యూకే పీఎంగా మన యువ‌ రిషీ సునక్

‘యూకే ప్రధానమంత్రిగా పదవిని చేపట్టి ఆ దేశం ఎదుర్కొంటున్న పలు గంభీర సమస్యలకు రిషీ ..Latest Telugu News

Update: 2022-10-25 18:45 GMT

'యూకే ప్రధానమంత్రిగా పదవిని చేపట్టి ఆ దేశం ఎదుర్కొంటున్న పలు గంభీర సమస్యలకు రిషీ సత్వర పరిష్కారాలు చూపుతూ భారతీయ సంతతి సత్తాను చాటాలని కోరుకుందాం. ప్రస్తుతం యూకేలో పెరిగిన ద్రవ్యోల్బణం, తరిగిన నిధులు, పెరిగిన అప్పులు, కుంటుపడిన అభివృద్ధి, ఆర్థిక లోటు లాంటివని ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.

ఉన్నత వ్యక్తిత్వం, అత్యుత్తమ నైతికత,‌ ఆర్థిక వ్యవహారాలలో లోతైన ప్రతిభ కలిగిన సునక్‌ రిషీ యూకే ప్రధానిగా తన ప్రతిభను చాటుతూ, బ్రిటన్‌తో పాటు ప్రపంచ మానవాళి శాంతి, శ్రేయస్సులకు ఊతం ఇవ్వాలని కోరుకుందాం. 'ఆల్‌ ది బెస్ట్‌ రిషీ సునక్. ఇండియన్స్‌ ఆర్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ అండ్ ఫర్‌ యువర్ పాపులర్‌‌ పర్సనాలిటీ'

దీపావళి వేడుకల వెలుగులలో విరాజిల్లుతున్న భారతీయులను మరో శుభవార్త ఆనంద డోలికలలో ముంచెత్తింది. పాక్‌తో క్రికెట్‌ ఆటలో కొహ్లీ బ్యాటింగ్‌ మెరుపులు, యూకేలో రిషీ సునక్ ప్రధానిగా ఎంపికతో భారతావని తేజోమయం గా మారిపోయింది. భారతీయ సంతతికి చెందిన 42 యేండ్ల యూకే మాజీ ఎక్స్‌చెక్కర్‌ చాన్స్‌లర్‌, మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టడానికి ఏకగ్రీవంగా ఎంపిక కావడం ప్రతి భారతీయుడికి గర్వకారణంగా తోస్తున్నది.

రెండు శతాబ్దాలకు పైగా భారత్‌ను అప్రజాస్వామ్యయుతంగా వలసపాలన వలలో బంధించి, దేశ ఆస్తులను కొల్లగొట్టిన ఆంగ్లేయుల దేశమైన యూకేలో ప్రజాస్వామ్యయుతంగా పాలనా పగ్గాలు చేపట్టడానికి భారత సంతతికి చెందిన రిషీ సునక్ ఎంపిక కావడం ఓ అద్భుత సంతోష సందర్భమే.

బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా అనంతరం జరుగుతున్న పరిణామాలలో కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిగానే కాకుండా ప్రధానిగా ఎన్నికల బరిలో నిలిచిన సునక్, లిజ్‌ ట్రస్ చేతిలో ఓటమి పాలయ్యారు. కేవలం 44 రోజులలోనే దేశ ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణాలను అదుపు చేయడంలో లిజ్‌ ట్రస్‌ విఫలం కావడంతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

నేడు మరో సారి కన్జర్వేటివ్‌ పార్టీ ఏకగ్రీవ ఎంపికతో‌ రిషీ సునక్ ప్రధానమంత్రి పదవికే కాకుండా, పార్టీ నాయకుడిగా జంట పదవులు చేపట్టనున్నారు‌. పలు కుంభకోణాలు, ఆరోపణల నడుమ బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని పదవి నుంచి తప్పుకోవలసి రావడం మనకు తెలుసు.

పార్టీలో రిషీ సునక్ పోటీదారులుగా మాజీ పీఎం బోరిస్‌‌ జాన్సన్‌తో పాటు మాజీ ట్రేడ్‌ మినిస్టర్‌ పెన్నీ మోర్డాంట్‌ (67) కూడా నిలిచి విఫలయత్నం చేసారు.

