రియల్టీలో న్యూ స్లోగన్..ఫౌంహౌజ్ కల్చర్!

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా తర్వాత లైఫ్ స్టైల్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉపాధి, వ్యాపార, వాణిజ్య రంగాలలోనూ మార్పు అనివార్యమైంది. వీటితోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం ముడిపడి ఉంది. మనిషి బలహీనతల ఆధారంగా వ్యాపారం చేయడం ఈ రంగంలో పరిపాటి. అదే అతి పెద్ద పెట్టుబడి కూడా. ఇప్పుడది కొత్త పుంతలు తొక్కుతున్నది. గతంలో ‘ప్లాట్లు కొంటారా?’ అంటూ కాల్స్ వచ్చేవి. ఇప్పుడు ‘నగరానికి దూరంగా, ప్రశాంత వాతావరణంలో ఫాంహౌజ్ ప్లాట్లు ఉన్నాయి.. తీసుకోండి […]

Update: 2020-12-06 01:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా తర్వాత లైఫ్ స్టైల్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉపాధి, వ్యాపార, వాణిజ్య రంగాలలోనూ మార్పు అనివార్యమైంది. వీటితోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం ముడిపడి ఉంది. మనిషి బలహీనతల ఆధారంగా వ్యాపారం చేయడం ఈ రంగంలో పరిపాటి. అదే అతి పెద్ద పెట్టుబడి కూడా. ఇప్పుడది కొత్త పుంతలు తొక్కుతున్నది. గతంలో ‘ప్లాట్లు కొంటారా?’ అంటూ కాల్స్ వచ్చేవి. ఇప్పుడు ‘నగరానికి దూరంగా, ప్రశాంత వాతావరణంలో ఫాంహౌజ్ ప్లాట్లు ఉన్నాయి.. తీసుకోండి బాగుంటుంది. వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’ అంటూ అందమైన గొంతులు ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ప్రకృతితో మమేకమయ్యే చాన్స్ మిస్ చేసుకోవద్దంటూ రియల్ ఎస్టేట్ సంస్థలు కొత్త ఒరవడికి తెర తీశాయి. నిజంగానే కరోనా వైరస్ విజృంభణతో నగరవాసులు కాస్త రిలీఫ్ కోరుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ నగరాన్ని వదిలి వెళ్లని కుటుంబాలు కూడా కాస్తయినా పొలం ఉండాలని అనుకుంటున్నాయి. రోజువారీ వ్యవహారాలతో బిజీగా ఉంటున్నందున, వీకెండ్ లో కుటుంబంతో కలిసి గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభుత్వం ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం దివాలా తీసింది. ధరలు పెరగలేదు..తగ్గలేదు. క్రయ విక్రయాలు పూర్తిగా స్తంభించాయి. కోట్ల రూపాయల పెట్టుబడి ఎక్కడికక్కడే అన్నట్లుగా మారింది. వారి దగ్గర పని చేసేవాళ్లకు మాత్రం వేతనాలు ఇవ్వక తప్పడం లేదు. దీంతో వ్యాపార సంస్థలు సరికొత్త పంథాను ఎంచుకున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో చాలా కంపెనీలు ఈ రంగంలోకి అడుగు పెట్టాయి. ఆర్గానిక్ ఫామ్స్ పేరిట, రిసార్టుల పేరిట ఫిల్మ్ మేకర్స్, స్టార్టప్ కంపెనీల యాజమాన్యాలు, సీరియల్ ఎంటర్ ప్రెన్యూయర్లు, నిర్మాతలు, దర్శకులు, నటులు రంగంలోకి దిగారు.

ముందుగానే ఊహించి..

