శామీర్‌పేట నుంచి ఈటల ప్లాన్.. టీఆర్ఎస్ వెన్నులో వణుకు

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార పార్టీకి కొత్తగా కోవర్టుల భయం పట్టుకుంది. సొంత పార్టీలోని నేతలే కీలక సమయంలో మాట మారుస్తున్నారు. వెన్నంటి ఉన్నట్టే ఉంటూ సమాచారం, బేరసారాలు దాట వేస్తున్నారు. అసలే అధికార పార్టీని క్రాస్​ ఓటింగ్​ భయం వెంటాడుతోంది. మొన్నటి హుజురాబాద్​ ఫలితం నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఏదో ఒక రూపంలో గులాబీ బాస్​ నుంచి పరిణామాన్ని ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో.. అలాంటి తిరుగుబావుటే స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో ఎదురైంది. […]

Update: 2021-11-29 18:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార పార్టీకి కొత్తగా కోవర్టుల భయం పట్టుకుంది. సొంత పార్టీలోని నేతలే కీలక సమయంలో మాట మారుస్తున్నారు. వెన్నంటి ఉన్నట్టే ఉంటూ సమాచారం, బేరసారాలు దాట వేస్తున్నారు. అసలే అధికార పార్టీని క్రాస్​ ఓటింగ్​ భయం వెంటాడుతోంది. మొన్నటి హుజురాబాద్​ ఫలితం నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఏదో ఒక రూపంలో గులాబీ బాస్​ నుంచి పరిణామాన్ని ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో.. అలాంటి తిరుగుబావుటే స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో ఎదురైంది. కేసీఆర్​కు పదకొండేళ్ల ఉద్యమ ప్రస్థానంలో వెన్నంటి నడిచిన మైనార్టీ నేత, కరీంనగర్​ మాజీ మేయర్​ సర్దార్​ రవీందర్​ సింగ్​ రూపంలో టీఆర్​ఎస్​కు తలనొప్పి తీసుకువచ్చింది. దానికి తోడుగా రవీందర్​ సింగ్​కు తెలంగాణ ఉద్యమ సమయంలోని నేతలు అండగా ఉండటం, మొన్నటికి మొన్న అధినేతను ఢీకొట్టి గెలిచిన ఈటల రాజేందర్​ కీలకంగా చక్రం తిప్పుతుండటం మాత్రమే కాకుండా.. కాంగ్రెస్​ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కలిసి వస్తున్నట్లు సంకేతాలు అందుతుండటంతో అధికార పార్టీ హైరానా పడుతోంది.

క్యాంపు వేసినా..?

కరీంనగర్​ మండలి ఎన్నికల్లో ఎదురయ్యే పరిణామాలను అధికార పార్టీ ముందుగానే ఊహించింది. దీంతో అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులను క్యాంపునకు తరలించింది. ముందుగా హైదరాబాద్​లోనే వారందరినీ ఉంచినా.. పరిస్థితులు చేయి దాటుతుండటంతో బెంగళూరుకు మార్చారు. దీంతో అదిరిస్తే బెదిరిస్తే… బెదిరిపోయే స్థితిలో ఉన్నట్లు తేలిపోయింది. చిన్న అలజడికే అలర్ట్ అయ్యింది. కేవలం సర్ధార్​ వేసిన నామినేషన్ చూసి అధికార పార్టీ భయపడుతున్నట్లు తేల్చుకుంది. దీంతో ఎంపీటీసీల బాధ్యతలను ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించింది. ప్రస్తుతం ఇంచార్జీలకు కంటిమీద కునుకు లేకుండా మారింది. క్యాంపుల మీద క్యాంపులు మారుస్తున్నారు. వ్యూహాల మీద వ్యూహాలేస్తున్నారు. రోజువారీగా సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ పర్యవేక్షణ చేస్తున్నారంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థమవుతోంది.

కరీంనగర్​ స్పెషల్​

స్థానిక సంస్థల మండలి ఎన్నికలు అన్ని జిల్లాలు ఓ ఎత్తయితే కరీంనగర్ జిల్లా మరో ఎత్తులా పరిణమిస్తోంది. ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పోటీ అనివార్యమైన నేపథ్యంలో ఒక్క కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు క్యాంపుల మీద క్యాంపులు మార్చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల చొప్పున ఒక క్యాంపు కేంద్రంగా ఏర్పాటు చేసి మంత్రులు సీరియస్ గా పర్యవేక్షిస్తున్నారు. మొదట హైదరాబాద్ లోని లియోనీస్ రిసార్ట్ జిల్లాకు చెందిన 800 మంది ప్రజాప్రతినిధులతో క్యాంపు ఏర్పాటు చేశారు.

వెన్నంటే కోవర్టులు

హైదరాబాద్​ నుంచి మొదలైన క్యాంపు రాజకీయాల్లో కోవర్టులను ప్రాథమికంగానే గుర్తించారు. క్యాంపుల్లోనే కోవర్టులున్నారని, క్యాంపుల సమాచారం ఈటల రాజేందర్ కు, సర్దార్ రవీందర్ సింగ్ కు చేరవేస్తున్నారని అమాత్యులు, ఎమ్మెల్యేలు తెలుసుకుని.. 850 మంది ఓటర్లను బెంగుళూరుకు షిప్ట్ చేశారు. అంతేకాదు.. ముందుగా ఓటరుగా ఉన్న ప్రజాప్రతినిధిని మాత్రమే క్యాంపునకు తరలించగా.. బెంగళూరుకు మార్చాల్సిన సమయంలో కుటుంబ సభ్యులందరినీ తరలించారు. పిల్లా.. పాపలను కూడా తీసుకెళ్లి ఓటర్ల రాచమర్యాదలు చేస్తున్నారు.

