రైతు బంధు కావాలా..అయితే చెప్పింది వేయండి
దిశ, న్యూస్ బ్యూరో: వానా కాలంలో రైతులు ప్రభుత్వం చెప్పిన వరి పంటనే వేయాలి. అది కాకుండా వేరేది వేసిన వారికి ‘రైతుబంధు’ రాదు. వరి వేయవద్దని అనడంలేదు. కానీ డిమాండ్ ఉన్న రకాన్ని ప్రభుత్వం గుర్తించి ఏ రకాన్ని ఎన్ని ఎకరాల్లో వేయాలో చెబుతుంది. అప్పుడే రైతులకు నష్టం రాకుండా ఉంటుంది.దీనిని విస్మరించిన వారికి సాయం అందదు.రైతులందరకీ రైతుబంధు అందించాలనే ప్రభుత్వం కోరుకుంటోంది.ఇందుకు జిల్లాల కలెక్టర్లు రైతుల్ని కలిసి అర్థమయ్యేలా చెప్పాలి.క్షేత్రస్థాయి రిపోర్టు తెప్పించుకున్న తర్వాతే […]
దిశ, న్యూస్ బ్యూరో:
వానా కాలంలో రైతులు ప్రభుత్వం చెప్పిన వరి పంటనే వేయాలి. అది కాకుండా వేరేది వేసిన వారికి ‘రైతుబంధు’ రాదు. వరి వేయవద్దని అనడంలేదు. కానీ డిమాండ్ ఉన్న రకాన్ని ప్రభుత్వం గుర్తించి ఏ రకాన్ని ఎన్ని ఎకరాల్లో వేయాలో చెబుతుంది. అప్పుడే రైతులకు నష్టం రాకుండా ఉంటుంది.దీనిని విస్మరించిన వారికి సాయం అందదు.రైతులందరకీ రైతుబంధు అందించాలనే ప్రభుత్వం కోరుకుంటోంది.ఇందుకు జిల్లాల కలెక్టర్లు రైతుల్ని కలిసి అర్థమయ్యేలా చెప్పాలి.క్షేత్రస్థాయి రిపోర్టు తెప్పించుకున్న తర్వాతే డబ్బు ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నియంత్రిత పంటల సాగు విధానంపై ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం కేసీఆర్ మీడియా సమావేశంలో పై విషయాన్ని వెల్లడించారు. ఈసారి రాష్ట్రం మొత్తం మీద కేవలం 40 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట వేయాలని, పత్తి మాత్రం 70 లక్షల ఎకరాల వరకూ వేయవచ్చని, కందులు 15 లక్షల ఎకరాల వరకూ సాగుచేయవచ్చునని తెలిపారు. వానాకాలంలో మొక్కజొన్నను అస్సలే సాగుచేయవద్దని రైతులకు సూచించారు. దాని స్థానంలో కందులు వేయాలన్నారు.పత్తి పంట వేసిన రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఇస్తుందన్నారు.
40 లక్షల ఎకరాల్లో ఏ రకం వరి వంగడం వేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని, త్వరలోనే ఆ వివరాలు రైతులకు అందుతాయని సీఎం వివరించారు.అంతర్జాతీయ మార్కెట్‌లో మన వరి బియ్యం అమ్ముడుపోవాలంటే కొన్ని ప్రామాణికాలు ఉన్నాయని, బియ్యం గింజ 6.3 మి.మీ. పైబడి ఉంటే అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని, అందుకే ఈసారి ప్రభుత్వం నిర్దేశించిన విస్తీర్ణంలో ఈ రకం సాగు జరపాలన్నారు.గతంలో ఎప్పుడూ రైతులకు ఇలాంటి సూచనలు చేయలేదని కేసీఆర్ గుర్తుచేశారు. మన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇకపైన ఆ రకమైన పరిశోధనలు చేయాలన్నారు. ‘తెలంగాణ సోనా’ అనే వెరైటీని మన రాష్ట్ర శాస్త్రవేత్తలే రూపొందించారని, అంతర్జాతీయంగా ఈ వెరైటీకి మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఈ వెరైటీలో గ్లైసమిన్ తక్కువగా ఉన్నట్లు అనేక అంతర్జాతీయ జర్నళ్ళు చెప్పాయని, ‘సుగర్ ఫ్రీ వెరైటీ’గా దీనికి గుర్తింపు వచ్చిందన్నారు.ఈసారి ఈ వెరైటీని కనీసం 10లక్షల ఎకరాల్లో సాగు చేయాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు.త్వరలోనే జిల్లా కలెక్టర్లు, రైతుబంధు సమితి అధ్యక్షులతో హైదరాబాద్‌లో రెండు, మూడు రోజుల్లోనే సమావేశం నిర్వహిస్తామని, అప్పుడు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.
ఈసారి మక్కలు వద్దు..
