ముగిసిన ఎమ్మెల్సీ ప్రచారం.. హరీశ్ రావుకు చెక్ పెట్టేది ఇక్కడేనట!
దిశ ప్రతినిధి, మెదక్ : మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ సమయానికి 72 గంటల ముందు ప్రచార సమయం ముగిసినట్టు కలెక్టర్ హరీశ్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన ప్రచార పర్వం ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు అంతర్గత ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు క్యాంపుల్లో ఉండగా .. కాంగ్రెస్ పార్టీ ఫోన్ల ద్వారా టీఆర్ఎస్ నాయకులను ఓటు అభ్యర్థించే పనిలో బిజీగా ఉన్నది. ఇదిలా ఉండగా ఉమ్మడి […]
దిశ ప్రతినిధి, మెదక్ : మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ సమయానికి 72 గంటల ముందు ప్రచార సమయం ముగిసినట్టు కలెక్టర్ హరీశ్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన ప్రచార పర్వం ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు అంతర్గత ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు క్యాంపుల్లో ఉండగా .. కాంగ్రెస్ పార్టీ ఫోన్ల ద్వారా టీఆర్ఎస్ నాయకులను ఓటు అభ్యర్థించే పనిలో బిజీగా ఉన్నది. ఇదిలా ఉండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థి రవీందర్ సింగ్ సిద్దిపేటలో మీడియా సమావేశం నిర్వహించి పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంది.
క్యాంపు రాజకీయం
సాధారణంగా ఏ ఎన్నికలైనా ప్రచార మైకులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, అభ్యర్థుల ప్రచారాలతో మార్మోమోగుతుంటాయి. కానీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు అందుకు విరుద్ధం. కేవలం ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, పట్టణ కౌన్సిలర్లు మాత్రమే ఓటేయాల్సి ఉంటుంది. దీంతో ఏ పార్టీ కూడా బహిరంగ సభలు నిర్వహించలేదు. కేవలం టీఆర్ఎస్ నియోజక వర్గాల వారీగా మంత్రి హరీశ్ రావు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి క్యాంపునకు పంపించారు. దగ్గరుండి బస్సేక్కించి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలపై వివరించారు. అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ సైతం తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. మొదట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం పలువురు టీఆర్ఎస్ నాయకులను కలిసి ఓటేయాలని అభ్యర్థించారు. పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. ఇక మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం పర్వం ముగియడంతో అందరూ సమావేశాలు సైతం బంద్ చేశారు.
మంత్రిపై మాజీ మేయర్ సెటైర్లు..
ఉమ్మడి కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు ఇంచార్జీగా వ్యవహరిస్తున్న వైద్యశాఖ మంత్రి హరీశ్ రావుపై కరీంనగర్ స్వతంత్ర అభ్యర్థి, మాజీ మేయర్ రవీందర్ సింగ్ పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఓటమిపాలయ్యే స్థానాలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు మంత్రి హరీశ్ రావుకు అప్పగిస్తున్నారని, గెలిచే చోట కేటీఆర్ ప్రచారం చేస్తున్నారంటూ, హరీశ్ గ్రాఫ్ పడగొట్టి పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నంలో టీఆర్ఎస్ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈటల మాదిరిగా హరీశ్ రావుకు టీఆర్ఎస్‌లో కాలం చెల్లిందని, త్వరలోనే ఆయన్ను బయటకు పంపడం ఖాయమంటూ జోస్యం చెప్పారు.
హుజురాబాద్ మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హరీశ్ వ్యూహం బెడిసి కొడుతుందన్నారు. తన కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి సిద్దిపేట జిల్లాలో నాలుగు మండలాలు ఉన్నాయని, తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పార్టీ అభ్యర్థులు అంతర్గతంగా ఓటర్లను ఎలా కలవాలి, ఎలాంటి ప్రలోభాలకు గురి చేయాలనే దానిపై శ్రద్ధ చూపుతున్నారు. మరీ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ ఎమ్మెల్సీ ప్రచారం ఎలా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.