విష సంస్కృతిలో యువత!

సమాజంలో గ్రామీణ పేద, మధ్య తరగతి యువత కాలాన్ని వృధా చేస్తూ వారి చదువులను పది, ఇంటర్‌లకే పరిమితం చేస్తున్నారు. మెజారిటీ యువత

Update: 2024-09-27 00:30 GMT

సమాజంలో గ్రామీణ పేద, మధ్య తరగతి యువత కాలాన్ని వృధా చేస్తూ వారి చదువులను పది, ఇంటర్‌లకే పరిమితం చేస్తున్నారు. మెజారిటీ యువత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో విగ్రహధారణ పేరుతో పూజలు నిర్వహించి తమ విలువైన సమయాన్ని వృధా చేయడానికి పూనుకుంటున్నారు. భక్తి భావం, విగ్రహాలను పూజించడం లాంటివి వారి వారి వ్యక్తిగత విషయం కానీ ఆ విగ్రహాల పేరుతో మనం ఎంత సమయం వృధా అవుతుందో ఒక్కసారిగా ఆలోచన చేద్దాం.

పండగ సంబరాల పేరుతో పూజలు నిర్వహించే యువతలో, ఎంత నిబద్ధత ఉందో, ఎంత భక్తి ఉందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. విగ్రహలు పెట్టడానికి చందాలు వసూల్ చేసి సంబరాలు చేసి, కొంతమంది ఆ వచ్చిన డబ్బులో మిగిలిన దానిని దందాలు చేస్తూ, చిట్టీలు వేస్తూ, మద్యం సేవించడం వంటివి చేస్తున్నారు. కానీ తమకు రావాల్సిన లేదా కావాల్సిన హక్కుల కోసం పది మందిని జతచేసి అడుగు ముందుకు వేయాలనే తపన ఉండడం లేదు.

ఉన్నత లక్ష్యాలను ఎంచుకోకుండా..

ప్రజాస్వామ్యహితంగా జరిగే ఎన్నికలలో స్వచ్చందంగా ఓటు హక్కును వినియోగించుకోకుండా మేము 10 మందిమి ఉన్నామంటూ, ఖర్చులకు డబ్బు, మద్యం ఇతరత్రా అవసరాలు తీర్చుకునేలా వ్యవహరించడం గతంలో కంటే ఈ కాలంలో ఎక్కువ అయింది. అదే పది మంది యువత కలిసి తమ గ్రామ అభివృద్ధి కోసం ప్రశ్నించాలన్న ఆలోచనను మర్చిపోతున్నామన్న విషయాన్ని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేకపోలేదు. ఇలా విగ్రహాలు పెట్టడం, పూజించడం తప్పు పట్టడం లేదు. కానీ ఉన్నత లక్ష్యాలను ఎంచుకోకుండా విగ్రహాలు పెట్టి అక్కడే సమయాన్ని వృధా చేస్తున్నామా? లేదా? మనస్సుతో తేలిక సమయంలో ఆలోచన చేద్దాం. లక్షలాది రూపాయలను ఖర్చుపెట్టి విగ్రహాల వద్ద చీరలు, పండ్లు, ఫలాలు పెట్టి అవి దేవుడివి అని.. వేలం పాట వేసి వాటికి లక్షల రూపాయలు వసూలు చేసి కొనుగోలు చేసిన వారిని గొప్పగా చిత్రీకరించి, కిందిస్థాయి పేద ప్రజలను తక్కువ చేసి చూస్తున్నారు. అలాగే ఆ విగ్రహం ఉన్నన్ని రోజులూ కాలాన్ని వృధా చేస్తూ డీజేలు పెడుతూ మోడ్రన్ విష సంస్కృతి సంప్రదాయాలు, సామ్రాజ్యవాద విష సంస్కృతిలో నిమగ్నమవుతున్నారు. గ్రామాలలో డీజేలు పెట్టి మద్యం తాగి గొడవలు పెట్టుకుని పగలు పెంచుకుని కేసులు నమోదు అయి కోర్టుల చుట్టూ తీరుతున్న యువత లేకపోలేదు. మంచినీటి కంటే కూడా మద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న కాలంలో యువత తాగుడుకి బానిస అయ్యి అనారోగ్యాల బారిన పడి అకాల మరణాలు చెందుతున్నారు. తల్లిదండ్రులకు ముసలితనంలో బుక్కెడు బువ్వ వేయాల్సిన వాళ్లే చిన్న వయస్సులో అకాల మరణంతో తల్లిదండ్రులకు కన్నీటి శోకం మిగిలిస్తున్నారు.

పోటీతత్వం ఇందులోనూ ఉండాలి!

ఇలాంటి చేష్టల వలన తల్లిదండ్రులు కలలుగన్న కలలను సహకారం చేయడంలో ప్రతి ఒక్కరం వెనకడుగు వేసినట్టే తప్ప సాధించింది ఏమీ లేదనే స్పష్టం. అందుకే యువత సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ, వ్యాపారవేత్తగా ఉన్నత లక్ష్యం వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం యువతపై ఉంది. పోటీ ప్రపంచంలో ఉన్నత ఆశయాల వైపు పోటీపడదాం. ఒక బజారులో విగ్రహం పెట్టారని, మన బజారులో విగ్రహం పెట్టాలనే పోటీతత్వం ఉన్నట్లు గానే, ఒక బజారులో ఆ వ్యక్తి ఉన్నత స్థాయిలో ఎదిగాడని, మనం ఎందుకు ఎదగవద్దని, 10 మంది కలిసి గ్రామ, పట్టణ, ప్రాంత అభివృద్ధికి మన పాత్ర కోసం మన స్థానం కోసం అడుగులు వేయాలన్న పోటీ తత్వాన్ని పెంపొందించుకుందాం. నాడు, నేడు సమాజంలో ఉన్నత చదువులు చదివి ప్రజాసమస్యలపై పోరాటాలు చేసి అసువులు బాసిన ఎంతో మంది అమరవీరులు లేకపోలేదు. అలాంటి వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని వారి చరిత్రను అధ్యయనం చేసేందుకు ప్రయత్నం చేద్దాం.

- వేముల గోపీనాథ్

తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు

96668 00045

Tags:    

Similar News