ఫాంహౌజ్ కల్చర్ విస్తృతికి అవకాశం ఉంటుందని రియల్ ఎస్టేట్ సంస్థలు ముందుగానే ఊహించాయి. దశాబ్దాల క్రితమే వందల ఎకరాలు కొనుగోలు చేసినవారు ఆర్గానిక్ ఫామ్స్, ఫాంహౌజ్ కల్చర్ కు పునాది వేశారు. అతి తక్కువ ధరకే కొనుగోలు చేసిన భూములను వినియోగదారులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్లాట్ల వెంచర్లు, అపార్టుమెంట్ల మాదిరిగానే అందమైన బ్రోచర్లను రూపొందించారు. ఒక్కో వెంచర్ 20 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఏర్పాటైంది. ఆర్నెళ్ల కాలంలోనే వీటి సంఖ్య వందలకు చేరింది. గతంలో అమ్ముడుపోనివాటిని కూడా తీర్చిదిద్దుతున్నారు. సాఫ్ట్ వేర్, సినిమా రంగంలో బాగా సంపాదించినవారంతా కలిసి ఫాం హౌజ్ కల్చర్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. నిన్నమొన్నటి వరకు వేలాది ఎకరాలలో లేఅవుట్లు చేసి విక్రయించిన బడా సంస్థలు కూడా ఇప్పుడీ రంగంలోకి అడుగు పెట్టాయి. వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూ 100 కి.మీ. వరకు ఫాంహౌజ్ లేఅవుట్లు కనిపిస్తున్నాయి.

అనుమతులు లేకుండా..

వీటికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. భూములు కొని ప్లాట్లుగా విభజిస్తున్నారు. వాటిని సాగు భూమిగానే విక్రయిస్తున్నారు. పాస్ పుస్తకాలు కూడా జారీ అవుతున్నాయి. ఫాంహౌజ్ ప్లాట్లు కొనేవారు రైతులుగానూ మారుతున్నారు. రెండున్నర నెలలుగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు స్తంభించాయి. దీంతో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లు కూడా రిజిస్ట్రేషన్ సమస్య లేని ఫాంహౌజ్ ప్లాట్ల వైపు మొగ్గు చూపిస్తున్నారని రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి. డబ్బులను ఇంట్లో పెట్టుకోవడం కంటే ఏదో ఒక స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టడం మంచిదన్న అభిప్రాయం నెలకొంది. ఐటీ కంపెనీలపై ఆధారపడిన వ్యాపార, వాణిజ్య సంస్థలు, వాటిలో పని చేసే ఉద్యోగుల పాలిట కరోనా శాపంగా మారింది. తెలంగాణలో 5.82 లక్షల మంది ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడంతా వర్క్ ఫ్రం హోంలోనే ఉన్నారు. 70 శాతం మంది ఐటీయన్లు సొంతూర్లకు వెళ్లినట్లు అంచనా. కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది జూన్ వరకు వర్క్ ఫ్రం హోం అని స్పష్టం చేసింది. గూగుల్ జూలై వరకు అవకాశం ఇచ్చింది. అమేజాన్ ఐటీ కూడా వచ్చే ఏడాది జూన్ వరకు, సియాంట్ ఇన్ఫోటెక్ వచ్చే ఏడాది జనవరి వరకు.. ఇలా పలు ప్రముఖ కంపెనీలన్నీ ఇప్పుడప్పుడే కార్యాలయాలను తెరిచేటట్లు కనిపించడం లేదు. దాంతో పట్నవాసానికి అలవాటు పడిన ఐటీయన్లు ఫాంహౌజ్ కల్చర్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

అనంతగిరి హిల్స్..

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లోనూ వెంచర్లు వెలిశాయి. ‘‘నేచర్ బ్యూటీ, చుట్టూ ఫారెస్టు.. మధ్యలో మీ ప్లాటు. ఎంత బాగుంటుందో కదా. మీ కలల సౌధం ఫాంహౌజ్ నిర్మించుకోండి. వీకెండ్ లో ఎంజాయ్ చేయండి” అంటూ ప్రచారం చేస్తున్నాయి. కరోనా తర్వాత అనంతగిరి కొండలు సందర్శనీయ స్థలాలుగా మారాయి. ఇప్పటికే 10 వేల మంది వరకు ఫాం హౌజ్ ప్లాట్లను కొనుగోలు చేసినట్లు రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి, చేవెళ్ల, కడ్తాల, తలకొండపల్లి, ఇబ్రహింపట్నం, మంచాల, యాచారం, వికారాబాద్ జిల్లాలోని చాలా మండలాలు, చౌటుప్పల్, యాదాద్రి, బీబీనగర్ తదితర మండలాలలో వ్యాపారం జోరుగా సాగుతోంది. మొయినాబాద్ మండలం బాకారం, వికారాబాద్ మన్నెగూడలో సరికొత్త వెంచర్లు వెలిశాయి. తాజాగా అనేక పల్లెల్లో దర్శనమిస్తున్నాయి.