వ్యక్తిగత జీవితం

సౌథాంప్టన్‌, యూకేలో భారతీయ పంజాబీ తల్లితండ్రులు యష్వీర్‌, ఉషా సునక్‌ దంపతులకు 12 మే 1980న జన్మించిన రిషీ సునక్ పాఠశాల విద్యను విన్‌చెస్టర్‌ కాలేజీలో,‌ 2001లో డిగ్రీ (ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనమిక్స్‌)ని లింకన్‌ కాలేజీ, ఆక్సఫర్డ్‌లో పూర్తి చేశారు. విద్యార్థిగా సెలవులలో హోటల్‌ వెయిటర్‌గా కూడా పని చేసిన రిషీ 2006లో ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌ పొంది స్టాన్ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా పొందారు.

2009లో ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి కూతురు తన సహచర స్టాన్ఫర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థిని అక్షత మూర్తిని వివాహం చేసుకున్నారు. 2001-04 మధ్య బ్యాంక్‌ కన్సల్‌టెంట్‌గా, ఫండ్‌ మెనేజర్‌గా ఉద్యోగాలు చేసిన‌ అనంతరం చిల్డ్రన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో పార్ట్‌నర్‌గా చేరారు.

ఈ వ్యాపారంలో తృప్తి చెందని రిషీ తన మిత్రులతో కలిసి హెడ్జ్‌ ఫండ్ స్థాపించి లాభాల బాట పట్టించారు. తన మామగారైన ఇన్ఫోసిస్‌ ఎన్‌‌ఆర్‌ నారాయణమూర్తికి చెందిన కటామరన్‌ వెంచర్స్‌‌ కంపెనీకి డైరెక్టర్‌గా సేవలందించారు.

హిందూ మతస్థుడైన రిషీ సునక్‌ భగవద్గీత సాక్షిగా పదవీ ప్రమాణం చేశారు. యూకే అత్యంత సంపన్నుల జాబితాలో 222వ స్థానంలో నిలిచిన రిషీ సునక్‌ వ్యక్తిగతంగా ఆల్కహాల్ సేవనానికి‌ దూరంగా ఆద్శవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

రాజకీయ జీవితం

2014లో కన్సర్వేటివ్‌ పార్టీ అభ్యర్థిగా యార్క్స్‌, రిచిమండ్‌ స్థానం నుంచి ఎంపిక కాబడిన రిషీ, 2015 యూకె సాధారణ ఎన్నికలలో ఎంపీగా గెలుపొంది 2017 వరకు 'పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల కమిటీ' సభ్యుడిగా పని చేశారు. 2017 సాధారణ ఎన్నికలలో మరోసారి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచి 2018-19 కాలంలో 'పార్లమెంటరీ అండర్‌ సెక్రెటరీ'గా సేవలందించారు.

2019లో 'ట్రెజరీ చీఫ్‌ సెక్రటరీ'గా నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా తిరిగి ఎంపికైన రిషీ 2020-2022 మధ్య 'యూకె ఎక్స్‌చెక్కర్‌ చాన్స్‌లర్'‌గా కొనసాగారు. ఇన్వెస్ట్‌మెంట్‌ అనలిస్ట్‌, వ్యాపారి, రాజకీయ నాయకుడైన రిషీ సునక్‌ నేడు యూకే ప్రధానమంత్రిగా పదవిని చేపట్టి ఆ దేశం ఎదుర్కొంటున్న పలు గంభీర సమస్యలకు రిషీ సత్వర పరిష్కారాలు చూపుతూ భారతీయ సంతతి సత్తాను చాటాలని కోరుకుందాం.

ప్రస్తుతం యూకేలో పెరిగిన ద్రవ్యోల్బణం, తరిగిన నిధులు, పెరిగిన అప్పులు, కుంటుపడిన అభివృద్ధి, ఆర్థిక లోటు లాంటివని ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఉన్నత వ్యక్తిత్వం, అత్యుత్తమ నైతికత,‌ ఆర్థిక వ్యవహారాలలో లోతైన ప్రతిభ కలిగిన సునక్‌ రిషీ యూకే ప్రధానిగా తన ప్రతిభను చాటుతూ, బ్రిటన్‌తో పాటు ప్రపంచ మానవాళి శాంతి, శ్రేయస్సులకు ఊతం ఇవ్వాలని కోరుకుందాం. 'ఆల్‌ ది బెస్ట్‌ రిషీ సునక్‌. ఇండియన్స్‌ ఆర్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ అండ్ ఫర్‌ యువర్ పాపులర్‌‌ పర్సనాలిటీ'

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

కరీంనగరం, 9949700037


Similar News