వర్షాకాలంలో మొక్కజొన్న పంటను అసలే వేయవద్దని సీఎం రైతులకు పిలుపునిచ్చారు. దీనికి బదులు కందులు వేయాలని సూచించారు. మొక్కజొన్న పంటను ఇప్పుడు కొనేవారు లేరని, సరైన మార్కెట్ కూడా లేదన్నారు. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వ్యాపారులు క్వింటాల్‌కు రూ. వెయ్యి మాత్రమే అంటున్నారని, కనీస మద్దతు ధర రూ. 1760 రాదని తెలిపారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది గానీ, ఇకపైన ప్రతీసారి ప్రభుత్వమే కొనడం సాధ్యం కాదన్నారు. మన రాష్ట్రంలో మక్కల వినియోగం 25 లక్షల టన్నులు మాత్రమేనని, యాసంగిలో సాగుచేస్తే ఎకరానికి 35-40 క్వింటాళ్ళ మధ్య దిగుబడి వస్తుందని, కావున ఇప్పుడు అవసరం లేదన్నారు. కంది పంటను ఈసారి కూడా మొత్తం ప్రభుత్వమే కొంటుందని రైతులకు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం 1.35 కోట్ల ఎకరాలు అని అనుకున్నా, అందులో వరి 40 లక్షల ఎకరాలు, పత్తి 70 లక్షల ఎకరాలు, కంది 15 లక్షల ఎకరాలు పోతే మిగిలినదాంట్లో ఇతర పంటలు వేసుకోవచ్చని సీఎం సూచించారు. రెండు లక్షల ఎకరాల్లో కూరగాయల పంటకు ఎలాంటి ఇబ్బంది లేదని, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కేసముద్రంలో పసుపు పంట వేసుకోవచ్చన్నారు. డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేటలో మిర్చి రెండున్నర లక్షల ఎకరాల్లో వేసుకోవచ్చని చెప్పారు. సోయాబీన్ పంట కూడా ఆదిలాబాద్, నిర్మల్ తదితర ప్రాంతాల్లో వేసుకోవచ్చని, మామిడి, బత్తాయి తోటలు యథావిధిగా ఉంటాయన్నారు. వీరికి రైతుబంధు కూడా వస్తుందని తెలిపారు.
పత్తికి ప్రోత్సాహకం..
తెలంగాణలో మంచి రకం పత్తి పండుతోందని, దేశంలోని అన్ని రకాల్లో ఉత్తమమైనది ఇక్కడ, విదర్భలో మాత్రమే పండుతోందని సీఎం వివరించారు. కర్నాటకలోని తుమకూరు నుంచి వ్యవసాయ నిపుణులు స్వామినాథన్ హైదరాబాద్‌కు వస్తే మాట్లాడానని, ఇక్కడి పత్తి వెరైటీలో ‘లెంటల్ పొడుగు’ ఎక్కువని వ్యాఖ్యానించారు. గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, ఈసారి అది మరింత విస్తరించి 70 లక్షల ఎకరాల వరకు వెళ్ళవచ్చునని తెలిపారు. గతంలో వర్షాధారిత పంటగా సాగుచేయాల్సి వచ్చిందని, కానీ ఈసారి కాల్వలు, సాగునీరు, బోర్లు ఉన్నందున నీటికి ఢోకా లేదని, దిగుబడి ఎక్కువగా వస్తుందని అన్నారు. ఖర్చులన్నీ పోగా రైతుకు ఎకరానికి కనీసంగా రూ. 50 వేలు మిగులుతుందన్నారు. ఒక్కో ఎకరానికి 20 క్వింటాళ్ళ చొప్పున దిగుబడి వస్తుందన్నారు. వరి పంటకు వానాకాలంలో దిగుబడి 25 క్వింటాళ్ళు కూడా దాటదని, ఖర్చులన్నీ పోను ఎకరానికి రూ. 25 వేలు మిగులుతుందన్నారు. రైతులు ధనవంతులు కావాలని ప్రభుత్వం కోరుకుంటోందని, వారి పెట్టుబడి అవసరాలను కూడా వారే తీర్చుకునేలా ఉండాలని ఆశిస్తోందన్నారు. రైతులు వారి తలరాతను వారే రాసుకుంటారని, ఎవరో వచ్చి ఆదుకోవాలని కోరుకునే పరిస్థితి తెలంగాణలో ఉండదన్నారు.
ప్రభుత్వ నూతన నియంత్రిత వ్యవసాయ విధానానికి సంబంధించి ప్రతీ జిల్లాకు పంటల కార్డు ఉంటుందని, అన్ని జిల్లాలకూ అన్ని పంటలూ ఉంటాయని, అలాంటి మ్యాపింగ్ ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. గతేడాది పంటల వివరాల ఆధారంగా ఈ ఏడాది ప్రోగ్రామ్ ఉంటుందన్నారు.ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లను ఏర్పాటు త్వరలోనే చేస్తున్నామన్నారు. గతంలో 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు మాత్రమే ఉన్నాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత దాని కెపాసిటీ 25 లక్షల టన్నులకు పెరిగిందని, ఇంకా 40 లక్షల టన్నుల గోదాములను కట్టబోతున్నట్లు వివరించారు.శాశ్వత వ్యవసాయ, అభ్యుదయ రాష్ట్రంగా తెలంగాణ నిలబడేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సీఎం పేర్కొన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజీ ఉంటుందని, ఇందుకోసం స్థల సేకరణ దాదాపు 90 శాతం పూర్తయిందన్నారు. పంటల నియంత్రిత విధానం గురించి రెండ్రోజుల్లో మీడియా ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడతానని తెలిపారు.