సాగని కోతలు.. రైతుల తిప్పలు
గడపదాటేందుకు జంకుతున్న కూలీలు దిశ, ఖమ్మం: లాక్‌డౌన్ ప్రభావం వ్యవసాయ పనులపై పడుతోంది. ముఖ్యంగా వరి, మిర్చి పంటలు సాగు చేసిన రైతులు కూలీలు దొరక్క తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కూలీలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతుండటంతో పంటను ఇంటిని చేర్చుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. వారం రోజుల కిందటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాగా, జనతా కర్ఫ్యూ కారణంగా […]
గడపదాటేందుకు జంకుతున్న కూలీలు
దిశ, ఖమ్మం: లాక్‌డౌన్ ప్రభావం వ్యవసాయ పనులపై పడుతోంది. ముఖ్యంగా వరి, మిర్చి పంటలు సాగు చేసిన రైతులు కూలీలు దొరక్క తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కూలీలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతుండటంతో పంటను ఇంటిని చేర్చుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. వారం రోజుల కిందటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాగా, జనతా కర్ఫ్యూ కారణంగా ఆగిపోయాయి. ఇక మిరపకాయలను ఏరేందుకు పక్క రాష్ట్రాల నుంచి కూడా కూలీలను తీసుకొచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏరేందుకు కూలీలు ఆసక్తితో ఉన్నా వైరస్ ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనని మిగతా గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు ఇంటినుంచి బయటకు రావొద్దని అధికారులు, పోలీసులు చెబుతుండటంతో.. పనులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నట్టు కూలీలు చెబుతున్నారు.
గింజ రాలిపోయే ప్రమాదం..
ఇప్పటికే వారి కోతలు చేపట్టిన రైతులు.. ధాన్యాన్ని ఆరబెట్టి, బస్తాలను ఇంటికి చేర్చడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హార్వెస్టర్లతో పాటు ట్రాక్టర్ల వినియోగానికి అనుమతిస్తే వరి కోతకు గల ఇబ్బందులు తొలగిపోతాయని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇంకా 20 రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉంటే గింజ నేలరాలిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా రబీ వరి పంటకు ప్రభుత్వం ఇప్పటికే మద్దతు ధర ప్రకటించింది. సాధారణ రకం పంటకు క్వింటాకు రూ.1815, ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.1835గా నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు మార్కెటింగ్‌శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాష్ట్రమంతా లాక్‌డౌన్‌లో ఉన్న పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అస్పష్టత నెలకొంది. ఎప్పుడు ప్రారంభించాల్సి వస్తుందో ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు.
మిర్చి కష్టాలు..
జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో మిర్చిపంట సాగు చేశారు. దిగుబడి అంతంత మాత్రంగానే ఉన్నా ప్రస్తుతం ధర క్వింటాల్‌కు రూ.14 వేలకు పైగా పలుకుతుండటంతో రైతులు ధర తగ్గేలోపే అమ్మకాలు సాగించాలని భావించారు. ప్రధానంగా మిరప పంట ఇంటికి చేరే సమయం ఇదే కావడంతో.. సహజంగానే మిరప పంట ఏరేందుకు ప్రస్తుతం జిల్లాలో కూలీల కొరత ఏర్పడుతుంటుంది. ఈ సమయంలో ఒడిషా, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు ఇక్కడికి వలస వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో కూలీలు జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు.
Tags : Farmers, Paddy, Mirchi, Labour, Other states, Corona effect, Machinery