వరల్డ్ వాక్: శాంతి చర్చలు సాధ్యమేనా
World Walk: is Ukraine-russia Peace Talks Possible
దాదాపు 11 నెలలుగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచాన్ని ఎంతగానో పీడిస్తున్నది. ఈ యుద్ధం వలన కొన్ని దేశాలకు చమురు, ఆహార ధాన్యాల సరఫరా జరగడం లేదు. ప్రపంచదేశాలలో ఆర్థిక మాంద్యం మరింత పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితులలో ఈ రెండు దేశాలు శాంతి చర్చలకు సుముఖత తెలిపాయనే వార్త సంతోషం కలిగించేలా ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ గత నెలలో తాను శాంతి చర్చలకు సిద్ధమేనని అయితే తమ భద్రత విషయంలో మాత్రం రాజీపడబోమని, అలాగే సరిహద్దుల్లో కొత్త అలైన్మెంట్ సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలని, అంతేకాకుండా నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదని పుతిన్ ప్రతిపాదించారు. దీనికి ఉక్రెయిన్ తాము చర్చలకు సిద్ధమేనని అయితే, యుద్ధ నేరస్థుల ట్రిబ్యునల్ ముందు రష్యా హాజరుకావాలని అలాగే తమకు పూర్తి స్వేచ్ఛ సార్వభౌమాధికారం కావాలని, ఏ దేశ అధిపత్యం ఉండొద్దని తమ నుంచి ఆక్రమించుకున్న ప్రాంతాలు తిరిగి ఇచ్చేయాలన్నది ఆ దేశ ప్రతిపాదన. అయితే ఇలా ఈ రెండు దేశాల ప్రతిపాదనలు చూసి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ వీటి మధ్య శాంతి చర్చల వాతావరణం కనుచూపుమేరలో కూడా లేదని వ్యాఖ్యానించారు.
యుద్ధం ఆగాలని
ఆర్థికంగా, మిలటరీ పరంగా కూడా ఉక్రెయిన్ రష్యాకు సాటిరాని దేశం. మిలిటరీ పరంగా రష్యా ఐదవ దేశంగా ఉండి రెండు కోట్ల సైనిక బలగం ఉంది. దానికి తోడు ఆధునిక ఆయుధాలు, న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉంది. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభించినప్పుడు కొద్ది రోజుల్లోనే ఉక్రెయిన్‌ను స్వాధీనపరచుకోగలమని పుతిన్ భావించాడు. కానీ ఉక్రెయిన్, రష్యాకు లొంగకుండా ఎంతో మానసిక ధైర్య సాహసాలు ప్రదర్శించి తన శక్తి తక్కువ ఉన్నా కూడా ఇతర దేశాల సహాయం తీసుకుని రష్యాను నిలువరిస్తోంది. ఈ యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న తమ స్థావరాలపై ఉక్రెయిన్ సైనికులు భీకర దాడులు చేస్తున్నారు. రష్యా సైతం అదే స్థాయిలో ఉక్రెయిన్ పై శతఘ్నులతో దాడి చేస్తుంది. ఈ కారణంగా ఉక్రెయిన్ లో ఆస్థి నష్టం ఎక్కువగా జరుగుతుంది. పుతిన్ శాంతి చర్చల పేరుతో యుద్ధాన్ని నిలిపివేయించి వెనకనుండి ఆయుధాలను సరిచేసుకుంటాడేమోననే అనుమానాన్ని అమెరికా వ్యక్తం చేసింది. దీనిని నిజం చేస్తూ జనవరి 6,7 న 36 గంటల విరమణ ప్రకటిస్తూనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. ఈ రకంగా శాంతి ప్రతిపాదనలను, రష్యా వాదనని నమ్మాలో నమ్మవద్దు కూడా తెలియని పరిస్థితి.
భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా యుద్ధం ఆగితే బాగుంటుందని దీనివలన ఎన్నో దేశాలకు మేలు జరుగుతుందని, ఇప్పుడు యుద్దాల కాలం కాదని ప్రకటించాడు. ఈ స్థితిలో యుద్ధం ఆగితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇలా శాంతి చర్చలు ప్రతిపాదించిన దేశాలు తమ పంతాలు వీడి తమకు తామే చర్చించుకుంటాయా లేదా మధ్యవర్తులను కోరుతాయా అన్న విషయం స్పష్టం కాలేదు. అగ్రరాజ్యమైన రష్యా చిన్న దేశమైన ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తుందా లేదా శాంతికి సిద్ధమవుతుందా అనే విషయంలో వేచి చూడాలి. మొత్తంమీద ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆగి శాంతియుత పరిస్థితి ఏర్పడితే బాగుంటుందని ఐక్యరాజ్యసమితితో సహా ఇతర కూటములు కోరుకుంటున్నాయి. మరి ఏం జరగనుందో వేచి చూడాలి.
శ్రీ నర్సన్
జర్నలిస్ట్, కాలమిస్ట్
8328096188