పత్రాలు అటవీ శాఖ దగ్గర ఉన్నాయి. రెండో రకాన్ని ప్రభుత్వ భూములుగా పరిగణిస్తూ సర్వే నం.120 గా మార్చారు. ఈ భూముల్లోనే మూడో రకం రైతులకు 1980 తర్వాత పట్టాలు పంపిణీ చేశారు. 70 ఏండ్లుగా సాగు చేస్తున్న పట్టాలు జారీ చేయ లేదంటూ రైతులు సీఎం కేసీఆర్కు మొర పెట్టుకున్నారు. ప్రక్షాళనకు మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో కలెక్టర్ పర్యవేక్షణలో ఓ కమిటీని వేశారు. ప్రయోజనం నెరవేరలేదు.

పరిష్కారం ఉన్నా..

సేత్వార్ రికార్డుల్లో రైతు పేరుండి సర్వే నం.120 కాకుండా ఇతర నంబర్లలో కొనుగోలు చేస్తే పట్టాభూమిగా పరిగణించాలి. 100 ఏండ్లుగా భూ సర్వే చేయలేదు. కొత్తగా సర్వే చేసి భూ విస్తీర్ణంలో ఇబ్బందులు తలెత్తితే ఓ అధికారిని నియమించడం ద్వారా రైతులకు న్యాయం చేయొచ్చు. నిరుపేదలకు ఇచ్చిన భూముల విషయంలో మంత్రి మల్లారెడ్డి అటవీ శాఖ అధికారులతో మాట్లాడితే పరిష్కారమవుతుంది. ఇవేవీ చేపట్టకుండా దాటవేత ధోరణిని అవలంబించడంతో రైతులకు పట్టాదారు పుస్తకాలు జారీ కాలేదు. కొత్త ఆర్వోఆర్ చట్టంలోనూ పరిష్కార మార్గం చూపకుండా భూ సమగ్ర సర్వేనే మార్గమంటూ సీఎం కేసీఆర్ దాటవేశారు. సీఎం హామీ ఇచ్చినా పట్టాదారు పుస్తకాలు ఇప్పించలేకపోయారని గ్రామస్థులు మండిపడుతున్నారు.

Tags:    

Similar News