రైతు బాంధవుడు యలమంచిలి శివాజీ

రాజకీయాలు అధికారాన్ని అందుకోవడానికి నిచ్చెన మెట్లు మాత్రమే కాదు. ఉన్నతమైన మానవ విలువలను పెంపొందించి వాటిని భావితరాలకు

Update: 2024-07-28 00:45 GMT

రాజకీయాలు అధికారాన్ని అందుకోవడానికి నిచ్చెన మెట్లు మాత్రమే కాదు. ఉన్నతమైన మానవ విలువలను పెంపొందించి వాటిని భావితరాలకు అందించడమే రాజకీయాల లక్ష్యం కావాలి’ అని తనకు తాను నిర్దేశించుకోవటమే గాక ఇప్పటికీ అదే పంథాలో పయనిస్తున్న రైతు నాయకుడు డాక్టర్ యలమంచిలి శివాజీ. రాజ్యసభలో ఎంతోమంది హేమాహేమీలు ఉన్నప్పటికీ తనదైన శైలిలో రాణించి ఏడుపదుల పైబడిన వయసులోనూ తన రచనలు, వ్యాసాలు, ఉపన్యాసాల ద్వారా వివిధ సామాజిక అంశాల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు శివాజీ.

వర్తమాన రాజకీయ యవనికపై శివాజీ వంటి బహుముఖ ప్రజ్ఞ కలిగిన నాయకులు వేళ్ల మీద లెక్కించగలిగినంత మంది కూడా లేరు. 1988 నుంచి 94 వరకు రాజ్యసభ్యునిగా మాత్రమే శివాజీ ఎంతోమంది నాయకులకు తెలుసు. కానీ ఆయన జీవన యానంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. ఆయనలోని ప్రత్యేకత, గొప్ప తనం, ఉన్నత వ్యక్తిత్వం అవగతం అవుతుంది.

ఎమర్జెన్సీలో తొలి డిటెన్యూ

1975 జూన్ 26వ తేదీన దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించటానికి ఒకరోజు ముందు అంతరంగిక భద్రతా చట్టం క్రింద శివాజీ అరెస్టు అయ్యా రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ చట్టం క్రింద అరెస్టు అయిన తొలి డిటెన్యూ శివాజీయే. తాను న్యాయవాది కాకపోయినప్పటికీ ఆ సమయంలో తన మీద నమోదైన కేసును హైకోర్టులో తానే వాదించుకుని శివాజీ సంచలనం సృష్టించారు. 1977 జనవరి 18-23 తేదీల మధ్య దేశంలోని విపక్షాలన్నీ సమైక్యంగా ఒకే పార్టీ పేరుతో ఒకే ఎన్నికల చిహ్నంతో, ఒకే జండా, అజెండాతో పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ ఎన్నికలలోనే శివాజీకి పోటీ చేసే అవకాశం లభించినప్పటికీ ఆర్థిక స్థోమత లేని కారణంగా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. చౌధురీ చరణ్ సింగ్, ఎన్నికల్లో పోటీ చేసేందుకు లక్ష రూపాయలు ఇస్తానని కబురు పంపినప్పటికీ, శివాజీ తాను అందుకు సరిపోనని పక్కకు తప్పుకొని వేరొకరిని పోటీకి ఒప్పించారు.

శివాజీని సిఫార్సు చేసిన మసానీ

1984లో తెలుగుదేశం పార్టీ లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు ఎన్టీఆర్. ఆ సమయంలో ప్రముఖ పార్లమెంటేరియన్ మినూ మసానీ ఎన్టీఆర్‌కు సలహా ఇస్తూ, 'డాక్టర్ శివాజీని మీరు ఒక నియోజకవర్గానికి మీ పార్టీ అభ్యర్థిగా నిర్ణయిస్తే బాగుం టుంది. మీ రాష్ట్రానికి, మీ పార్టీకి దానివల్ల ప్రయోజనం కలుగుతుందని’ లేఖ రాశారు. దీంతో ఎన్టీఆర్ సైతం ఆ ఎన్నికల్లో శివాజీని గుంటూరు లోకసభ స్థానం అభ్యర్థిగా నిలుపుతున్నట్టు ప్రకటించి చివరి నిమిషంలో ఆ స్థానంలో వేరొకరిని అభ్యర్థిగా ప్రకటించారు. జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న మినూ మసానీ వంటి నాయకుడు అప్పటివరకూ ఏ ఎన్నికలోనూ పోటీ చేయని, శివాజీ వంటి ఒక సామాన్యుని గురించి సిఫార్సు లేఖ రాయటం నిజంగా గొప్ప విషయం. అనంతరం 1986లో రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ చివరి నిమిషంలో అది చేజారిపోయింది. ఎట్టకేలకు 1988లో శివాజీని ఎన్టీఆర్ రాజ్య సభకు ఎంపిక చేశారు. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేయడానికి ముందు శివాజీ ఢీల్లీ లోని చరణ్ సింగ్ సమాధి వద్దకు వెళ్లి తాను జీవితాంతం రైతు జనోద్ధరణకు పాటుపడతానని ప్రమాణం చేయటం ఆనాటి జాతీయ పత్రికలు అన్నింటిలోనూ ప్రముఖంగా ప్రచు రితం అయింది.

