ఎందుకీ టీఆర్ఎస్ రాద్దాంతం?
'వంద పూలు వికసించనీ, వేయి ఆలోచనలు ఘర్షణ పడనీ'అన్నారు మావో. భిన్న భావజాలాల భిన్న ఆలోచనల సంఘర్షణల కలయికే యూనివర్సిటీలు. అలాంటి వాతావరణమే యూనివర్సిటీలలో ఉండాలి, ఉండేది కూడా.
రాహుల్ ఓయూలో పర్యటించడం చాలా అవసరం. ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలలో కాంగ్రెస్ ఎలాంటి పాత్ర పోషించింది. భవిష్యత్తులో విద్యారంగంపై వారి నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలుసుకునే అవకాశం ఉండేది. రాహుల్ గాంధీని ఫెలోషిప్ నిధులులాంటి అనేక విషయాలపై పార్లమెంటులో చర్చించాలని విద్యార్థులు అడిగే అవకాశం ఉండేది.
'వంద పూలు వికసించనీ, వేయి ఆలోచనలు ఘర్షణ పడనీ'అన్నారు మావో. భిన్న భావజాలాల భిన్న ఆలోచనల సంఘర్షణల కలయికే యూనివర్సిటీలు. అలాంటి వాతావరణమే యూనివర్సిటీలలో ఉండాలి, ఉండేది కూడా. సభలు సమావేశాలు నిర్వహించుకుంటే తప్పేంటి?ఉస్మానియా యూనివర్సిటీ నాటి వందేమాతర ఉద్యమం నుండి నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు పోరాటాలకి నిలయంగా విలసిల్లుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది ప్రొఫెసర్లది కీలకపాత్ర కానీ, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత యూనివర్సిటీలలో సభలు సమావేశాలు నిర్వహించుకోకుండా సర్క్యులర్ జారీ చేయడం ఏమిటి? అధికార టీఆర్ఎస్ పార్టీ యూనివర్సిటీల స్వయం నిర్ణయాధికారాన్ని దెబ్బతీస్తూ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభా, సమావేశాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని గుత్తాధిపత్యం చేస్తున్నది. యూనివర్సిటీ అధికారులతో అనుమతి తీసుకొని సభలు, సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ పరిశోధక విద్యార్థులతో పాటు ఎవరికైనా ఉంటుంది. అయినా, రాహుల్‌గాంధీ ఓయూ పర్యటన విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నది? రాహుల్ పర్యటన అనుమతిపై అధికార టీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? యూనివర్సిటీ అధికారులు ఎందుకు స్వతంత్రంగా వ్యవహరించడం లేదు?
అధికార పార్టీలో అలజడి
కరోనా సంక్షోభం తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ గత కొంతకాలంగా స్థబ్దుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు రాహుల్‌గాంధీ మే నెల 6,7, తేదీలలో తెలంగాణలో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు , ఓయూ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీతో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అన్నారు. దానికి సంబంధించిన అనుమతి కొరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బృందం,పరిశోధక విద్యార్థులు ఓయూ అధికారులకు విన్నవించుకున్నారు.దానికి అనుమతి నిరాకరించారు ఓయూ అధికారులు.
దీంతో యూనివర్సటిలో టీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి.పరస్పర విమర్శలు పెరిగాయి ఈ నేపథ్యంలో రాహుల్ ఓయూ పర్యటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కారణంగా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు కాబట్టి వారికి క్షమాపణలు చెప్పాలని అన్నారు. క్షమాపణ చెప్పాలనడం ఆహ్వానించదగ్గదే. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయినా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం మూలంగా అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. టీఆర్ఎస్ ఎంతమంది అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నది? నీళ్లు నిధులు నియామకాలు సంగతి ఏంటి? మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అమలు చేశారా? వీటన్నింటా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం మన కళ్ళకి కనిపిస్తుంది. మరి బాల్క సుమన్ గారు దీనికి సమాధానంతో పాటు క్షమాపణ చెబుతారా ?
ఈసీ తీర్మానం అందరికీ వర్తించదా?
గత సంవత్సరం జూన్ 22న ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అందులో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వర్సిటీ ఆవరణలో సమావేశాలు నిర్వహించడం, బర్త్ డే వేడుకలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం లాంటి నాన్ అకడమిక్ కార్యక్రమాలు నిషేధించారు. కరోనా కారణంగా సరైన వైద్య సౌకర్యాలు కల్పించకపోవడం మూలంగా అనేక మంది మరణించారు. అనేకమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని టోర్నమెంట్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు చేశారు. మరి ఈసీ నిర్ణయం అధికార పార్టీకి, అధికార పార్టీ విద్యార్థి సంఘానికి వర్తించవా? అధికార పార్టీ విద్యార్థి సంఘం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే యూనివర్సిటీ అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారు?.
హద్దులు మీరిన NSUI నిరసన.
నిరసన అనేక విధాలుగా తెలియజేయవచ్చు. NSUI ఆధ్వర్యంలో ఓయూ వీసీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ గులాబీ చీర, గాజులు మల్లె పూలతో నిరసన చేసి బీసీ ఆఫీస్ తలుపులను ధ్వంసం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. ఒక జాతీయ పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘమై వుండి మహిళలను కించపరిచే విధంగా నిరసన వ్యక్తం చేయడం ఏమిటి? సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కు పై కొట్లాడండి. ఇతరులను అవమానించడం సరి కాదు. రాహుల్ ఓయూలో పర్యటించడం చాలా అవసరం. ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలలో కాంగ్రెస్ ఎలాంటి పాత్ర పోషించింది భవిష్యత్తులో విద్యారంగంపై వారి నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలుసుకునే అవకాశం ఉండేది. రాహుల్ గాంధీని ఫెలోషిప్ నిధులులాంటి అనేక విషయాలపై పార్లమెంటులో చర్చించాలని విద్యార్థులు అడిగే అవకాశం ఉండేది.
అవకాశం ఇవ్వాలి
రాహుల్ గాంధీ పర్యటన అనుమతి విషయంలో యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించారు.కానీ విద్యార్థి సంఘాలు కోర్టు కు వెళ్లడంతో కోర్టు, మీటింగ్ షెడ్యూల్ అయినందున వారి దరఖాస్తును పరిశీలించి నిర్ణయం ఐదో తారీఖు లోపు వెలువరించాలని యూనివర్సిటీ అధికారులకు కోర్టు తెలిపింది.దీంతో యూనివర్సిటీ యాజమాన్యం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం 2021 జూన్ లో ఇచ్చిన సర్క్యులర్ ను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇకనైనా అధికార టీఆర్ఎస్ పార్టీ యూనివర్సిటీ స్వయం నిర్ణయాధికారం విషయంలో జోక్యం చేసుకోకూడదు అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు పక్షపాత ధోరణి వహించకుండా స్వతంత్రంగా వ్యవహరించి "రాహుల్ గాంధీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి" అనుమతి ఇచ్చి యూనివర్సిటీ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కాపాడి విద్యార్థుల సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వాలి.
సత్య నెల్లి,
ఉస్మానియా యూనివర్సిటీ.
95503 95232