అన్నదాత ఆశలు ఆవిరి

దిశ, నల్లగొండ: కోటి ఆశలతో ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతన్న అంగట్లో సరుకులా మారాడు. పాలకులు అలసత్వం ప్రదర్శించినా.. ప్రకృతి ఆగ్రహించినా రైతన్నే బలవుతున్నాడు. ఎన్నో కష్టనష్టాలకోర్చి సాగు చేసిన పంట చేతికందే సమయంలో వర్షం నష్టం చేకూర్చింది. ఆదుకోవాల్సిన పాలకులు మాత్రం ఇంతవరకు మందలిచ్చిన పాపాన పోలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు రైతాంగం పంటలను తీవ్రంగా నష్టపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు పూర్తిగా నేలకొరిగాయి. ఇప్పటికే […]

Update: 2020-04-25 07:58 GMT

దిశ, నల్లగొండ: కోటి ఆశలతో ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతన్న అంగట్లో సరుకులా మారాడు. పాలకులు అలసత్వం ప్రదర్శించినా.. ప్రకృతి ఆగ్రహించినా రైతన్నే బలవుతున్నాడు. ఎన్నో కష్టనష్టాలకోర్చి సాగు చేసిన పంట చేతికందే సమయంలో వర్షం నష్టం చేకూర్చింది. ఆదుకోవాల్సిన పాలకులు మాత్రం ఇంతవరకు మందలిచ్చిన పాపాన పోలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు రైతాంగం పంటలను తీవ్రంగా నష్టపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు పూర్తిగా నేలకొరిగాయి. ఇప్పటికే కొంతమంది రైతులు పంటలను కోసి అమ్ముకుందామని మార్కెట్లకు తీసుకొస్తే.. వరదల రూపంలో ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో పంట సాగుకు చేసిన అప్పులైనా తీరుద్దామనుకుంటే.. ఆ ఆశలు కాస్త అవిరయ్యాయి. రైతులు పంటను కోసిన మార్కెటుకు తీసుకొచ్చిన దగ్గరి నుంచి మిల్లులో దిగుమతి అయ్యే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యంపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

వందల ఎకరాల్లో నష్టం..

యాదాద్రి జిల్లాలో వందల ఎకరాల పంటను రైతులు నష్టపోయారు. శుక్రవారం కురిసిన అకాల వర్షాలకే కాకుండా వారం కిందట కురిసిన వర్షాలకు భారీగా పంటల్నీ రైతాంగం నష్టపోయింది. జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, వలిగొండ మండలాల్లో పెద్దఎత్తున పంట నష్టపోగా, శుక్రవారం వర్షానికి భువనగిరి మండలంలో ఎక్కువగా నష్టం జరిగింది. చౌటుప్పల్ మండలం పెద్దకందుకూరు, మందోళ్లగూడెంలో వరిని పండించిన రైతుల బాధలు అన్నీఇన్నీకావు. ఎకరాకు 40 బస్తాల వడ్లు రావాల్సిందని కానీ, కేవలం ఎకరాకు 15 నుంచి 20 బస్తాల వడ్లు మాత్రమే చేతికొచ్చాయని చెబుతున్నారు. దీన్ని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే పంటనష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులను క్షేత్రస్థాయిలో పంపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. గ్రామాల్లో ఈదురుగాలులు, అకాల వర్షానికి పంటంతా నేలకొరిగింది. వందల ఎకరాల్లో వడ్లు రాలి.. చేతికి అందకుండా పోయాయి.

ఐకేపీ కేంద్రాల్లో రక్షణ చర్యలు శూన్యం..

కొందరు రైతులు పంటను ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. కానీ, వారికి అక్కడ కనీస రక్షణ చర్యలు ఉండటం లేదు. ప్రధానంగా ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను పంట పొలాలు, ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేశారు. దీంతో
రైతులు వడ్లు పోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రంలో ఎగుడుదిగుడుగా ఉండటంతోపాటు చిన్నపాటి వర్షం వచ్చినా నీరంతా నిలిచి పంట నష్టపోతున్నారు. పంటను ఆరబోసుకునేందుకు స్థలం ఉండటం లేదు.

