వేడుకుంటున్నా.. పంట కొంటలేరు

రైతుల పరిస్థితి రోజురోజూకీ దిగజారుతోంది. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల కారణంగా వ్యవసాయం కత్తి మీద సాములా మారుతోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటను అమ్ముకునేందుకు కనిపించినోళ్లందరి కాళ్లు మొక్కాల్సిన దుస్థితి దాపురించింది. టోకెన్ల కోసం తెల్లవార్లూ వ్యవసాయ కార్యాలయాల ముందు పడిగాపులు పడాల్సి వస్తోంది. దిశ ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి ధాన్యం, పత్తి పంట ఇప్పటికే రైతుల చేతుల్లోకి వచ్చేసింది. పత్తిని ఇండ్లల్లో నిల్వ చేసి పెట్టుకున్నారు. వడ్లను ఆరబోసుకుంటున్నారు. […]

Update: 2020-11-14 03:53 GMT

రైతుల పరిస్థితి రోజురోజూకీ దిగజారుతోంది. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల కారణంగా వ్యవసాయం కత్తి మీద సాములా మారుతోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటను అమ్ముకునేందుకు కనిపించినోళ్లందరి కాళ్లు మొక్కాల్సిన దుస్థితి దాపురించింది. టోకెన్ల కోసం తెల్లవార్లూ వ్యవసాయ కార్యాలయాల ముందు పడిగాపులు పడాల్సి వస్తోంది.

దిశ ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి ధాన్యం, పత్తి పంట ఇప్పటికే రైతుల చేతుల్లోకి వచ్చేసింది. పత్తిని ఇండ్లల్లో నిల్వ చేసి పెట్టుకున్నారు. వడ్లను ఆరబోసుకుంటున్నారు. భారీ వర్షాలతో వరికి తీవ్ర నష్టం వాటిల్లంది. ధాన్యం పూర్తిగా తడవడంతో రోజురోజూకీ రంగు మారి నల్లగా అవుతోంది. వాటిని అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. మిల్లర్లు కొనుగోళ్లలో జాప్యం చేస్తుండడం, అధికారులు టోకెన్ల విధానం అమలు చేస్తుండడంతో ప్రత్యక్ష నరకాన్నే అనుభవిస్తున్నారు. టోకెన్ల కోసం తెల్లవారుజామున రెండు గంటల నుంచే వ్యవసాయ శాఖ కార్యాలయాల ముందు బారులుదీరుతున్నారు. ‘నియంత్రిత‘ విధానంతో రైతులు సన్నరకం వడ్లను భారీగా సాగు చేశారు. వర్షాలు అతిగా కురవడంతో చేతికందే దశలో పంట తడిసి ముద్ధయ్యింది. దీనికితోడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరవలేదు. మిల్లర్లు నేరుగా రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో సమస్యలు తలెత్తాయి. మద్దతు ధర చెల్లించకపోవడం, తేమ పేరుతో కొర్రీలు పెట్టడంతో ధాన్యం ట్రాక్టర్లు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.

మిల్లు సీజ్​తో..

ఈ క్రమంలోనే అధికారులు ఓ రైసు మిల్లును సీజ్ చేశారు. ఇందుకు నిరసనగా మిల్లర్స్ అసోసియేషన్ బంద్ ప్రకటించడంతో ధాన్యం కొనుగోళ్లకు ఒక రోజంతా బ్రేక్ పడింది. తిరిగి కొనుగోళ్లు చేపట్టినా, బారులుదీరిన ధాన్యాన్ని క్లియర్ చేసేందుకు మరో మూడు రోజులు బంద్ ప్రకటించారు. దీంతో గందరగోళం నెలకొంది. ఫలితంగా అధికారులు టోకెన్ల విధానాన్ని తీసుకొచ్చారు. మిర్యాలగూడలోని మిల్లుల సామర్థ్యం ప్రకారం రోజుకు 1,500 ట్రాక్టర్ల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవచ్చు. నల్లగొండ జిల్లాకు 900, సూర్యాపేట జిల్లాకు 600 టోకెన్లను కేటాయించారు. టోకెన్లు ఉన్న ట్రాక్టర్ల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ధాన్యం ఎంత ఉన్నా ఒక రైతుకు ఒక్క ట్రాక్టర్​కు మాత్రమే టోకెన్ జారీ చేస్తున్నారు. ఒక్క ట్రాక్టర్‌లో 70 నుంచి 80 బస్తాల ధాన్యాన్ని తరలించే అవకాశం ఉంది. రెండెకరాలకు మించి సాగు చేసిన రైతులు మరో టోకెన్ కోసం పడిగాపులు పడుతున్నారు. మరో టోకెన్​ సంపాదించడం తలకు మించిన భారంగా మారింది.

దూదిదీ అదే దారి..

పత్తి పరిస్థితీ అదే విధంగా ఉంది. నల్లగొండ రైతులు ఈ సీజనులో దాదాపు ఏడు లక్షల ఎకరాలకు పైగా పత్తిని సాగు చేశారు. 50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కొనుగోలు కేంద్రాలలో అధికారులు సన్నవడ్లకు ఒక రకంగా, పత్తికి మరోలా నిర్ణయాలు తీసుకోవడం వివాదస్పదంగా మారింది. సన్నవడ్ల టోకెన్లను అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులు ఇస్తుండగా, పత్తి రైతుల టోకెన్ల బాధ్యతను మాత్రం మిల్లు యాజమానులకే వదిలేశారు. దీంతో సీసీఐ అధికారులు, మిల్లర్లు టోకెన్ దందాకు తెర తీశారు. ఇటు పత్తిని, అటు వరి ధాన్నాన్ని అమ్ముకునేందుకు రైతాంగం ఇబ్బంది పడుతోంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వ్యవసాయమార్కెట్​లో ధాన్యం టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. తోపులాట జరగడంతో ఓ మహిళ గాయపడింది. టోకెన్ తీసుకోడానికి కిటికీలో చేయి పెట్టినపుడు సిబ్బంది తలుపు వేసేయడంతో వేలు తెగింది.

తప్పని ఆందోళనలు..

నేరేడుచర్లలో టోకెన్లు ఇవ్వడం లేదంటూ కర్షకులు ఆందోళనకు దిగారు. టోకెన్ ఉంటేనే కోత మిషన్ యజమానులు పొలం కోయడానికి వస్తున్నారని, సమయానికి కోయకపోతే పంట నాశనమయ్యే దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ధాన్యాన్ని తగులబెట్టి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోవడం లేదని వాపోయారు.

Tags:    

Similar News