గాయాలు గెలిపిస్తాయా..! ఎల్లలు దాటిన అవే అస్త్రాలు..
ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ నాయకులు చేయని పనంటూ ఉండదనేది అందరికి తెలిసిందే.
ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ నాయకులు చేయని పనంటూ ఉండదనేది అందరికి తెలిసిందే. ఏం చేస్తున్నామనేది ముఖ్యం కాదు గెలవడం ముఖ్యం అనే టార్గెట్‌తో నాయకులు ప్రచారాల్లో పాల్గొంటారు. అరునూరైనా ప్రత్యర్థిని ఓడించాలనేది ముఖ్యం. అందుకోసం వాడాల్సిన అస్త్రాలన్నీ వాడతారు. కొన్ని అస్త్రాలే సింహాసనాన్ని ఎక్కిస్తాయి. మరి కొన్నిసార్లు అవే గద్దె దింపుతాయి. సానుభూతి అనేది ప్రపంచంలో చానా పెద్ద అస్త్రం. ఎంతలా అంటే ఒకసారి ఎన్నికల్లో ఓడించిన నాయకుడినే అయ్యో... పోయిన సారే ఓడిపోయిండు ఈ సారైనా ఓటేద్దాం అనుకునే జనాలున్నారు ఈ ప్రపంచంలో. అయితే కొన్నిసార్లు ఈ సానుభూతిని ప్లాన్ ప్రకారం కల్పించుకుంటారు. మరి కొన్నిసార్లు యాధృచ్ఛికంగా జరుగుతాయి.
గాయాలు భౌతికమైనవి, మానసికమైనవి అయినా సరే, వాటిక చూపే సానుభూతి ఒకటే. మహామహా కరుడుగట్టిన వాళ్లు సైతం ఈ సానుభూతితో అందలమెక్కిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తికి జరిగిన నష్టాన్ని ప్రజలు ఎంత వరకు నమ్మగలుగుతారనే దాన్ని బట్టి కూడా ఫలితాలు తారుమారవుతాయి. ఒక వేళ జరిగిన నష్టాన్ని కచ్చితంగా ప్లాన్ ప్రకారమే అని నమ్మితే వార్ వన్ సైడ్ ఐపోతుంది. లేదంటే విజయం సునాయాసమే. అయితే ఇది అందరికీ అన్ని పరిస్థితుల్లో వర్కవుట్ అవుతుందా అంటే చెప్పలేము. దాన్ని వాళ్లు వినియోగించుకున్న విధానాన్ని బట్టి డిసైడ్ అవుతుంది.
సానుభూతి వర్కవుటయ్యేనా..
ఎన్నికలంటేనే ఖరీదైనవి మారాయి. నాయకులు రాజకీయాన్ని ఒక జూదంలా భావించి ఓడినా, మళ్లీ ఎన్నికల్లో పాల్గొంటూ ఉంటారు. ఆటలో మాదిరిగానే ఇక్కడ కూడా జాక్ పాక్ కొట్టకపోతామా అని భావించి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి నిలబడతారు. ఎన్నికల్లో ప్రత్యర్థులకు పోటా పోటీగా ఖర్చుపెడుతుంటారు. అప్పుడు ప్రజల్లో ఎలాంటి భావన ఉండదు. ఇంత ఖర్చు చేస్తున్నారంటే ఎంత సంపాదిస్తారో అని ఆలోచించి పంచిన డబ్బును, మద్యాన్ని కొట్లాడి మరీ తీసుకుంటున్నారు. అయితే ఓడిన వ్యక్తి పట్ల మెల్లమెల్లగా సానుభూతి మొదలవుతుంది. అంతా ఖర్చు చేసినా గెలవలేదనే భావన కొంత మంది ప్రజల మనస్సులో నాటుకుంటుంది. అది మెల్లమెల్లగా వచ్చే ఎన్నికల వరకు పెరిగి గెలుపుకు కూడా దారితీస్తుందనడంలో అతిశయోక్తి లేదు. వీటిపట్లనే ప్రజలు ఇలా ఉంటే ప్రచారాల్లో గానీ ముందుగానీ ఏమైనా తీవ్రంగా నష్టం జరిగితే ఆ సానుభూతి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే.
