మిస్టరీ: తెలంగాణలో వందల మంది ఉద్యోగులు మిస్సింగ్!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ లెక్కల చిట్టా తేలడం లేదు. పలు శాఖల్లో ఉద్యోగులు మిస్సింగ్అయ్యారనే చర్చ పలు శాఖల్లో జరుగుతోంది. అంతేకాకుండా ఉన్నతాధికారులకు తెలియకుండా చాలా మంది విధులకు డుమ్మా కొడుతున్నారు. అసలు ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితి. ప్రతి విభాగం నుంచి జిల్లాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించి సేకరిస్తున్న ఉద్యోగుల లెక్కలు ఇంకా తేలడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ లెక్కల చిట్టా తేలడం లేదు. పలు శాఖల్లో ఉద్యోగులు మిస్సింగ్అయ్యారనే చర్చ పలు శాఖల్లో జరుగుతోంది. అంతేకాకుండా ఉన్నతాధికారులకు తెలియకుండా చాలా మంది విధులకు డుమ్మా కొడుతున్నారు. అసలు ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితి. ప్రతి విభాగం నుంచి జిల్లాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించి సేకరిస్తున్న ఉద్యోగుల లెక్కలు ఇంకా తేలడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మరోవైపు ఆచూకీ లేకుండా విధులకు రాకుండా ఉన్న వారికి నోటీసులు ఇవ్వాలని ఆయా శాఖల్లో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
900పైకా ఉపాధ్యాయులు మిస్సింగ్
రాష్ట్రంలో ప్రభుత్వ పంతుళ్లు కనిపించడం లేదు. కొంతమంది దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన వారి అడ్రస్కూడా లేదని జిల్లాల నుంచి సమాచారం ఇస్తున్నారు. కొద్ది నెలలు మాత్రమే సెలవు పెట్టి మళ్లీ విధులకు రాకుండా ఉన్నవారు కూడా వందల సంఖ్యలో ఉంటున్నారు. అయితే వీరంతా ఎక్కడ ఉన్నారనే విషయం కనిపెట్టడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారు. విద్యాశాఖలో దాదాపు 900 మందికిపైగా ఉపాధ్యాయులు 2012 నుంచి విధులకు రావడం లేదు. కొన్నిజిల్లాల్లో అలాంటి వారిని గుర్తించినా… ఆ తర్వాత అధికారులు కూడా మరిచిపోయారు. ప్రస్తుతం మండలాలు, జిల్లాల వారీగా లెక్కలు తీస్తున్నా… ఉన్నవారికి, కేటాయించిన వారికి మధ్య భారీ వ్యత్యాసం వస్తుందని తెలుస్తోంది. అయితే మిస్సింగ్ అయినట్లు భావిస్తున్న వారిలో అధికారుల నుంచి సెలవు తీసుకున్న వారు కొంతమంది ఉంటే… అనధికారికంగా ఎలాంటి సమాచారం లేకుండా విధులకు వెళ్లని వారు కూడా చాలా మంది ఉన్నట్లు గుర్తిస్తున్నారు.
చాలా శాఖల్లో అస్పష్టమైన రిపోర్టు
రాష్ట్రంలో దాదాపు 50వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేసేందుకు ఇటీవల నిర్ణయం తీసుకున్న కేసీఆర్… నివేదిక అడిగిన విషయం తెలిసిందే. దీంతో అసలు రాష్ట్రంలో ఉద్యోగులు ఎంతమంది, ఎన్ని ఖాళీలున్నాయనే లెక్కలు తీయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ దాదాపు 20 రోజుల నుంచి సాగుతున్నా… ఇంకా ఉద్యోగుల వివరాలు కొలిక్కి రావడం లేదు. ఈ నెల 18 నుంచి ఆయా విభాగాల్లో ప్రతి జిల్లాకు ప్రత్యేకాధికారులను సైతం నియమించారు. వారికి ఉద్యోగుల వివరాలు తీసుకునే పనినే అప్పగించారు. కానీ విద్యాశాఖ, పోలీస్తో పాటు రెవెన్యూలో కూడా ఉద్యోగుల వివరాలపై క్లారిటీ రావడం లేదు. వీటితో పాటు పలు సంక్షేమ శాఖలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ వంటి శాఖల నుంచి ఇంకా లెక్కలు రావడం లేదు. మరోవైపు రాష్ట్రంలో 50 వేల వరకు ఖాళీలున్నాయని సీఎం కేసీఆర్ ఓసారి ప్రకటిస్తే… ఉన్నతాధికారుల జాబితాలో మాత్రం 45 వేలకు చూపించారు. అటు పీఆర్సీ నివేదికలో మాత్రం ఖాళీలు 1.91 లక్షలుగా పేర్కొన్నారు. దీంతో అసలు ఉద్యోగుల లెక్కలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయినప్పటికీ… శాఖల వారీగా ఇంకా లెక్కలు తేలడం లేదు.
మరో 180 మంది వివరాల్లేవ్
దాదాపు 900 మంది ఉపాధ్యాయులతో పాటుగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్లలో దాదాపు 180 మంది వరకు ఉద్యోగుల వివరాలు చిక్కడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై సీఎస్ సోమేశ్‌కుమార్ సైతం పలుమార్లు ఆయా శాఖలకు నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. మొత్తం ఉద్యోగులు, వారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు సెలవులో ఉన్నారు, డిప్యూటేషన్లు ఎక్కడ ఉన్నాయి, మిస్సయిన వారిపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే వివరాలను పంపించాలంటూ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
జిల్లాలన్నింటా అదే పరిస్థితి
రాష్ట్రమంతా ఉద్యోగుల లెక్కలపై నివేదికలు పొంతన కుదరడం లేదు. ప్రతి జిల్లా నుంచి ఇప్పటికే నాలుగైదుసార్లు నివేదికలు పంపించారు. కానీ ప్రతి నివేదికల్లోనూ లెక్కలు సరితూగడం లేదు. దీంతో ఒకసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు శాఖల్లో ఉద్యోగులు మిస్సయినట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వ శాఖ దగ్గర ఉద్యోగుల వివరాలు లేకపోవడంపై ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు నిరుద్యోగులు సైతం మండిపడుతున్నారు. ఖాళీల వివరాలు తేల్చడంలో ఎందుకింత జాప్యం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.