సదుపాయాల కల్పన..

1000, 2000, 3000 గజాల వంతున ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఎన్నెన్నో ఫీచర్స్, ఎమినిటీస్ కల్పిస్తున్నారు. ప్రతి ప్లాటుకు ఫెన్సింగ్, వాటర్, విద్యుత్తు కనెక్షన్, అవెన్యూ ప్లాంటేషన్, 30 నుంచి 40 ఫీట్ల రోడ్లు వంటి సదుపాయాలు ఉంటున్నాయి. క్లబ్ హౌజ్, కామన్ కాటేజెస్, జిమ్, ప్లే ఏరియా, ట్రెక్కింగ్ స్పాట్స్, సైక్లింగ్, బాస్కెట్ బాల్ ఎక్విప్మెంట్స్, ఆర్చరీ వంటి ఆటల కోసం క్రీడా సామగ్రి అందుబాటులో ఉంచుతారు. 24 గంటలు సెక్యూరిటీ, కామన్ కిచెన్ సెంటర్లు, మొదటి సంవత్సరం వరకు ఫ్రీ మెయింటెనెన్స్ వంటివి కూడా ఇస్తున్నారు. గజానికి రూ.2500కే అంటూ రియల్ ఎస్టేట్ సంస్థలు ఊరిస్తున్నాయి. వీకెండ్ లో ఆయా సంస్థలు ఇంటికే వచ్చి పికప్ చేసుకుంటాయి. అక్కడ ప్లానింగ్, దృశ్యాలను చూపిస్తాయి. సాయంత్రం మళ్లీ ఇంటి దగ్గరికి చేర్చుతాయి. వెంచర్ చూసిన సగం మంది కొనుగోలు చేయడం ఖాయమని సంస్థల ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కల్చర్ పెరిగింది: జీబీకే రావు, సీఎండీ, ప్రగతి రీసార్ట్స్, శంకర్ పల్లి

మా దగ్గర చాలా ప్లాట్లు ఉన్నాయి. కొందరు ఇండ్లు కట్టుకున్నారు. గతంలో కొన్ని రోజులు మాత్రమే ఉండేవారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ ప్రశాంతత కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు రిసార్టులోని ప్లాట్లు సందడిగా కనిపిస్తున్నాయి. ఎప్పుడో ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు కూడా ఇప్పుడు ఇండ్లు కడుతున్నారు. ఆన్ గోయింగ్ నిర్మాణాల సంఖ్య పెరిగింది. డిమాండ్ కూడా పెరిగింది. ‌‌– డా.

90 శాతం ఫాంహౌజ్: మనోహర్ రెడ్డి, డైరెక్టర్, జేబీ ఇన్ ఫ్రా ప్రైవేటు లిమిటెడ్

మార్చి నుంచి ప్లాట్ల అమ్మకాలు తగ్గాయి. కరోనా తర్వాత ఫాంహౌజ్ కల్చర్ పెరిగింది. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 90 శాతం అదే. దీనికే ఫ్యూచర్ కనిపిస్తుంది. నగరానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. జనం తక్కువగా ఉండే ప్రాంతాలలో కాస్త భూమి ఉండాలని కోరుకునేవారి సంఖ్య పెరిగింది. కేరళలో మాదిరిగా దూరదూరంగా ఇండ్లు ఉండాలని భావిస్తున్నారు. అందుకే మేం కూడా ఫాంహౌజ్ లేఅవుట్లు వేస్తున్నాం.

Tags:    

Similar News