మ్యూటేషన్లకు ముప్పు.. అసలు కంటే ఎక్కువ భూ అమ్మకం

దిశ, తెలంగాణ బ్యూరో: భూమి పెరగదు.. తరగదు.. కానీ రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలు కలిసి అసలుకు రెట్టింపు చేశారు. అవును.. ఇది నిజం. భూమిని ఉత్పత్తి చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న దాని కంటే రికార్డుల్లో ఎక్కువ విస్తీర్ణాన్ని చేశారు. ఒకరిద్దరికి కాదు.. అనేక మందికి విక్రయించారు. ఒకటే భూమి.. పలువురికి విక్రయించిన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోని రిజిస్ట్రేషన్‌ విధానంలో లోపాల కారణంగా సేల్‌డీడ్‌ల ఆధారంగానే ఒకరి నుంచి మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేశారు. […]

Update: 2021-02-12 11:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భూమి పెరగదు.. తరగదు.. కానీ రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలు కలిసి అసలుకు రెట్టింపు చేశారు. అవును.. ఇది నిజం. భూమిని ఉత్పత్తి చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న దాని కంటే రికార్డుల్లో ఎక్కువ విస్తీర్ణాన్ని చేశారు. ఒకరిద్దరికి కాదు.. అనేక మందికి విక్రయించారు. ఒకటే భూమి.. పలువురికి విక్రయించిన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోని రిజిస్ట్రేషన్‌ విధానంలో లోపాల కారణంగా సేల్‌డీడ్‌ల ఆధారంగానే ఒకరి నుంచి మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఒకసారి పలువురికి, మరో సారి ఒక్కరికే పెద్ద విస్తీర్ణం విక్రయిస్తూ దగా చేశారు. ఖాస్రా పహాణీకి, నేటి పహాణీలు, సేల్‌డీడ్స్‌లోని విస్తీర్ణానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇలాంటి అనేక దందాలు భూ రికార్డుల ప్రక్షాళనలోనూ వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడనేక మంది దగ్గర సేల్ డీడ్స్ ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో మ్యుటేషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ రెవెన్యూ రికార్డుల లెక్కల ప్రకారం పొంతన కుదరడం లేదు. సర్వే నెంబరులోని విస్తీర్ణం కంటే అధికంగా విక్రయించినట్లుగా లెక్క పక్కా అవుతోంది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రికార్డుల్లో పొంతన లేకుండా విక్రయించిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా మ్యుటేషన్లు అనివార్యంగా మారడంతో ధరణి పోర్టల్ ద్వారా సేల్ డీడ్లను అప్‌లోడ్ చేసి దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రతి మండలంలోనూ వందల్లో దరఖాస్తులొచ్చాయి. కానీ ఆర్ఎస్ఆర్‌కు వ్యత్యాసం రావడంతో మ్యుటేషన్లకు సాంకేతికత అడ్డొస్తోంది. ఖాస్రా పహాణీలో పేర్కొన్న విస్తీర్ణానికి సమానంగానే ధరణిలోనూ ఉండాలి. అప్పటి అక్రమార్కుల దందా ప్రస్తుత తహసీల్దార్లకు ముప్పు తెచ్చి పెట్టిందని తెలుస్తోంది.

పెండింగ్‌లోనే మ్యూటేషన్లు

రాష్ట్ర వ్యాప్తంగా చాలా మండలాల్లో మ్యుటేషన్ల ప్రక్రియ పెండింగ్‌లో పడుతోంది. ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరిశీలనలో టెక్నికల్‌గా ఆమోదం లభించడం లేదు. ఈ క్రమంలో కారణాలు దరఖాస్తుదారులకు చేరడం లేదు. పెండింగు ఎందుకున్నదో తహసీల్దార్లు, సిబ్బంది కూడా చెప్పలేకపోతున్నారు. తాము రూ.లక్షలు పెట్టి వెచ్చించి కొనుగోలు చేశాం.. సేల్ డీడ్లు ఉన్నాయి. స్టాంపు డ్యూటీ చెల్లించాం. మ్యుటేషన్ చేయాల్సిందేనంటూ దరఖాస్తుదారులు ఒత్తిడి చేస్తున్నట్లు తహసీల్దార్లు చెబుతున్నారు. అయితే ధరణి పోర్టల్ ద్వారా ప్రక్రియను పూర్తి చేయాలంటే ఆర్ఎస్ఆర్ సరి చేయాల్సిందే. అది చేయాలంటే ప్రస్తుతం నమోదు చేసిన రికార్డులతో చేయలేమని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని బట్టి ఆ దరఖాస్తులన్నీ పెండింగులో ఉండాల్సిందే.

