వారి మాటే వేదం.. ‘చక్రబంధంలో ఈటల’
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రచ్చ గెలుస్తున్నా ఇంట గెలవలేక పోతున్నారా..? ఇంటి దొంగలను ఈశ్వరుడైన కనిపెట్టలేరన్న ధీమా ఆ పంచ పాండవుల్లో తీవ్రంగా పెరిగిందా? కమ్యూనికేషన్స్ పెంచాల్సిన వీరే ఆయనను అందరికీ దూరం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు హుజురాబాద్ ప్రాంత ఈటల అనుచరులు. చివరకు సోషల్ మీడియాల్లో వచ్చే కామెంట్ల విషయంలోనూ ఈటలను మిస్ గైడ్ చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రచ్చ గెలుస్తున్నా ఇంట గెలవలేక పోతున్నారా..? ఇంటి దొంగలను ఈశ్వరుడైన కనిపెట్టలేరన్న ధీమా ఆ పంచ పాండవుల్లో తీవ్రంగా పెరిగిందా? కమ్యూనికేషన్స్ పెంచాల్సిన వీరే ఆయనను అందరికీ దూరం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు హుజురాబాద్ ప్రాంత ఈటల అనుచరులు. చివరకు సోషల్ మీడియాల్లో వచ్చే కామెంట్ల విషయంలోనూ ఈటలను మిస్ గైడ్ చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన రాజేందర్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన్ను ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ శత విధాల ప్రయత్నం చేస్తుంటే ఆయన చుట్టూ అల్లుకపోయిన ఆ ఐదుగురు చాలా విషయాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తమకు ఉపాధి కల్పించిన నాయకుని క్షేమం కన్నా తమ స్వార్థం తమ సామాజిక వర్గాల వారికే ప్రాధాన్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్న వారు కొందరైతే ఈటల దరి చేరకుండా చాలా మందిని నియంత్రిస్తూ ఆయన చుట్టూ చక్రబంధంలా అల్లుకపోయారన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈటలను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నిస్తున్న వారిని కూడా ఆ పంచపాండవులు నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, సోషల్ మీడియా ద్వారా ఈటల టచ్‌లోకి వెల్లే ప్రయత్నం చేస్తున్నా లాభం లేకుండా పోతోందని పలువులు అంటున్నారు. రానున్న ఉపఎన్నికలు ఈటలకు అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా అందరూ భావిస్తున్నా ఆ ఐదుగురు మాత్రం తాము గీసిన గీత దాటవద్దన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కొందరు చెప్పుకుంటున్నారు. అన్నీ తామై నడిపిస్తున్నామన్న భ్రమలు కల్పిస్తున్న సదరు వ్యక్తుల వల్ల ఈటల ఇమేజ్ డ్యామేజ్ కావడం తథ్యం అంటున్నారు హుజురాబాద్ ప్రాంత వాసులు. తమ పట్టు సడలవద్దన్న స్వార్థంతో వీరి చర్యలు ఈటల గెలుపోటములపై తీవ్ర ప్రభావం పడనున్నాయని అంటున్నవారూ లేకపోలేదు.
జనసేన పేరుతో దగా..
ఈటల జనసేన, యువత తదితర పేర్లతో క్రియేట్ అయిన సంస్థల విషయంలోనూ ఈటల మరో దగాకు గురువుతున్నారన్న ప్రచారం సాగుతోంది. వివిధ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేసి ఆయన్ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్న భ్రమల్లో ఉంచుతూ తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ముప్పు తప్పదా..
నమ్మకంగా ఉంటూ ఈటలను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్న తన బంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని కట్టడి చేయపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. రాష్ట్రంలోని కీలక మంత్రి వద్ద ఉద్యోగం పొందేందుకు స్కెచ్ వేసుకున్న ఒకరిద్దరు ఈటల సీక్రెట్స్ అన్ని కూడా అక్కడకు చేరవేస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
మావో ప్రకటన ప్రభావం..
విప్లవోద్యమం వైపు అడుగులు వేసిన ప్రాంతాల్లో హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు వామపక్ష విప్లవాలకు వేదికగా నిలిచి ఎంతోమంది విప్లవకారులను తీర్చిదిద్దిన కేంద్రం జమ్మికుంటగా వాసికెక్కింది. అంతేకాకుండా కమలాపూర్, వీణవంక తదితర ప్రాంతాల్లో విప్లవ భావజాలంతో ఎదిగిన తరం నేటికీ ఉంది. వయసు పైబడ్డినప్పటికీ వారిలో మాత్రం ఆ భావుకత తగ్గలేదన్నది వాస్తవం. అయితే రెండు రోజుల క్రితం మావోయిస్టు పార్టీ ఇచ్చిన ఓ ప్రకటన కూడా ఈటల రాజేందర్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ పంచన చేరి అడ్డగోలుగా సంపాదించుకున్న ఈటల ఇప్పుడు ఆర్ఎస్ యు, ఆరెస్సెస్‌ను ఒకే రీతిలో చూస్తాననడంపై మావోయిస్టు పార్టీ మండిపడింది. ఫాసిస్టు బీజేపీతో చేతులు కలిపిన ఈటల రాజేందర్ తీరును తప్పు పట్టింది. ఈ ప్రకటన ప్రభావం కూడా రానున్న ఎన్నికల్లో చూపే అవకాశాలు మెండుగానే ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.