మిల్లర్ల మాయజాలం..

లాక్‌డౌన్ నేపథ్యంలో వీలైనంత మేరకు ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లోని ధాన్యాన్ని కొనుక్కునేలా చుట్టుపక్కలా ఉండే రైస్ మిల్లుల యాజమాన్యాలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, మిల్లర్లు రైతుల వద్ద నుంచి ధాన్యం కొనేందుకు నానా కొర్రీలు పెడుతున్నారు. ఏమాత్రం తేమ ఉన్న ధాన్యం కొనేందుకు తిరస్కరిస్తున్నారు. కొనుగోళ్ల సమయంలో తూకంలో ఎక్కువ తీసుకుంటున్నారు. ఇదంతా అధికారులు చూస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఇదేంటని అడిగితే.. మేం దిగుమతి చేసుకునేలోపే తూకం తగ్గి మాకు నష్టం వస్తుంది. అందుకే తరుగు కింద ఎక్కువ తూకం వేస్తున్నామంటూ బదులిస్తున్నారు. దీంతో రైతులు బయట అమ్ముకోలేక.. తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యాన్ని మిల్లర్లకు అమ్మేస్తున్నారు.

టార్ఫాలిన్లు లేక భారీగా నష్టం..

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్ఫాలిన్ పట్టాలు ఇవ్వలేదు. దీంతో రైతులు తమకు అందుబాటులో ఉన్న అరకొర పట్టాల్లోనే మార్కెట్లలో ధాన్యం పోసుకున్నారు. బయట ఒక్కో పట్టాను రోజుకు రూ.20 చెల్లించి కిరాయికి తెస్తున్నారు. దీంతో రైతులకు అది భారంగా మారుతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో
పట్టాలు ఎక్కడికక్కడ ఇరుక్కుపోయి రైతులకు అందుబాటులో లేకుండాపోయాయి. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యంపై పట్టాలు సరిగా కప్పలేకపోతున్నారు. అకాల వర్షాలు పడిన సమయంలో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం కొనుగోలు కేంద్రాల్లో ఏం ఇబ్బందులు లేవు. రైతులకు అన్నిరకాల ఏర్పాట్లు చేశామంటూ ప్రచారంతో ఊదరగొడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకుని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మాటలకు చేతలకు పొంతన లేదు: ఎండీ జహంగీర్, సీపీఎం జిల్లా కార్యదర్శి యాదాద్రి జిల్లా

ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అకాల వర్షాలకు భారీగా నష్టపోయారు. అయినా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరా వరి
పంటకు రూ.20 వేలు, వాణిజ్య పంటలకు రూ.25 వేలు నష్టపరిహారంగా చెల్లించాలి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.

వడ్లు తెచ్చి ఆరు రోజులైతాంది: దొనకొండ వెంకన్న, రైతు, బొప్పారం

మూడెకరాల్లో వరి సాగు చేశా. వారం రోజుల కిందట పంటను కోశా. ఐకేపీ కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి ఆరు రోజులైతాంది. ఇంతవరకు కాంటా కాలేదు. అడిగితే బస్తాల్లేవ్ అంటున్నరు. రోజూ వచ్చి వడ్లు ఆరబోస్తున్నా.. వర్షం వచ్చేటట్టు ఉంది. రాత్రి మబ్బు పడితే.. నిద్ర పడితే అంత ఒట్టు. వడ్ల మీద కప్పడానికి ఒక్క పట్టా(టార్ఫాలిన్) ఇవ్వలేదు. మేమే రోజుకు రూ.20 కిరాయి పెట్టి 10 పట్టాలు తెచ్చిన. నా వడ్లు కాంటా అయ్యేందుకు మరో నాలుగైదు రోజులు పట్టేలా ఉంది. పట్టాలా కిరాయికే ఒక క్వింటా వడ్ల పైసలు పోతట్టుంది. యవుసం చేసేకన్న కూలీనాలీ జేసుకుంది బెటరుంది.

Tags: premature rain, crop buying centres, covid 19 affect, lockdown, farmers, difficulties

Tags:    

Similar News