ఉమ్మడి జిల్లాలో నెక్ట్స్ ఎవరి వంతు..?
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గతేడాది జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉపఎన్నిక తర్వాత స్తబ్దుగా ఉన్న రాజకీయాలు మంత్రి వర్గం నుంచి ఈటల బర్తరఫ్ తర్వాత మరోసారి హీటెక్కాయి. ఇప్పటివరకు ఈటల రాజేందర్ అధికారికంగా ఎక్కడ కూడా పార్టీ పెట్టుతున్నట్లు కానీ, పార్టీ మారుతున్నట్లు గానీ ప్రకటన చేయలేదు. కానీ పలువురు రాజకీయ ప్రముఖులను ఈటల కలువడం, మరికొందరు ఆయన్ను కలువడం రాజకీయాలలో కొత్త సమీకరణలపై సర్వత్రా […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గతేడాది జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉపఎన్నిక తర్వాత స్తబ్దుగా ఉన్న రాజకీయాలు మంత్రి వర్గం నుంచి ఈటల బర్తరఫ్ తర్వాత మరోసారి హీటెక్కాయి. ఇప్పటివరకు ఈటల రాజేందర్ అధికారికంగా ఎక్కడ కూడా పార్టీ పెట్టుతున్నట్లు కానీ, పార్టీ మారుతున్నట్లు గానీ ప్రకటన చేయలేదు. కానీ పలువురు రాజకీయ ప్రముఖులను ఈటల కలువడం, మరికొందరు ఆయన్ను కలువడం రాజకీయాలలో కొత్త సమీకరణలపై సర్వత్రా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండగానే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనూ ఈటల ప్రకంపనలు ప్రస్పూటంగా కనిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది నియోజకవార్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ, ఇద్ధరు జడ్పీ చైర్మన్లు, ఆరు మున్సిపల్ పాలకవర్గాలు అధికార పార్టీ నేతల చేతుల్లో ఉండగా పొరుగు జిల్లా కరీంనగర్‌కు చెందిన నేత ఈటల వెంట ఉమ్మడి జిల్లా నేతలు నడుస్తున్నారా అనేది సర్వత్రా చర్చానీయాంశంగా మారింది.
మొన్నటికి మొన్న ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎనుగు రవిందర్ రెడ్డి.. ఈటల రాజేందర్‌ను కలువడం జిల్లా రాజకీయాలను కలవరపాటుకు గురి చేశాయి. తాజాగా బుధవారం సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ ఈటలను కలవడం జిల్లా రాజకీయాలను ఒక కుదుపు కుదిపాయి. డీఎస్‌తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (బీజేపి) సైతం ఈటలతో భేటి అయ్యారనే వార్త ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. అయితే, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక సెక్షన్ నేతలు ఈటలను కలవడంపై చర్చ జరుగుతోంది. దానికి తోడు జిల్లాలో అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులు, ఇతర పార్టీలకు చెందిన మాజీ నేతలు ఎవరెవరు ఈటల టీంను కలిసి ముందుకు సాగుతారనే ఊహగానాలు జోరుగా సాగుతున్నాయి.
టీడీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఇద్ధరు టీఆర్ఎస్ పార్టీకి జలక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రిని ఎన్నికల తరువాత కేసీఆర్ గానీ, జిల్లా పార్టీ నేతలు గానీ ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన రాజకీయాలు వద్ధనుకుని సైలంట్ అయిపోయారు. ఇటీవల సదరు నేత కూడా మాజీ మంత్రి ఈటలకు టచ్‌లో వచ్చినట్లు జిల్లాలో చర్చ జరుగుతుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి మరొకరు సైతం దశాబ్ధకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నా మళ్లీ కొత్తగా ఈటలతో దోస్తీ కోసం అడుగులు వేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అంతేగాకుండా ప్రతిపక్ష పార్టీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సైతం తనకు భవిష్యత్తు ప్రస్తుత పార్టీలో లేదని, అదే విధంగా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన మరోనేత కూడా రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలు జరిగితే వారితో కలిసి ముందుకు వెళ్లడానికి తమ అనుయాయులతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తాజాగా పదవిని పోగొట్టుకున్న మరో నేత సైతం ఈటల వర్గం వారితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఉద్ధండ నేతను గురువుగా భావించే ఆ నేతతో పాటు తాను కూడా పార్టీ మారుతానని, కానీ తమ పార్టీ అధ్యక్ష పదవి తన అనుకున్నవారికి రాలేదని ఇప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. దానికి తోడు అధికార పార్టీలో ఎమ్మెల్యే టికెట్‌లను ఆశించి భంగపడ్డ ద్వితీయ శ్రేణి నేతలు సైతం కొత్త తరం రాజకీయాల వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఈటలతో ఎవరెవరు టచ్‌లో ఉన్నారు, ఆయనతో కలిసి ముందుకు నడిచేది ఎవరు అనే విషయం త్వరలోనే తేలనుంది.