కేటీఆర్ గారు.. మాకు పని చెప్పండి

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొన్ని శాఖల్లో సిబ్బంది కొరత పౌరసేవలకు ఆటంకంగా మారింది. విపత్కర పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మున్సిపల్​, రెవెన్యూ, పంచాయతీరాజ్ ​శాఖల్లో సిబ్బంది లేమి తీవ్రంగా వేధిస్తోంది. కానీ హైదరాబాద్‌లో పాతబస్తీ అభివృద్ధి కోసం నెలకొల్పిన ‘కులీకుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)’పరిస్థితి మరో రకంగా ఉంది. ఇందులో ఎన్‌ఎంఆర్‌లు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. కానీ చేసేందుకే పని లేదు. చెప్పేవారు లేరు. నిధులు మంజూరు చేసే పాలకుడు లేడు. ఆఫీసులో ఖాళీగా […]

Update: 2021-01-02 20:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొన్ని శాఖల్లో సిబ్బంది కొరత పౌరసేవలకు ఆటంకంగా మారింది. విపత్కర పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మున్సిపల్​, రెవెన్యూ, పంచాయతీరాజ్ ​శాఖల్లో సిబ్బంది లేమి తీవ్రంగా వేధిస్తోంది. కానీ హైదరాబాద్‌లో పాతబస్తీ అభివృద్ధి కోసం నెలకొల్పిన ‘కులీకుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)’పరిస్థితి మరో రకంగా ఉంది. ఇందులో ఎన్‌ఎంఆర్‌లు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. కానీ చేసేందుకే పని లేదు. చెప్పేవారు లేరు. నిధులు మంజూరు చేసే పాలకుడు లేడు. ఆఫీసులో ఖాళీగా కూర్చుంటున్నారు. ఉదయం రావాలి. సాయంత్రం దాకా కూర్చోవాలి.. సంతకాలు పెట్టి హాజరు రాయించుకోవాలి. సర్వీసు రిజిస్టర్‌ అప్‌డేట్‌ చేయించుకోవాలి. జీతభత్యాల బిల్లులు తయారు చేసుకోవాలి. నెల కాగానే వేతనాల బిల్లుకు మోక్షం కలిగిందేమోనని ఉన్నతాధికారుల చుట్టూ తిరగాలి. వాళ్లు దయతలచి మంజూరు చేస్తే ఈ ఉద్యోగులు తీసుకోవాలి. ఇప్పటికైతే రెండు నెలలుగా పైసా లేదు. వేతనాలు కూడా లేవు. ఎప్పుడో కొందరు అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారన్న నెపంతో ఏ పనీ అప్పగించకుండా ఖాళీగా కూర్చోబెట్టి ప్రతి నెలా రూ.65 లక్షల వరకు వేతనాలు చెల్లిస్తూనే ఉన్నారు. ఒకటీ రెండు నెలల పాటు కాదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఏ పనీ చెప్పడం లేదు. హైదరాబాద్​నగరంలో 12 నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంస్థ ప్రస్తుతం వేతనాల బిల్లుల కోసం అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాలకు దీటుగా పాతబస్తీని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 1981లో కులీకుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. మురుగునీటి పారుదల, మంచినీటి సరఫరా పనులు, సిమెంటు రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఆసుపత్రులు, పాఠశాల భవనాలు, ఇండ్ల నిర్మాణం వంటి పనులను చేయాలని నిర్దేశించారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత పాతబస్తీలోనూ జీహెచ్‌ఎంసీతోనే పనులు చేయిస్తున్నారు. కుడా నుంచి ప్రతిపాదనలు పంపినా ఉన్నతాధికారులు తిరస్కరిస్తున్నారు.