దీదీని గెలిపించిన గాయం
దేశంలో జరిగిన 2024 లోక్ సభ ఎన్నికలకు నెల రోజుల ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ నుదుటిపై తీవ్రంగా గాయమై రక్తస్రావం అయింది. ఎన్నికల ముందు ఇది జరగటంతో రాష్ట్రమంతటా వైరల్‌గా మారింది.. స్వయంగా పార్టీ ట్విట్టర్ అకౌంట్‌లో నుదుటి నుంచి రక్తం కారుతున్న ఫోటోలు పోస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో మమతా ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ వాళ్లకు సీట్లు కేటాయించకుండా మొత్తం సీట్లలో ఒంటరిగా పోటీ చేసింది 42 లోక్‌సభ సీట్లకు గాను 29 సీట్లను సొంతపార్టీ గెలుచుకుంది. అంతకు ముందు జరిగిన 2019 ఎన్నికల్లో 22 సీట్లగా ఉన్న పార్టీ 7 సీట్ల పెరిగాయి. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్న సమయంలో కూడా తోపులాటలో కాలికి గాయమైతే అదే గాయంతో రాష్ట్రవ్యాప్తంగా వీల్ చైర్ లో ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అమె మాత్రం ఓడిపోయింది. తర్వాత బై ఎలక్షల్లో గెలిచింది.
కోడి కత్తితో గెలుపు.. ఈసారి తుస్
ఇక ఏపీలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌పై కూడా 2019 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన 175 అసెంబ్లీ సీట్లకు గాను 151 సీట్లను సాధించి భారీ మెజారిటీ సాధించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బస్సుయాత్ర కొనసాగుతున్న సమయంలో జగన్‌పై గులకరాయితో దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం తలకు గాయమైంది. ఆ ఎన్నికల్లో పూర్తిగా రివర్సై కేవలం 11 సీట్లకు పరిమితమవ్వాల్సి వచ్చింది.
తెలంగాణలో కూడా కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఇలాంటి పరిణామమే జరిగింది. తన ఫామ్‌హౌస్ లోని బాత్‌రూంలో కాలు జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊతకర్రతో ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక్క సీటు కూడా గెలవలేదు. గతంలో ఇందిరాగాంధీ మరణానంతరం వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 414 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ దాటలేదంటేనే అర్ధం చేసుకోవచ్చు. జరిగిన పరిణామాలను ప్రజలు ఏవిధంగా తీసుకుంటున్నారు అన్న దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
అమెరికాలో ట్రంప్ గెలుపు పక్కాయేనా?
అమెరికా లాంటి ప్రాశ్చాత్య దేశాల్లో కూడా సెంటిమెంట్, సానుభూతి వర్కవుట్ అవుతాయా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి అమెరికా ఎన్నికల్లో విచిత్ర పరిస్థితులు కనపడుతున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ సభ్యుడు, అధ్యక్షుడు జో బైడన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇద్దరినీ అమెరికా వాసులు వద్దనుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నాయి. గెలుపు విషయంలో కొన్ని సర్వేలు మాత్రం ట్రంప్‌నకు అనుకూలంగా చెబుతున్నాయి. కొన్ని సర్వేల్లో ఇద్దరి మధ్య పోటా పోటీ కనబడుతుంది. ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ నగరంలో జరిగిన హత్యాయత్నం తర్వాత ట్రంప్‌కు ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా 8 శాతం పెరిగిందని పోల్‌స్టర్ తాజా నివేదికలో వెల్లడించింది.
ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఈ దాడిని ప్రపంచ దేశాల నేతలు, అమెరికా మాజీ అధ్యక్షులు కూడా ఖండించి సానుభూతి కూడా తెలపడం. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఒక అడుగు ముందుకేసి నా మిత్రునిపై జరిగిన దాడిని ఖండిస్తున్నా, కుటుంబానికి సానుభూతి కూడా తెలుపుతున్నా అని చేసిన ట్వీట్ కూడా చాలా మంది ఇండో అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేస్తుందనే వాదన కూడా లేకపోలేదు. ఇప్పటికే ప్రైమరీ ఎన్నికలు, ప్రెసిడెన్షియల్ డిబేట్‌లలో పైచేయి సాధించిన ట్రంప్‌నకు నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఈ సానుభూతి బాగా కలిసొస్తుందనే వాదన వినిపిస్తోంది. ట్రంప్ విజయం సాధిస్తే మాత్రం ఎల్లలు దాటిన సానుభూతి, సెంటిమెంట్ మాత్రం మారదని రుజువు చేసినట్టువుతుంది.
గోపు రాజు, జర్నలిస్టు
99636 65363