రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవేమో..?

అదేంటి రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయి ఏడు నెలలైనా పూర్తి కాలేదు.. అప్పుడే మళ్లీ ఎన్నికలు ఏంటా అనుకుంటున్నారా..?

Update: 2024-07-21 01:00 GMT

అదేంటి రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయి ఏడు నెలలైనా పూర్తి కాలేదు.. అప్పుడే మళ్లీ ఎన్నికలు ఏంటా అనుకుంటున్నారా..? అవును మరి... ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నికలు తప్పవేమో అనే అనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికకు కారణం రుణమాఫీ

ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీల మధ్య రుణమాఫీ చిచ్చు రేపింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల పరస్పర రాజీనామాల విమర్శల డ్రామాలతో రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడి పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15లోపు రుణమాఫీ పూర్తి చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఎప్పుడో సవాల్ చేశారు. దానిని చాలెంజ్‌గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరాల్సిందే అని.. దృఢ సంకల్పంతో టార్గెట్‌ను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే లక్ష రూపాయల రుణమాఫీ చేయనే చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు అసలు రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ నేతలు ఒకరి తరువాత మరొకరు ఇప్పుడు హరీశ్ రావు రాజీనామాను కోరుతున్నారు. మరి ఈ క్రమంలో ఈ రాజీనామా వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇచ్చిన మాటకు కట్టుబడి..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఓ ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అనౌన్స్ చేశారు. ఆ మాటకు కట్టుబడిన కాంగ్రెస్ సర్కార్ ముందు నుంచీ ఈ అంశాన్ని సీరియస్‌గానే తీసుకుంటూ వచ్చింది. నిధులను సమీకరించింది. మూడు విడతల్లో రూ.2లక్షలు మాఫీ చేసేందుకు సిద్ధపడింది. గురువారం మొదటి విడతగా రూ.లక్ష రుణమాఫీ చేసింది. 11.50 లక్షల ఖాతాల్లో రూ.6,098కోట్లు జమ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క బటన్‌తో కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు చేర్చారు. మరికొద్ది రోజుల్లో రూ.లక్షన్నర రుణమాఫీ చేస్తామని మొత్తంగా ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ హామీని పూర్తిగా నెరవేరుస్తామని ప్రకటించారు.

బీఆర్ఎస్ నేతలు ‘రాజీ’ పడతారా..?

రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే దాదాపు రూ.31 వేల కోట్ల వరకు అవసరం పడతాయి. అయితే.. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక డ్యామేజీ అంతా ఇంతా కాదు. అది బీఆర్ఎస్ నేతలకూ తెలుసు. అందుకే.. ఇన్ని నిధులు తేవడం సాధ్యం కాదని.. రుణమాఫీ చేయలేరని అనుకున్నారు. అందుకే.. బహిరంగంగా సవాళ్లు విసిరారు. చెప్పిన సమయంలోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని హరీశ్ రావు ప్రకటిస్తే.. కొంత మంది బీఆర్ఎస్ నేతలు ఆయనకు కోరస్ పాడారు. కాంగ్రెస్ కనుక రుణమాఫీ కంప్లీట్ చేస్తే ఒక్క హరీశ్ రావు మాత్రమే కాదు.. పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరు రాజీనామా చేస్తారంటూ ప్రకటించారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి గొప్పలకు పోయారు.

కాంగ్రెస్ నేతల అటాక్..

ఇచ్చిన మాట ప్రకారం.. ఇప్పటికే ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేసింది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు రివర్స్ అటాక్‌కు దిగారు. సవాల్ విసిరిన వారిని రాజీనామా చేయమని తాను అడగను అని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. కానీ.. కాంగ్రెస్ పార్టీలోని ఇతర ముఖ్యనేతలు మాత్రం రాజీనామా కోసం పట్టుబడుతున్నారు. రాజీనామా పత్రాలు ఎక్కడ అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. సవాల్ చేసినట్లు కాదని.. ఆ సవాల్‌కు కట్టుబడి ఉండాలంటూ గత రెండు రోజులుగా విమర్శలు చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ నేతల మాటలకు కౌంటర్‌గా ఇప్పుడు బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి మాటలు వినిపించడం లేదు. అనవసరంగా చాలెంజ్ చేసి ఇరుక్కుపోయామా అని కలవరపడుతున్నట్లుగా తెలుస్తున్నది. అందుకే.. ఏ ఒక్క బీఆర్ఎస్ నేత కూడా నోరువిప్పడం లేదు.

గులాబీలో అయోమయం

ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ ఆగమాగం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతాం కూల్చుతాం అంటూ చెబుతూ వస్తున్నారు. ఈ వ్యాఖ్యలను కాస్త కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకొని ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. దాంతో ఇప్పటికే దాదాపు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంత మంది వరుసలో ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు చెప్తున్నారు. ఈ పరిణామాలన్నింటికి తోడుగా ఇప్పుడు ఈ రుణమాఫీపై చేసిన సవాళ్లు పెద్ద తలనొప్పిలా మారాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు.. ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది. అనవసరమైన చాలెంజ్‌లకు పోయి పార్టీని మరింత అట్టడుగుకు చేర్చారని పార్టీలోని ముఖ్య నేతలపై మండిపడినట్లుగానూ తెలుస్తున్నది. ఫైనల్‌గా రాజీనామాలు తమకు కొత్త కాదు.. ప్రజల కోసం ఎందాకైనా వెళ్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలకు కట్టుబడి రాజీనామాలకు పోతే.. ఎంత మంది రాజీనామాలు చేస్తారు..? ఎన్ని స్థానాలకు ఉప ఎన్నిక జరగచ్చు..? అనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

బొల్లబత్తిని శ్రీనివాస్

జర్నలిస్ట్

97054 44375

Tags:    

Similar News