317 జీఓ బాధితులకు న్యాయం జరిగేనా?

317 జీఓ బాధితులకు న్యాయం జరిగేనా?... Will GO-317 victims get justice

Update: 2023-01-09 18:45 GMT

తెలంగాణ రాష్ట్రంలో నూతన జోన్ల వ్యవస్థ అమల్లోకి రావడంతో కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, మల్టీ జోన్లకు అనుగుణంగా ఉద్యోగాలను, ఉద్యోగులను సర్దుబాటు చేసే ప్రక్రియలో భాగంగా 2021 డిసెంబర్ 6 న ప్రభుత్వం 317 జీఓను జారీ చేసింది. దీని ప్రకారం సీనియర్ ఉద్యోగులు తాము కోరుకున్న చోటుకు వెళ్ళేందుకు ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది. ఈ జీఓ విడుదలై ఏడాది దాటినా, ఇది సృష్టించిన సమస్యలు ఉద్యోగులకు ఇప్పటికీ తీరడం లేదు. స్థానికతను కోల్పోయి ఉపాధ్యాయులు పుట్టిన ఊరు, కుటుంబాన్ని వదిలి సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లిన వైనం ఇప్పటికి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ప్రభుత్వం హడావిడిగా విడుదల చేసిన ఈ ఉత్తర్వు ఎందరో ఉద్యోగుల జీవితాలలో చీకటిని నింపింది. దీనికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసినా వారి ఆక్రందనలు విన్న నాథుడే లేడు.

స్థానికతను విస్మరించడంతోనే

రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలు ఏర్పరచి ఉద్యోగ ఉపాధ్యాయులను కేటాయించలనుకోవడం తప్పుకాదు. అది పాలనాపరమైన అంశం కూడా. దానిని ఎవరూ కాదనలేరు. అయితే లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాల జీవితాలలో ముడిపడిన ఈ బదిలీల అంశంపై ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాలతో సాధక బాధకాలపై చర్చించి తగిన మార్గదర్శకాలతో జిల్లాల కేటాయింపులు చేస్తే బాగుండేది. కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా విడుదల చేసిన జీఓ 317 స్థానికత అంశాన్ని విస్మరించడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. తదుపరి సీనియారిటీ జాబితాల తయారీ, స్పౌజ్ కేటగిరి అంశాల్లో స్పష్టత లేకపోవడం అధిక సంఖ్యలో ఉన్న టీచర్ల పాలిట శాపంగా మారింది. దీనికితోడు అపాయింట్‌మెంట్ నుండీ సీనియారిటీ లెక్కించకుండా కేవలం క్యాడర్ సీనియారిటీనే పరిగణలోకి తీసుకోవడంతో, కొన్ని చోట్ల తక్కువ సరీస్వ్ ఉన్నవారు సీనియర్లుగా మారడంతో టీచర్లు మానసిక ఆందోళనకు గురయ్యారు. ఇందులో ఎవరి తప్పు ఉందో ప్రభుత్వ పెద్దలే ఆలోచించాలి. ఇలా ఈ జీఓలో స్థానికత కు ప్రాధాన్యత లేకపోవడం, సర్వీస్ సీనియారిటి గుర్తించక పోవడం, భార్య భర్తలను ఒకే జిల్లాకు కేటాయించే విషయంలో స్పష్టత లేకపోవడం, మల్టీ జోన్ పోస్టుల విషయంలో పారదర్శకత లేకపోవడం వంటి కారణాలతో ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందనేది నిర్వివాదాంశం.

వెసులుబాటు కల్పించడంతో

ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీఓ నేడు రాజకీయ ఎజెండగా మారిపోయింది. తాము అధికారంలోకి వస్తే ఈ జీఓ బాధితులకు న్యాయం చేస్తామని బాహాటంగా ప్రకటించే విధంగా ఈ సమస్య తయారైంది. అయితే దీనిపై ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలలో ఉన్న అభ్యర్థులు హామీ ఇస్తున్నారే తప్ప, అది ఏ విధంగా జరుగుతుందో స్పష్టతనివ్వడంలేదు. అయితే ఈ జీఓ వలన తమకు అన్యాయం జరిగిందని న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్న టీచర్లు కోకొల్లలు. అందుకే ప్రభుత్వం కొన్ని పరిగణనలోకి తీసుకొని కొన్ని వెసులుబాటు కల్పించింది. అయితే ప్రభుత్వం మ్యూచువల్ బదిలీలకు అనుమతి ఇవ్వడం కొందరు టీచర్లు లక్షల రూపాయలు వెచ్చించి సీనియారిటీ కోల్పోయి సొంత జిల్లాలకు చేరుకున్నారు. డబ్బులేని పలుకుబడి లేని ఉపాధ్యాయులు అదే ప్రాంతంలో మగ్గిపోతున్నారు. అలాగే మరికొంత మంది టీచర్లు దొడ్డిదారిన డిప్యుటేషన్ పేర్లతో తమకు అనుకూలమైన జిల్లాకు వస్తున్నారు. ఈ బదీలలతో కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయనడం అక్షర సత్యం. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్య తీవ్రతను గుర్తించి 317 జీఓ బాధితులకు న్యాయం జరిగేలా, వారిని సొంత జిల్లాలకు తీసుకొచ్చే విధంగా ఆలోచన చేయాలి. అన్ని జిల్లాలకు స్పౌజ్ కేటగిరిని అనుమతించాలి. అలాగే బాధిత టీచర్ల అప్పీళ్లను పరిశీలించి వారికి న్యాయం చేయాలి. అప్పుడే ఈ జీఓ కారణంగా బలైపోయిన జైత్రం నాయక్, సరస్వతి, రమేష్ వంటి టీచర్ల ఆత్మకు శాంతి చేకూరుతుంది.

సుధాకర్.ఏ.వి

అసోసియేట్ అధ్యక్షులు, STUTS

90006 74747

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

నరక కూపంగా వారపు సంతలు 


Tags:    

Similar News