ఈ దౌత్య మంత్రంతో శాంతి ప్రభవించేనా?

ఇది యుద్ధానికి సమయం కాదు. యుద్ధభూమిలో పరిష్కారాలు కనుగొనలేం. ఇది భారతదేశం తీసుకున్న స్పష్టమైన, స్థిరమైన వైఖరి. రష్యా

Update: 2024-08-23 00:45 GMT

ఇది యుద్ధానికి సమయం కాదు. యుద్ధభూమిలో పరిష్కారాలు కనుగొనలేం. ఇది భారతదేశం తీసుకున్న స్పష్టమైన, స్థిరమైన వైఖరి. రష్యా, ఉక్రెయిన్ రెండింటితో గణనీయమైన స్వతంత్ర సంబంధాలను భారతదేశం కలిగి ఉంది. ఈ రెండు దేశాల మధ్య 30 సంవత్సరాల క్రితం ఏర్పడిన దౌత్య సంబంధాల తర్వాత ఉక్రెయిన్‌లో భారత్ ప్రధాని చేస్తున్న మొదటి పర్యటన ఇది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను, వర్తక, వాణిజ్య, వ్యవసాయ, ఔషధ రంగాలలో చారిత్రాత్మకంగా నిలిచిపోగలదు.

ప్రపంచ వ్యవహారాల్లో భారతదేశ పాత్ర, ప్రాముఖ్యత ఇటీవల గణనీయంగా పెరిగాయి. 'భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం శాంతి అవసరమని, తుపాకులు, బాంబులు, బుల్లెట్ల మధ్య పరిష్కారాలు అంత సులభం కాదని అందుకే మనం చర్చల ద్వారా శాంతి మార్గాన్ని అనుసరించాల'ని మోడీ పలు సందర్బాల్లో విభిన్న విశ్వ వేదికలపై ప్రకటించారు. రష్యా- ఉక్రెయిన్ విషయంలో కూడా ఇదే విషయాన్ని పలుమార్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మోడీ, వొలొదిమిర్ జెలెన్‌స్కీ మధ్య చర్చపై యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది.

ద్రవ్యోల్బణం పెరగడంతో..

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కీలకమైన వస్తుసేవల సరఫరాపై మరింత ఒత్తిడి తెచ్చింది. ఖర్చులు మరింత పెరిగాయి. ద్రవ్యోల్బణ రేట్లు వేతన వృద్ధిని మించిపోయాయి. ఈ జీవన వ్యయ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని శ్రేయస్సును తగ్గించింది, ముఖ్యంగా అత్యంత పేదలకు కరువు ప్రమాదాన్ని పెంచింది. ఈ దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ ఎగుమతిదారులుగా ఉన్నాయి. గోధుమ ఎగుమతులలో మూడవ వంతు (36%)కి బాధ్యత వహించాయి. ఈ రెండు దేశాలూ ప్రపంచంలోని పొద్దుతిరుగుడు నూనెలో సగానికి పైగా ఎగుమతి చేసేవి. రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలలో మరింత పెరుగుదలను ప్రేరేపించాయి. వస్తుసేవల సరఫరా గొలుసులలో ఉత్పత్తి, నిల్వ, రవాణా అనేవి ప్రతి దశలోనూ ఇంధన ఖర్చులను జోడిస్తాయి కాబట్టి, మరింత ద్రవ్యోల్బణం పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల యూరోపియన్ యూనియన్ దేశాలు అత్యధిక నష్టాలను చవిచూశాయి. తూర్పు యూరప్ దేశాలు వాణిజ్య సంబంధాల ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యాయి.

ఇదే దేశం ఆకాంక్ష!

2022 జనవరి నుండి పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు 380 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సహాయాన్ని అందజేశాయి. పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సైనిక, అర్థిక సహాయం ఆందజేసే దేశాలు అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. పైగా ఆర్థికంగా ఆయా దేశాలపై భారం గణనీయంగా పెరిగింది. రష్యా కూడా ఈ సైనిక చర్యను అత్యంత తేలికగా తీసుకున్నప్పటికీ నానాటికి ఈ సమస్య దానికి కొరకరాని కొయ్యగా తయారైంది. సమస్యను పరిష్కరించుకోవటానికి తాను సిద్దమని తెలియజేసినా రష్యా షరతులకు తలొగ్గబోమని ఉక్రెయిన్‌ భీష్మించుకుని కూర్చొంది.

ఈ యుద్ధం మరింత కాలం కొనసాగితే అది ఇరు దేశాలకూ ప్రమాదకరమే. దీర్ఘకాలిక ప్రయోజనాలు, ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన విధానం ఉపాధి, విద్య, వైద్య తదితర రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఆమెరికా ఆధ్యక్ష ఎన్నికలలో సైతం రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ నివారణపై చర్చ నడుస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టి ముగింపు పలకాలన్నది వారి కార్యాచరణ. ఈ దిశగా కృషి చెయాలని ప్రపంచ దేశాలు భారత్‌ని కోరుతున్నాయి. ఆలీన విధానం, పంచశీల సూత్రాలకు కట్టుబడ్డ భారత దౌత్యం ఎప్పుడూ శాంతికాముకమే వసుధైక కుటుంబంలా సుఖశాంతులతో ప్రపంచం వర్దిలాలి అన్నది భారత ఆకాంక్ష. ప్రపంచ దౌత్యయవనికపై భారతీయ దౌత్యం సతతం శాంతి కాంతులని వెదజల్లుతుంది.

(నేడు మోడీ ఉక్రెయిన్ పర్యటన)

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Tags:    

Similar News