సోషల్ వార్.. హుజురాబాద్ లో బ్లేమ్ గేమ్ స్టార్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నోట్ల పంపిణీ సంగతి ఉధృతంగా జరుగుతూ ఉన్నా బ్లేమ్ గేమ్ మొదలుపెట్టారు. ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియా పోస్టులతో ఓటర్లలో సరికొత్త గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఓటర్ల మైండ్ సెట్ మార్చడానికి రెండు పార్టీలూ పోటీపడుతున్నాయి. ఒక పార్టీని మరో […]
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నోట్ల పంపిణీ సంగతి ఉధృతంగా జరుగుతూ ఉన్నా బ్లేమ్ గేమ్ మొదలుపెట్టారు. ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియా పోస్టులతో ఓటర్లలో సరికొత్త గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఓటర్ల మైండ్ సెట్ మార్చడానికి రెండు పార్టీలూ పోటీపడుతున్నాయి. ఒక పార్టీని మరో పార్టీ నిందించడానికి రెండు వైపులా సోషల్ మీడియా సెల్‌లు చురుగ్గా పనిచేస్తున్నాయి. నకిలీ ఉత్తరాలు, డాక్యుమెంట్లు, ఇమేజ్‌లు, వీడియోలను సృష్టిస్తున్నాయి. ఇది నిజమేనని ఓటర్లు భావించేలా, అనుమానించేలా, విశ్వసించేలా ఫేక్ పోస్టింగ్, ఫేక్ వీడియోల తయారీలో తలమునకలయ్యాయి.
దళితబంధు పథకాన్ని ఆపేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉద్దేశపూర్వకంగా లేఖ రాయడం, ఆ తర్వాత ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం తెప్పించుకున్నట్లు లీకైన లేఖ తదితరాలన్నీ ఒక ప్రధాన పార్టీకి చెందిన సోషల్ మీడియా సెల్ సృష్టించిందనేది దాదాపు స్పష్టమవుతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపై విచారణ జరిపించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఇక నోట్ల పంపిణీకి సంబంధించి ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టేందుకు ఫేక్ వీడియోలను, ఇమేజ్‌లను సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఓటర్లను గందరగోళంలో పడేయడానికి, ప్రత్యర్థి పార్టీలపైనా, అభ్యర్థులపైనా చెడు అభిప్రాయాన్ని కలిగించడానికి ఈ చర్యలకు పాల్పడుతున్నాయి. ఫేక్ పోస్టింగులపై రెండు పార్టీలూ పలు సందర్భాల్లో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదులూ చేశాయి.
పోలింగ్‌కు ఒక రోజు వ్యవధి మాత్రమే ఉండడంతో ఊహకు అందని తీరులో ఇంకెన్ని ఫేక్ పోస్టింగులు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తాయోననే అనుమానం బలంగానే ఉన్నది. ఏది ఫేక్, ఏది నిజం అనేది తేల్చుకోలేక ప్రజలు, ఓటర్లు గందరగోళంలో పడాలన్నదే ఈ పార్టీల సోషల్ మీడియా సెల్‌ల ఉద్దేశం. ఓటర్ల మైండ్ సెట్‌పై ఇది గణనీయ ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నది. ప్రత్యర్థి బలంగా ఉన్న సందర్భాలను పరిగణనలోకి తీసుకుని ఇలాంటి ఫేక్ పోస్టింగులను వైరల్ చేస్తున్నాయి.