పిచ్చుకమ్మా నీ జాడెక్కడ!

World Sparrow Day 2024 History and Significance

Update: 2024-03-20 00:30 GMT

పిచుకంతలేవు ఎందుకురా అలా ఎగురుతావు...పిట్ట కొంచెం కూత ఘనం, పిట్ట ప్రాణం, పిట్ట నడుము, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం.... ఇలా నిత్య జీవితంలో ప్రతి సందర్భంలో పిచ్చుకలను మనం గుర్తుచేసుకుంటునే ఉంటాం. పిచ్చుకలు ఒకనాడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. నాడు గ్రామాలలోని ఇళ్ల ముంగిట ఇవి గుంపులుగా వాలడం ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా ఉండేవి.

పిచ్చుక పాసరిడే కుటుంబానికి చెందిన చిన్న పక్షి. దీని శాస్త్రీయ నామం పాసర్ డొమెస్టికస్. పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే మానవుల మనుగడకే ప్రమాదం అని గుర్తించిన ప్రపంచదేశాలు అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడుకొనేందుకు వాటి మనుగడ కొనసాగి భావితరాలకు వాటి ప్రాముఖ్యతను తెలిపేందుకు వీటిపై అవగాహన కలిగించేందుకు, చైతన్యం తీసుకురావడానికి 2010 నుండి మార్చి 20వ తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుతున్నారు.

10 వేల నుంచి 5 వందల వరకు..

గతంలో రైతులు పిచ్చుకల ఆహారం కొరకు వరి కంకులను సేకరించి గుత్తులుగా కట్టి ఇంటి చూరుకు వేళ్ళాడే విధంగా ఉంచేవారు. ప్రస్తుత కాలంలో పంటలు లేక వాటికీ ఆహారం దొరకక అనేక కారణాల వలన పల్లెల్లో పిచ్చుకలు కనబడడం లేదు. ప్రస్తుతం ఖాళీ స్థలాలు కనుమరుగవుతున్నాయి .. ఆకాశ హర్మ్యాలు పెరుగుతున్నయి.. గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్న చెట్లు..సెల్‌ఫోన్ల నుండి వెలువడుతున్న రేడియోధార్మికత ఇవన్నీ కలిసి ఒకప్పుడు కిలకిలా రావాలతో కళకళలాడిన పిచ్చుకలు అంతర్ధానమవ్వడానికి ప్రధాన కారణం. మెల్లమెల్లగా పిచ్చుక అరుదైన పక్షి జాబితాలోకి చేరిపోయింది.

ఇది ప్రతి ఒక్కరి బాధ్యత!

పిచ్చుకల సంరక్షణకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఇవి గుప్పెడు గింజలు తింటూ మనకు హాని కలిగించే ఎన్నో రకాల క్రిమి కీటలకాలను నాశనం చేస్తాయి. ఇవి పొలాల్లో తిరగడం వల్ల క్రిమీకీటకాలు నాశనమై పంటలు బాగా చేతికొస్తాయి. వాటి కిలకిలరావాలు మనలో మానసిక ప్రశాంతని పెంచుతాయి. ఇలా మనకు ఇంత మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాలంటే ప్రభుత్వం పాఠశాల స్థాయి నుండే విద్యార్ధుల పిచ్చుకలపై అవగాహన కల్పించాలి. స్వచ్ఛంద సంస్థల ద్వారా సెమినార్లు, వర్క్ షాపులు నిర్వహించాలి. పాఠ్యపుస్తకాల్లో అంతరించిపోతున్న జీవులు వాటిల్లో పిచ్చుకల ప్రాముఖ్యత తదితర అంశాలను పాఠ్యంశాలుగా చేర్చాలి.

(నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం)

- సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Tags:    

Similar News