అక్రమాలతో మ్యుటేషన్లకు కష్టాలు

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలో ఐదు సర్వే నంబర్లలోని అసలు భూమి కంటే మూడున్నర రెట్లు అమ్మకానికి గురైంది. సర్వే నంబర్లు 356, 358, 359, 360, 361లలో మొత్తం విస్తీర్ణం 64 ఎకరాలు. కానీ 60కి పైగా సాగిన సేల్‌డీడ్ల లెక్క చూస్తే 291 ఎకరాలుగా నమోదైంది. అంటే మూడున్నర రెట్లు. నందివనపర్తిలో సర్వే నంబరు 360లో 13.32 ఎకరాలు, సర్వే నంబరు 361లో 15.39 ఎకరాలకు అసలు పట్టాదారులెవరు? ఖాస్రా పహాణీ, చెస్లా పహాణీ, సేత్వార్‌, తక్తా, చౌపస్లా రికార్డుల్లో ఉన్న పట్టాదారులు ఎప్పుడు చనిపోయారు? వారు విక్రయించినట్లుగా చెబుతోన్న లేదా సృష్టించిన రికార్డుల్లో సంతకాలు పెట్టిందెదరు? రిజిస్ట్రేషన్లు ఎప్పుడు పూర్తయ్యాయి? చనిపోయిన వారెట్లా వచ్చి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో సంతకాలు చేశారు? వారి అసలు వారసులెవరు? మొదటి రికార్డుల్లో పేర్లకు, సేల్‌డీడ్లలో విక్రయించిన వారి పేర్లకు మధ్య వ్యత్యాసం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికితే అక్రమాలు వెలుగులోకి వస్తాయి. కొనుగోలు చేసిన వారిలో అమాయకులెంత మంది ఉన్నారో, అక్రమార్కులు ఏయే రంగాలకు చెందిన వారో అర్థమవుతుంది. రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో పని చేసి రిటైరైన వ్యక్తులు కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో కొందరికి మ్యుటేషన్‌ చేశారు. చాలా మంది దగ్గర సేల్‌డీడ్లు మాత్రమే ఉన్నాయి. పహాణీల్లో నమోదు కాలేదు. క్షేత్రంలో భూమీ లేదు. వాళ్లు కొనుగోలు చేసిన భూమి ఎక్కడుందో వాళ్లకే తెలియదు. దాంతో చాలా మంది మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడవన్నీ పెండింగులో ఉంచారని సమాచారం.

ఖాస్రాలో ఉన్నదెంత?

నందివనపర్తి రెవెన్యూలో సర్వే నంబరు 356, 358, 360, 361, 369 లలో ఖాస్రా పహాణీ ప్రకారం విస్తీర్ణం కంటే మూడింతలు విక్రయించినట్లు సేల్‌డీడ్స్‌, పహాణీలు చెబుతున్నాయి. కనీసం రైతు టైటిల్‌డీడ్‌, పాసు పుస్తకాలు ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయాలన్న నిబంధన ఏం లేకపోవడంతో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వారి పని చేస్తూ పోయారు. కేసులు ఉన్నాయని ప్రొహిబిషన్‌ ఆర్డర్‌ బుక్‌(పీఓబీ)లో 22 ఏ కింద నమోదు చేశారు. ఈ భూములపై రిజిస్ట్రేషన్లు చేయకూడదని ఇబ్రాహింపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ జారీ చేసిన ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. సర్వే నంబరు 360, 361 అసలు యజమానుల విజ్ఞప్తి మేరకు 2010 జనవరి 30న అప్పట్లో పని చేసిన, ఈ వ్యవహారానికి సాక్షిగా నిలిచిన వీఆర్వో పి.రాధాకిషన్‌రావు లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. అందులో సర్వే నం.360, 361లో అనేక తప్పిదాలు సాగాయి. అసలు పట్టాదారులకు బదులుగా ఇతరుల పేర్లు నమోదయ్యాయని, అనేక డాక్యుమెంట్లల్లో పొరపాట్లు దొర్లినట్లు ధృవీకరించారు. కానీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అడ్డుకట్ట పడలేదు. ఇలాంటి చాలా గ్రామాల్లో ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

జిల్లాల్లో అనేకం

ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగుతోన్న ప్రాంతాల్లో సర్వే నంబరులోని విస్తీర్ణం కంటే ఎక్కువగా అమ్మేశారు. కొన్ని గ్రామాల్లో పట్టా భూములను అమ్మేశారు. పక్కనే ఉండే ప్రభుత్వ భూముల్లోకి జరిగారన్న ఆరోపణలు ఉన్నాయి. మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్, శంషాబాద్, గండిపేట, షాద్‌నగర్, షాబాద్, మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ భూముల విస్తీర్ణం ఎంత మిగిలిందో సర్వే చేస్తే అక్రమాలు బయట పడతాయని స్థానికులు చెబుతున్నారు. కొందరు పెద్ద రైతులు వారి భూములను అమ్మేసి పక్కనే ఉన్న అటవీ భూముల్లోకి, ప్రభుత్వ భూముల్లోకి జరిగి సాగు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అటవీ భూములకు సరిహద్దులుగా ఉన్న సర్వే నంబర్ల విస్తీర్ణం, అమ్మిన విస్తీర్ణం ఎంతో దర్యాప్తు చేయడం ద్వారా ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Tags:    

Similar News