పాంచ న్యాయ్ ఓట్లు రాబట్టేనా?

అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్ర స్థాయిలోను కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన గ్యారంటీలు, ప్రకటించిన హామీలు అసాధారణ

Update: 2024-05-12 00:45 GMT

అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్ర స్థాయిలోను కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన గ్యారంటీలు, ప్రకటించిన హామీలు అసాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. 5 గ్యారంటీలతోపాటు ఇతర హమీలను కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లకు వివరిస్తూ, ఆకట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమైంది.

మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణలో గ్యారంటీల మంత్రం ప్రకటించి అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించగలనని, విశ్వాసంతో ఉంది. ‘‘యువ న్యాయం’’, ‘‘నారీ న్యాయం’’, ‘‘రైతు న్యాయం’’, శ్రామిక న్యాయం’’, సామాజిక న్యాయం వంటి ఐదు గ్యారెంటీలను ప్రకటించింది. కాగా, మహిళలకు ప్రతి నెలా రూ. 8,500లు నగదు బదిలీ చేస్తానంటూ రాహుల్ గాంధీ తాజాగా చేసిన ప్రకటన గేమ్ ఛేంజర్‌గా మారనుందని భావిస్తున్నారు.

స్పష్టమైన హామీలు..

ఈ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ముందు పెట్టిన హమీలను ఓటర్లు ఆదరించి ఆ పార్టీకి బాసటగా నిలుస్తారా? ఎటు వైపు మొగ్గు చూపుతారు అన్న చర్చ రాజకీయ వేడిని పుట్టిస్తోంది. కేంద్రంలో పదేళ్ళుగా అధికారంలో వున్న బీజేపీ ఓటమికి కాంగ్రెస్‌ ప్రకటించిన ఐదు న్యాయ’’ హమీలు విజయ తీరం వైపు నడిపిస్తాయా! హామీలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయన్న చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఐదు న్యాయాలపట్ల ఒకింత ప్రజలనుంచి సానుకూలత వ్యక్తమౌతున్నప్పటికీ భౌతికంగా ఓటు రూపేణ ఆ పార్టీ మల్చుకుంటుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ గ్యారంటీలను పరిశీలిస్తే.. సమన్యాయం, జనగణనతోపాటు ఆర్థిక, సామాజిక, అంశాలతో కూడిన కులగణన, రిజర్వేషన్‌ హక్కు, రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్‌.సి., ఎస్‌.టి. ఓ.బి.సిలకు రిజర్వేషన్‌ 50 శాతం మించకూడదనే పరిమిత తొలగింపు, ఎస్‌.సి., ఎస్‌.టిలకు ఉపప్రణాళిక, ఎస్‌.సి., ఎస్‌.టి. వర్గాల జనాభ ప్రాథిప్రదికన వార్షిక బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు, జల్‌ జంగల్‌ జమీన్‌కై చట్టపరమైన హక్కులు అమలు, గిరిజన, ఆదివాసి సమస్యలను సత్వర పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది. పంటలకు మద్దతు ధర చట్టబద్దత, రుణమాఫీ కమిషన్‌ ఏర్పాటు చేసి రుణమాఫీ కోసం కృషి పంట నష్టం జరిగిన రైతులకు పంటల బీమా పథకం ద్వారా 30 రోజుల్లో పరిహారం. రైతుల లాభసాటి స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతులు అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ భరోసానిచ్చింది. కార్మిక న్యాయం, ఆరోగ్య హక్కు చట్టం ద్వారా ప్రతి కార్మికునికి ఉచిత వైద్య పరీక్షలు, మందులు, ఆపరేషన్‌తో కూడిన ఆరోగ్య రక్షణ, కనీస వేతనం రోజుకు 400 చొప్పున జాతీయ ఉపాధి పథకం అమలు, పట్టణ ప్రాంతాల కార్మికులకు ఉపాధి చట్టం హామీ, అసంఘటిత కార్మికులకు జీవిత భద్రత ప్రమాద బీమా వర్తింపు, కీలక ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు విధానం రద్దు చేస్తామని స్పష్టమైన హమీను ఓటర్లు ముందు ఉంచింది.

స్త్రీలకు ఏటా లక్ష రూపాయలు

యువ న్యాయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 30 లక్షల ఉద్యోగాల భర్తికీ జాబ్‌ క్యాలెండర్‌, విద్యావంతులైన యువకులకు నెలకు 8500 చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు ఉపకార వేతనం, అన్ని ప్రవేశ పరీక్షల లీకేజీలను అరికట్టేందుకు కొత్త చట్టం. కార్మికులకు సామాజిక భద్రతో కూడిన అనువైన పరిస్థితులు ఏర్పాటు. యువ కిరణాల పేరిట 5 వేల కోట్లతో ప్రత్యేకనిధిని ఏర్పాటు చేస్తామని మరో హామీని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది. మహిళ న్యాయం పేరిట పేద మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు, కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాలలో 50 శాతం రిజర్వేషన్‌లు, అంగన్‌వాడి, ఆశ, మధ్యాహణ భోజన కార్మికుల వేతనాల పెంపు, ప్రతి గ్రామంలో మహిళల రక్షణ కోసం మహిళ అధికారిని నియమిస్తాం. ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు గృహ వసతి కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ మరో గ్యారంటీని ఓటర్ల ముందు ఉంచింది.

తెలంగాణకు ప్రత్యేక హామీలు

కాగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హమీలను కాంగ్రెస్‌పార్టీ ఇచ్చింది. ఐ.టి. ఐ.ఆర్‌. ప్రాజెక్టు పుణర్‌ ప్రారంభం, విభజన చట్టంలో పెర్కొన్న విధంగా ఖాజీపేటలో కోచ్‌ ప్యాక్టరీ, భయ్యారంలో ఉక్కు ప్యాక్టరి, హైదరబాద్‌ ఐ.ఐ.యం., పాలమూరు రంగారెడ్డికి జాతీయ ఓదా, నీతి అయోగ్‌ కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు. నూతన ఎయిర్‌పోర్టులు, మనుగూరు రామగుండం నూతన రైల్వే నిర్మాణం, నాలుగు సైనిక పాఠశాలలు ఏర్పాటు, నవోదయ విద్యాలయ సంస్థల సంఖ్య పెంపు, జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు, నేషనల్‌ ఎవియేషన్‌ యూనివర్శిటి ఏర్పాటు, 73, 74 రాజ్యంగా సవరణ క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా పంచాయతీలకు బదిలీ చేయడం, ప్రతి ఇంటికి సౌర శక్తి సరఫరా, హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు బెంచ్‌ ఏర్పాటు, హైదరాబాద్‌ బెంగుళూరు కారిడార్‌, హైదరాబాద్‌ నాగపూర్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌, సింగరేణి కారిడార్‌ ఏర్పాటు, మేడారం సమ్మక్క సారలక్క జాతరలకు జాతీయ హోదా కల్పిస్తామని ప్రత్యేక హామీలను కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాంతానికి కురిపించింది. మరి అటు జాతీయ స్థాయిలో గ్యారెంటీలను, ఇటు రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో ఓటర్లు, సానుకూలంగా స్పందించి కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలతోపాటు ఇతర హమీలను ఓటర్లకు వివరిస్తూ, ఆకట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమయింది. కాంగ్రెస్‌ పార్టీ హమీలు ఎంతవరకు ఫలితాలను ఇస్తాయన్న విషయం జూన్‌ 4న తేలనున్నది.

గుర్రం రాంమోహన్‌ రెడ్డి

79810 18644

Tags:    

Similar News