రైతుల పాలిట 'గోల్డెన్ పీరియడ్'

డా. శివాజీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమ యంలో రైతులకు స్వర్ణయుగం అని చెప్ప వచ్చు. రాజ్యసభ సభ్యుడు కాకముందు నుంచే శివాజీ పొగాకు, పత్తి రైతుల సమస్యలపై పోరాడేవారు. 1988వ సంవత్సరం వరకు లెక్కకు మిక్కిలిగా జరుగుతున్న పత్తి రైతుల ఆత్మహత్యలు దేశ వ్యాప్తంగా కల వరం సృష్టించాయి. పత్తి రైతుల సమస్యలపై అధ్యయనం చేసిన శివాజీ, వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేశా రు. పార్లమెంట్ లోపల బయటా ఎంతోమందిని కలుస్తూ పత్తి రైతుల సమస్యల పరి ష్కారం కోసం నిరంతర పోరాటం జరిపేవారు. ఫలితంగా 1988 నుంచి డాక్టర్ శివా జీ రాజ్యసభ సభ్యత్వం ముగిసే 1994 వరకు ఒక్క పత్తి రైతు ఆత్మహత్య జరగకపోవటం విశేషం. ఒక రకంగా ఆ సమయం రైతుల పాలిట 'గోల్డెన్ పీరియడ్' గా పేర్కొనవచ్చు.

రుణమాఫీని సాధ్యం చేసిన నేత!

అప్పట్లో నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఎన్. టి రామారావు రైతు రుణమాఫీ చేయాలని మ్యానిఫెస్టోలో పొందుపరచారు. సహజం గా ఏ రాజకీయ పార్టీకి అయినా ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలు కాలక్రమంలో అటకెక్కుతుంటాయి. అయితే శివాజీ ఆ అంశాన్ని చేపట్టి పార్లమెంట్‌లో పట్టువదలని విక్రమార్కునిలా పోరాడిన కారణంగా రైతు రుణమాఫీ జరిగింది. అది అప్పట్లోనే ఒక రికార్డు. రైతు రుణమాఫీ కోసం శివాజీ పడిన కష్టం సాధారణ నాయకులెవరికీ సాధ్యం కాదు. శివాజీలోని సంకల్పబలమే ఆయనను ఆ దిశగా ముందుకు నడిపించింది. శివాజీ ఆర్థిక శాస్త్రాన్ని అధ్య యనం చేయకపోయినా ఆ దిశగా ఎంతో పరిశీలన చేశారు. చాలామంది శివాజీ‌ని ఎకనామిస్ట్‌గా భావిస్తారు. 1989 నుంచి 2023 వరకు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌ల న్నింటిలో శివాజీ పాత్ర ఉన్నదనే విషయం చాలామందికి తెలియదు. కేంద్ర ఆర్థికమంత్రిగా ఏ పార్టీకి చెందిన వారున్నా, బడ్జెట్ సమావేశాలకు ముందు శివాజీ అభిప్రాయాలూ పంపించాల్సిందిగా లేఖ రాయడం ఆనవాయితీగా మారింది. గత ఏడాది బడ్జెట్ వరకూ అదే ఆనవాయితీ కొనసాగింది. శివా జీ ప్రతిపాదనల్లో చాలావరకు బడ్జెట్‌లో చోటుచేసుకునేవి.

(నేడు డాక్టర్ యలమంచిలి శివాజీ జన్మదినం)

- శాఖమూరు శ్రీనివాస ప్రసాద్,

జర్నలిస్టు, గుంటూరు

70326 14864

Tags:    

Similar News