అడ్రస్​ చిక్కదు.. బయటకు వెళ్లొద్దు

అయినప్పటికీ క్యాంపు రహస్యాలు, క్యాంపుల్లో జరుగుతున్న చర్చలు, నేతలకు ఎంతో కొంత నగదు అప్పగించడంపై బయటకు సమాచారం చేరుతూనే ఉంది. దీంతో క్యాంపును మరింత పకడ్భందీగా నడిపించేందుకు చర్యలు చేపట్టారు. మూడు నియోజకవర్గాలకు ఒక క్యాంపు చొప్పున ఇలా… ప్రతీ మూడు రోజులకోసారి క్యాంపు కేంద్రాలు మార్చుతున్నారు. అంతేకాదు.. ఫోన్​లో మాట్లాడాలంటూ కూడా ఇంచార్జీల ఫోన్​ నుంచే బయటకు కాల్​ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన టీఆర్​ఎస్​ తిరుగుబాటు నేత సర్దార్ రవీందర్ సింగ్ కు ఎవరు టచ్ లో ఉన్నారనే వివరాలను అమాత్యులు తెలుసుకునేందుకు పెద్ద ప్లాన్​లే వేస్తున్నారు. ఇక సర్దార్ వెనుక ఈటల ఉన్నారని ఆలస్యంగా తెలుసుకున్న పార్టీ హైకమాండ్ ఈ విషయాన్ని ఈజీగా తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని గ్రహించి మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ జారీ చేసింది. హుజురాబాద్ మాదిరి ఫలితమే మండలి ఎన్నికల్లో రిపీటయితే పార్టీ ఉనికికే ప్రమాదమని గుర్తించిన గులాబీ పెద్దలు ప్రతీ ఓటుపై స్కాన్ చేస్తున్నారు. ఓట్లు చీలకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్క ఓటు రమణకు, మరో ఓటుకు భాను ప్రసాదరావు కు పడేలా జాగ్రత్త తీసుకుంటున్నా ఎక్కడో తేడా కొడుతుందని భయపడుతున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే అనుమానాలు టీఆర్​ఎస్​ క్యాంపును వీడటం లేదు. రవీందర్ సింగ్ కు ఓట్లేవరు వేస్తారు, ఏ ఓటు ఎటు క్రాసయ్యే అవకాశాలున్నాయో కూడా అంచనా వేస్తున్నారు. క్యాంపుల్లో జల్సాలు, ఎంజాయ్ లు పక్కన పెట్టి ఓటర్లపై నిఘా, పార్టీ హైకమాండ్ నుండి వస్తున్న సంకేతాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు.

క్యాంపులోనూ ఈటల భయం

మరోవైపు సర్దార్ రవీందర్ సింగ్​కు కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర ప్రజాప్రతినిధులు మద్దతుగా ఉంటున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా టీఆర్​ఎస్​లోని అసంతృప్తులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఈటలతో టచ్​లో ఉంటున్నారని అధికార పార్టీ నేతలు గుర్తించారు. క్యాంపుల్లో ఉన్నా.. వాళ్లకు ఈటల నుంచి గైడ్​లైన్స్​ వస్తున్నాయనే సమాచారం కూడా సేకరించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లు క్యాంపుల్లో ఉండగానే ఈటల అనుచరులు.. రవీందర్ సింగ్ తరుపున ఓటర్ల ఇళ్లల్లోకి వెళ్లి ఓటర్ల కుటుంబ సభ్యులతో భేటీ అవుతున్నట్లు అధికార పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల కుటుంబ సభ్యులను కూడా క్యాంపునకు తరలించారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడించేందుకు కూడా క్యాంపులో ఉన్న ఓటర్లకు ఆంక్షలు పెడుతున్నారు.

శామీర్​పేట నుంచి ఈటల

ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్​.. ఇప్పుడు హుజురాబాద్‌కే పరిమితం కాకుండా టీఆర్ఎస్‌ మూలాలను దెబ్బ తీసేందుకు స్థానిక సంస్థల మండలి ఎన్నికలను మరో అవకాశంగా వాడుకుంటున్నట్లు భావిస్తున్నారు. క్యాంపుల్లో ఓటర్లు ఉండగానే.. వారి కుటుంబ సభ్యులతో కలిసి ఓట్లను రాబట్టే ప్లాన్​ చేస్తున్నారు. దీనికి అవసరమయ్యే ఖర్చును ఈటల రాజేందర్​ మీదేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓటర్ల జాబితాను సిద్దం చేసుకుని.. అధికార పార్టీలోని అసంతృప్తుల చిట్టాతో ఈటల శామీర్‌పేట నుంచి చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు కలిపి దాదాపు 500 మంది వరకు ఉండగా.. ఇక హుజురాబాద్, మంథని, మానకొండూర్, హుస్నాబాద్, కరీంనగర్‌ నియోజకవర్గాల నుంచి అధికార పార్టీ సభ్యులకు గాలం వేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి రెండు స్థానాలుంటే ఒక ఓటు రవీందర్‌ సింగ్‌కు, మరో ఓటు టీఆర్ఎస్‌కి వేసుకోవాలంటూ చాన్స్​ ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌ క్యాంప్‌లో ఉంటున్న వారికి కూడా రవీందర్‌సింగ్‌కు ఓటు పడేలా హుజురాబాద్ ఓటరు చైతన్యాన్ని చెబుతున్నారు.

Tags:    

Similar News