విలీనం చేయండి మొర్రో

మేం ఖాళీగా కూర్చుంటే నెల కాగానే వేతనాల కోసం చేతులు చాచాల్సిన దుస్థితి మాకొద్దు. మేం ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా క్యాడర్​ను బట్టి ఎక్కడ, ఏ పని ఇచ్చినా చేస్తాం. ఏ శాఖలోనైనా విలీనం చేసినా వెళ్లడానికి సిద్ధం.. అంటూ కుడా సంస్థలోని ఉద్యోగులు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. ఏండ్లు గడుస్తున్నా వారి ప్రతిపాదనను పరిశీలించడం లేదు. పురపాలక శాఖ ప్రిన్సిపల్ ​సెక్రెటరీ అర్వింద్​కుమార్ ​టేబుల్ ​మీదనే సదరు దస్త్రం ఉన్నట్లు తెలిసింది. ఈ సంస్థను జీహెచ్ఎంసీ, ఇతర శాఖల్లో విలీనం చేయాలని సంబంధిత మంత్రి కేటీ రామారావు దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ పాతబస్తీలోని ఈ సంస్థ విలీనం, నిధుల కేటాయింపు, పనుల అప్పగింతపై ఎంఐఎం పార్టీ శాసనసభ్యులు కూడా ఏనాడూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ విలీన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం కుడా ఉద్యోగులను మరో సంస్థ/శాఖలోకి బదిలీ చేయకుండా ఏడేండ్లుగా దాటవేత ధోరణిని అవలంభిస్తున్నట్లు సమాచారం. విలీనం చేయాలని ఉన్నతాధికారులను కోరితే.. అంత ఈజీ కాదు. మేనేజ్​మెంట్​ ​కమిటీ ఆమోదించాలంటున్నారు. కానీ ఏనాడూ ఆ కమిటీ సమావేశం కాదు. మంత్రి కేటీఆర్​ తలచుకుంటే వారం రోజుల్లోనే పూర్తయ్యే విలీన ప్రక్రియను ఏడేండ్లుగా సాగదీస్తున్నారని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. తమకూ ఖాళీగా కూర్చొని జీతం తీసుకోవడం ఇష్టం లేదంటున్నారు.

అందరూ ఉన్నారు

కులీకుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ నెలకొల్పిన నాడు 97 మంది ఉద్యోగులు ఉండేవారు. అధికారులతో మొదలు ఇంజినీరింగ్‌ స్టాఫ్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, నాల్గో తరగతి ఉద్యోగులు పని చేసేవారు. వారందరికీ చేతినిండా పని ఉండేది. వివిధ హోదాల్లో 55 మంది రెగ్యులర్ ​ఉద్యోగులు ఉన్నారు. వీరికి తోడు ఎన్‌ఎంఆర్‌ (నాన్‌ మస్టర్‌ రోల్‌) పేరిట 60 మంది పని చేస్తున్నారు. ఈ 60 మంది కూడా తాము దశాబ్దాలుగా పని చేస్తున్నందున తమకు పే స్కేలు ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు కూడా ఎన్ఎంఆర్ ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిందని, దాన్ని కూడా అమలు చేయకుండా పురపాలక శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ అర్వింద్​కుమార్​జాప్యం చేస్తున్నారని సమాచారం. అసలే పని లేని సంస్థ. దానికి తోడు మరో 60 మందికి పే స్కేలు ఎందుకు ఇవ్వాలని అనుకున్నారేమో.. దాంతో ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేయడం లేదంటూ మళ్లీ కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.

ఉమ్మడి రాష్ట్రంలో కుడాకు కేటాయింపులు (రూ.లక్షల్లో)

సంవత్సరం ప్లాన్‌ నాన్‌ప్లాన్‌

2003-04 284.15 5371.94
2004-05 284.15 6267.94
2005-06 284.15 3575.00
2006-07 284.15 425.00
2007-08 284.15 645.95
2008-09 400.00 500.00
2009-10 1250.00 500.00
2010-11 400.00 2375.00
2011-12 400.00 1500.00
2012-13 400.00 1125.00
2013-14 400.00 1125.00
2014-15 265.99 750.00

– తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఉద్యోగులు వేతనాల బిల్లులు పంపించి అధికారులను వేడుకుంటేనే నిధులు విడుదల చేస్తున్నారు. రెండు, మూడు నెలలకోసారి వేతనాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కూడా రెండు నెలలుగా వేతనాలు రాలేదు. ఎప్పుడిస్తరోనని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

విలీనమా? పనుల అప్పగింతా?

ప్రతి నెలా రూ.కోటి దాకా జీతభత్యాల కింద ఖర్చు చేస్తోన్న సంస్థను ఏళ్ల తరబడి తగిన సేవలు తీసుకోకుండా ఖాళీగా ఉంచడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. కుడాను ఇకనైనా ఏదైనా శాఖలో విలీనం చేయడమో, లేదంటే నిధులు కేటాయించి బలోపేతం చేయడమో అనివార్యమని సంస్థ ఉద్యోగులు కోరుతున్నారు. ఎన్నాళ్లని తగినంత పని లేకుండా వేతనాలు తీసుకోవాలంటున్నారు. తాము ఏ శాఖకు పంపినా వెళ్లి సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏడేండ్లుగా ఖాళీగా ఉన్న తమ సంస్థ గురించి పట్టించుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను ఉద్యోగులు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News