భారత్ అగ్ర దేశంగా రాణిస్తుందా?

Will India become an economic leader?

Update: 2024-04-02 00:30 GMT

ఈ మధ్య భారతదేశం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను దాటేసి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని, రాబోయే 2030 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకొని ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ శుభవార్త భారతీయులందరూ గర్వించతగినదే. అయితే కాస్త నిదానించి చూస్తే అందుకు తగిన పరిస్థితులు మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఉన్నాయా? అని పరిశీలన చేయాలి. ఎందుకంటే, నిజానికి క్షేత్రస్థాయిలో భిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుత భారత్‌లో 28 కోట్ల ప్రజలు అర్ధాకలితోనూ, 21 కోట్ల మంది అనారోగ్యంతోనూ, కోట్లాది మంది నిరుద్యోగంతోనూ, పోషకాహార లోపంతోనూ సతమతం అవుతున్నారని ఆర్థిక నివేదికలు తెలుపుతున్నాయి. గణాంకాలను చూస్తే దేశంలో 18.7 శాతం జనాభా పోషక ఆహార లోపంతో జీవిస్తున్నారు. అందులోనూ 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయసున్న యువత 58.1 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీనితో పాటు కుల, మత, ప్రాంతీయ అసమానతలతో పాటు లింగ వివక్షతో కొన్ని కోట్ల మంది దుర్భర జీవితాలను కొనసాగిస్తున్నారు. మహిళలపై అణచివేతలు, వేధింపులు, లైంగిక హత్యాచారాలు, మహిళల అక్రమ రవాణా, డ్రగ్స్ వినియోగం, సరఫరా మొదలైన సామాజిక దుర్లక్షణాలు కూడా చారిత్రకంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనది వికసిత్ భారత్‌గా చెప్పుకుందామా?

పేదరికమున్నా, కుబేరులు పెరుగుతున్నారు..

పేదరికం దశాబ్దాలుగా మన దేశాన్ని వెంటాడుతూనే ఉంది. కానీ ఫోర్బ్స్ నివేదిక ప్రకారం మన దేశంలో కుబేరుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశ సంపద అంతా కేవలం 1 శాతం కుబేరుల చేతిలో బందీగా ఉంది. మరోవైపు సామాజిక, ఆర్థిక అసమానతల వల్ల పేదరికం నానాటికీ మరింత విస్తరిస్తూనే ఉంది. 2020-22 మధ్యకాలంలో 38 లక్షల మంది ఉపాధి కోసం విదేశాల బాట పట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయ వనరుల మొత్తాన్ని ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేయకుండా ఉచిత పథకాల పేర వృధా ఖర్చు చేస్తూ, తిరిగి ఎన్నికల ద్వారా అధికారంలోకి రావడానికి ఉవిళ్ళూరుతున్నాయి. అంతేతప్ప యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించే కృషి చేయకపోవడం దురదృష్టకరం.

మేధో, వ్యాపార వలసల వెల్లువ

ఇప్పటికే మన దేశ పౌరులు 3.7 కోట్ల మంది వివిధ దేశాలకు వలస వెళ్లి విదేశీయులుగా మారిపోయారు. 1970-90 మధ్యకాలంలో మేధోవలసలు ఎక్కువగా జరగగా నేడు దీనికి తోడు వ్యాపార వలసలు కూడా జోరందుకున్నాయి. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణం. తరచుగా మతపరమైన ఉద్రిక్తతలు, సామాజిక సమస్యలు, రాజకీయ విధానాల కారణంగా పారిశ్రామిక వేత్తలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు. అందుకే వారు వెనుకంజ వేస్తున్నారు. ఇక్కడ వారు పరిశ్రమలు స్థాపించకుండా విదేశాల బాటపడుతున్నారు. 2022లో మన దేశ కోటీశ్వరులు 7000 మంది విదేశీ పౌరసత్వం తీసుకోవటమే దీనికి నిదర్శనం. 2013-2022 మధ్యకాలంలో 48,500 మంది కోటీశ్వరులు విదేశీ పౌరులుగా మారిపోయారు. ఇది మన దేశానికి ఎంత లోటు?

విదేశాల్లో కోట్లాది భారతీయులు

చదువుల్లో నాణ్యత లేకపోవడం, నైపుణ్యాలు లేమితో సతమతం అవుతున్న యువతలో ఎక్కువమంది గల్ఫ్ దేశాల్లో అసంఘటిత రంగ కార్మికులుగా విదేశాల్లో పనిచేస్తున్నారు. వారికి ఎలాంటి రక్షణ లేదు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న 5 నుంచి 10శాతం మంది మాత్రమే సాఫ్ట్‌వేర్ తదితర ఇంజనీరింగ్ రంగంలో ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళుతున్నారు. మిగిలిన 90 శాతం మంది దినసరి వేతనంతో పనిచేస్తున్నారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. వీరందరికీ దేశంలో సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించటంలో మన ప్రభుత్వాలు వైఫల్యం చెందటంతో మెరుగైన జీవనం కోసం వారంతా విదేశాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు.

విద్యపై పెట్టేది ఖర్చు కాదు..

నూతనంగా ఏటా 10 కోట్ల మంది యువత ఉపాధి మార్కెట్లోకి వస్తున్నారు. వారికి సరిపడా అవకాశాలు దొరకడం లేదు. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న భారత్ నిరాశ నిస్పృహలకు నిలయంగా మారుతున్నది. ఏదో సాధించాం, అని మన పాలకులు జబ్బలు చరుచుకోవడం సరికాదు. భవిష్యత్తు పరిణామాలు ఇకనైనా అంచనా వేసి మన యువతీ యువకులకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే పారిశ్రామిక, వర్తక, వాణిజ్య విధానాలను అనుసరించాలి. అంకెల సూచీలలో గ్రేడుల అభివృద్ధిని చూసి ఉబలాట పడకుండా, మన కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవ పరిస్థితిని చూసి, అభివృద్ధి అంచనాలు వేయాలి. సరైన ప్రణాళికతో ఉత్పత్తి రంగాల బలోపేతానికి కృషి చేయాలి. దేశంలో భావితరాలకు విదేశాలతో పోటీపడగల నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి. ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రారంభించాలి. విద్యా, వైద్య రంగాలపై వెచ్చించే ప్రతి రూపాయి ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా భావించాలి. అప్పుడే నిజమైన దేశాభివృద్ధి సాధ్యమవుతుంది.

డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్

9849328496

Tags:    

Similar News