సినిమాను తలపించిన మోసం.. డబ్బులను డబుల్ చేస్తామని హోమం
దిశ, ఆదిలాబాద్: అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారీగా నగదు కాజేసిన నకిలీ బాబాల వ్యవహారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. మంగళవారం ఆదిలాబాద్ ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. జూన్ 15న న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మహమ్మద్ ఫారుక్ ఇంట్లో వెళ్లి నకిలీ బాబాలు మంత్ర తంత్రాలతో హోమం చేసి, నగదును రెట్టింపు చేస్తామని నమ్మించారు. మొదటిసారి రూ.50 వేలను హోమంలో ఉంచి మంత్రాలతో 80 వేలుగా మార్చి […]
దిశ, ఆదిలాబాద్: అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారీగా నగదు కాజేసిన నకిలీ బాబాల వ్యవహారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. మంగళవారం ఆదిలాబాద్ ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. జూన్ 15న న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మహమ్మద్ ఫారుక్ ఇంట్లో వెళ్లి నకిలీ బాబాలు మంత్ర తంత్రాలతో హోమం చేసి, నగదును రెట్టింపు చేస్తామని నమ్మించారు. మొదటిసారి రూ.50 వేలను హోమంలో ఉంచి మంత్రాలతో 80 వేలుగా మార్చి మాయచేశారు. అనంతరం మహమ్మద్ ఫారుక్ చెల్లెలికి చెందిన లక్ష రూపాయలను, లక్షన్నరగా మార్చి మరింత మరోసారి మాయచేశారు. దీంతో వారు బలంగా సదరు బాబాలను నమ్మారు. ఈ క్రమంలో ఏకంగా రూ.29 లక్షలను రెట్టింపు చేయాలని నగదును అందజేశారు.
ఈ నేపథ్యంలో నకిలీ బాబాలు మళ్లీ డబ్బులను రెట్టింపు చేసే విధంగా హోమం చేసినట్లు నటించి, రెండ్రోజుల తర్వాత పెట్టెను తెరిచి చూడాలని చెప్పారు. బాధితులు హోమం అనంతరం, బాబాలు చెప్పిన సమయంలో పెట్టెను తెరిచి చూడగా నగదు కనిపించలేదు. ఆందోళన చెందిన బాధితుడు మహమ్మద్ ఫారుక్ మావల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు బాధ్యత టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన సీఐ చంద్రమౌళి, ఏఎస్ఐ సయ్యద్ తాజుద్దీన్ విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం గాంధీ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో నిందితులు ఉన్నట్లు తెలుసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సాయంతో పోలీసులు ఇంటిని చుట్టుముట్టి నకిలీ బాబాలను అదుపులో తీసుకున్నారు. నిందితులు ఉట్నూర్ మండలం శ్యాంపూర్ గ్రామానికి చెందిన సగ్రీవ్, మరొకరు ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన బాల శంకర్, సంగీతలుగా గుర్తించారు.
అనంతరం నిందితుల వద్ద రూ.11లక్షల 70 వేల నగదు, రూ.20 వేల విలువైన 2 సెల్ ఫోన్లు, రూ.60 వేల విలువైన ల్యాప్ టాప్, రూ.20 వేల విలువైన రెండు బంగారు గాజులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ చంద్రమౌళి, ఏఎస్ఐ సయ్యద్ తాజుద్దీన్, గంగాధర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.