మహిళా కార్మికులు బానిసలా...

గ్రామీణ భారతదేశంలో కళాశాల విద్య కోసం వెళ్లే మహిళల సంఖ్య కూడా పెరిగింది....

Update: 2024-07-19 23:00 GMT

గ్రామీణ భారతదేశంలో కళాశాల విద్య కోసం వెళ్లే మహిళల సంఖ్య కూడా పెరిగింది. ఈ పరిస్థితిలో బహుళజాతి బ్రాండ్ల మొబైల్ ఫోన్లు, ప్లాస్టిక్ సామాను, ఇతర వినియోగ వస్తువులను విదేశీ మార్కెట్లకు తయారు చేయడం, అసెంబ్లింగ్ చేయడం, సరఫరా చేయడం వంటి పనులలో అసెంబ్లీ లైన్లలో కంపెనీలు మహిళా కార్మికులను నియమిస్తున్నాయి.. తక్కువ వేతనం చెల్లించే ఇలాంటి అసెంబ్లింగ్ శ్రామిక శక్తిలో 80 శాతం మహిళలు ఉన్నారు. మహిళలు అత్యంత వేగంతో విరామం లేకుండా పని చేసేలా కఠినమైన పర్యవేక్షణలో పని చేయిస్తున్నారు. ఏ సమయంలోనైనా వారికి రెండు రోజుల కంటే ఎక్కువ సెలవులను అనుమతించడం లేదు. ఏదైనా సెలవు పొడిగిస్తే వారు ఉద్యోగాలు కోల్పోతున్నారు.

కంపెనీ రిక్రూటర్ కాంట్రాక్టర్లు దేశం లోని చిన్న నగరాలు పట్టణాలలోని కాలేజీలను సందర్శించి, పాస్ ఔట్ గ్రాడ్యుయేట్‌లకు సాధారణ సంపాదనతో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. కంపెనీకి, మహిళలను నియమించుకోవడంలో స్పష్టమైన ప్రయోజనం ఉంది. వారు సున్నిత పరికరాలను అసెంబుల్ చేయడానికి ఎక్కువ గంటలు కేంద్రీకరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పైగా వారు మగ కార్మికుల కంటే తక్కువ విరామం తీసుకుంటారు. ముఖ్యంగా, పురుషులకు చెల్లించే దానికంటే తక్కువ వేతనాలతో మహిళలు పని చేయటానికి సిద్ధపడుతున్నారు. కొన్ని కంపెనీలు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలను మాత్రమే నియమిస్తున్నాయి.

హాస్టల్స్ కాదు జైళ్లు

వారికి ఉచిత వసతి, బోర్డింగ్ హామీ ఇచ్చినప్పటికీ, అయితే వాస్తవికత ఏమిటంటే, కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లచే నిర్మించబడిన జైళ్ల వంటి హాస్టళ్లలో నివసించడానికి మహిళల కార్మికులను ఒత్తిడి చేస్తున్నాయి. కుటుంబాలకు దూరంగా ఉండే వీరిని, భద్రత పేరుతో హాస్టళ్లలో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మహిళలు తమ హాస్టళ్ల నుండి బయటకు వెళ్లడానికి, విరామ కార్యక్రమాల కోసం బయటకు వెళ్లడానికి అనుమతించడం లేదు బయటి నుండి ఎవరికీ ప్రవేశం లేదు. వారి దినచర్య కేవలం ఫ్యాక్టరీలో పని చేసి మరల హాస్టల్ తిరిగి రావడం మాత్రమే. మహిళా ఉద్యోగులను ఒక గదిలో ఆరుగురిని కుక్కుతున్నారు. పగటిపూట చాలా గంటలు నీరు లేకుండా, అపరిశుభ్రంగా, అధ్వానంగా ఈ హాస్టల్స్ ఉంటాయి. దీంతో మహిళలు హాస్టల్‌లో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను ఉపయోగించరు. ఫ్యాక్టరీకి చేరుకునే వరకు వేచి ఉంటారు. హాస్టల్‌ లోని నివాసితులకు అందించే ఆహారం కూడా అపరిశుభ్రంగా ఉంటుంది. హాస్టళ్లలో జీవన పరిస్థితులు సంతృప్తికరంగా లేవని వారు బాధ పడుతూనే ఉన్నారు.

అసెంబ్లింగ్ మహిళా కార్మికులు

ముంబై, హైదరాబాద్, ఇతర ప్రధాన మహానగరాల ఉపగ్రహ పట్టణాలలో వందలాది కర్మాగారాలు ఉన్నాయి. పెద్ద నగరాల నుండి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీ హబ్‌లలో ఉన్న కంపెనీలు అసెంబ్లీ లైన్‌లో మహిళలను నియమించుకుంటాయి. ఫోన్‌లు, అచ్చుపోసిన ఆహార నిల్వ కంటైనర్‌లు, విదేశాలకు రవాణా చేసే ఇతర గృహోపకరణాల ఉత్పత్తిలో మహిళా కార్మికులకు కనీస వేతనాల కంటే తక్కువ వేతనం ఇస్తున్నారు. ఒక ఫ్యాక్టరీలో, 12 సంవత్సరాలకు పైగా పనిచేసిన వారికి నెలకు రూ.12,000 చెల్లిస్తారు. వీరికి వెన్షన్ వంటి ఉద్యోగుల ప్రయోజనాల రక్షణ బాధ్యతలను తప్పించుకుంటాయి. కాంట్రాక్టు పద్ధతిలో ఒకేసారి పదకొండు నెలల పాటు నియమించుకొని కొన్ని రోజుల విరామం తర్వాత తాజా ఒప్పందంపై మళ్లీ నియమిస్తున్నారు. చైనా స్థానంలో ప్రపంచ కర్మాగారంగా భారత్ మారాలని ఆకాంక్షిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో, పెద్ద కంపెనీలు భారతదేశంలో తమ తయారీ అసెంబ్లింగ్ కేంద్రాలను స్థాపిస్తున్నాయి. ఈ కంపెనీలు పెద్ద సంఖ్యలో మహిళలను నియమించుకుంటాయి. మహిళలు దోపిడీకి గురికాకుండా వారు ఆర్ధిక, సామాజిక స్వావలంబన వైపు నడిచేలా అందరు కృషి చేయాలి.

ఆళవందార్ వేణు మాధవ్

86860 51752


Similar News