ద‌ర్జా‌ లేని ద‌ర్జీ బ‌తుకులు

World Tailors Day importance

Update: 2024-02-28 00:45 GMT

నేతన్న, దర్జీ లేని సమాజాన్ని ఊహించలేం. శరీరాన్ని అందంగా తీర్చిదిద్దే బట్టలు, ఆడంబరమైన దుస్తులు డాంబికతను సూచించడంతో పాటు వ్యక్తి సంస్కారాన్ని తెలియజేస్తాయి. కుట్టు యంత్రం మానవజాతి చరిత్రలో ఇప్పటివరకు చేసిన అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక ఆవిష్కరణలలో ఒకటిగా పేర్కొన్నారు.

మొట్టమొదటిసారిగా ఎలియాస్ హోవే అనే అమెరికన్ మెషినిస్ట్ 1845లో మొట్టమొదటి కుట్టు యంత్రాన్ని కనుగొన్నాడు. ఆయన ఒక నిరుపేద. పత్తి కర్మాగారంలో యంత్రం మెషినిస్ట్‌గా పని చేసేవారు. హోవే జీతం తక్కువ ఉండటంతో కుటుంబాన్ని పోషించడం కోసం తన భార్య ఇంట్లో ఇతరులకు చేతితో బట్టలు కుట్టేవారు. వారి శ్రమను గుర్తించి ఆరు నెలలు కృషిచేసి హోవే చేతి కుట్టు ప్రక్రియను యాంత్రికీకరించే మార్గాలను దృశ్యమానం చేశారు. మొదటిసారిగా 1845 ఫిబ్రవరి 28న కుట్టుమిషన్‌ను కనిపెట్టాడు. ప్రపంచ చరిత్రలో అత్యంత ఉపయోగకరమైన యంత్రంగా, ప్రపంచం మొత్తం గర్వపడేలా దీనిని రూపొందించారు. ఈ కుట్టుమిషన్‌ను ఆవిష్కరించిన రోజునేే ప్రపంచ టైలర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

మన దేశంలో టైలర్ వృత్తి పై ఆధారపడి జీవించే వారు చాలా మంది ఉన్నారు. రెడీమేడ్ బట్టలు మార్కెట్ లోకి రాకముందు టైలర్లకు చేతినిండా పని ఉండేది. పండగల సమయంలోనైతే అందరూ పండుగ ఆనందంలో కుటుంబ సభ్యులు గడుపుతుంటే, దర్జీలకు మాత్రం తినటానికి సమయం లేని సందర్భాలు ఉంటాయి.

కుదేలవుతున్న కుట్టు మెషిన్

నేడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ రెడీమేడ్ దుస్తులు అందుబాటులో ఉండేలా ఫ్యాషన్ డ్రెస్ ఉత్పత్తుల పరిశ్రమలు విస్తరించాయి. కొత్త కొత్త డిజైన్లతో టీ షర్ట్, జీన్స్ ప్యాంట్లు, షాట్లు, రకరకాల దుస్తులు మార్కెట్‌లోకి వచ్చాయి. యువత ఆసక్తిని ఆదాయ వనరుగా మార్చుకోవడానికి పెద్ద కంపెనీలు నగరాలతో పాటు చిన్న పట్టణాలు మరియు గ్రామాలకు విస్తరించాయి. దీంతో గ్రామంలో నివసించే వారు సైతం స్టైల్ వైపు ఆకర్షితులై రెడీమేడ్ పై మక్కువ చూపుతుండటంతో టైలర్లకు ఉపాధి కరువవుతోంది. ఫ్యాషన్ డిజైన్ మోజులో పడి టైలర్‌తో కుట్టించుకునేవారు గణనీయంగా తగ్గిపోయారు. అంతే కాకుండా దుస్తుల తయారీకు సంబంధించిన ముడి సరుకు‌ ధరలు పెరగడంతో టైలర్స్‌కి గిట్టుబాటు ధర లేక వృత్తికి తిలోదకాలు వదిలే పరిస్థితి ఏర్పడింది.

సరైన ఉపాధి కల్పించాలి

రెడీమేడ్ రాకతో ఉపాధి కోల్పోయిన టైలర్స్‌కి ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటల్‌లో ఇతర ప్రభుత్వ రంగాలలో యూనిఫాం వంటి పనులు టైలర్స్‌కి ఇచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యూనిఫామ్ వంటి పనులు చేనేత కార్మికులకు, టైలర్స్‌కి ఇవ్వడం వల్ల రెండు రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశముంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం టైలర్స్‌కి ఉపాధి కల్పించడంలో సరైన ఆలోచన చేయాలి. టైలర్లకు ఉచితంగా కరెంట్, హెల్త్ కార్డు, కుట్టు మిషన్ అందించి వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలి.

(నేడు ప్రపంచ టైలర్ల దినోత్సవం)

కోట దామోదర్

93914 80475

Tags:    

Similar News