కావడి యాత్రలో ఎందుకీ రభస?
ప్రతి ఏటా శ్రావణ మాసంలో హిందువులు పవిత్రంగా భావించే గంగా జలాన్ని హరిద్వార్ నుండి కావడిలో కాలినడకన తెచ్చి తమ గ్రామాలలోని శివాలయాల్లో
ప్రతి ఏటా శ్రావణ మాసంలో హిందువులు పవిత్రంగా భావించే గంగా జలాన్ని హరిద్వార్ నుండి కావడిలో కాలినడకన తెచ్చి తమ గ్రామాలలోని శివాలయాల్లో అభిషేకం చేయటం కోసం భక్తులు ఢిల్లీ- హరిద్వార్ జాతీయ రాహదారిపై లక్షల సంఖ్యలో భక్తులు కాలి నడకన ప్రయాణించటం పరిపాటి. ఈ యాత్ర ఈనాటిది కాదు. శతాబ్దాలుగా సాగుతున్న యాత్ర. ఈ యాత్రలో పంజాబ్, రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా కావడి యాత్రలో పాల్గొంటారు. హరిద్వార్ నుండే కాకుండా గంగోత్రి, బిహార్‌లోని హజారీబాగ్ దగ్గర్లోని గంగా నది నుండి కూడా కావడి పాత్రల్లో జలాన్ని సేకరించటం శివాలయాల్లో అభిషేకాలు చేయటం పరిపాటి.
కానీ ఈ ఏడు ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ -హరిద్వార్ జాతీయ రహదారి పొడవునా వున్నా దాబాలు, హోటళ్లు, పండ్లు, కూరగాయలు బండ్లపైన ఆఖరికి రేషన్ దుకాణాలపైన యజమానులు, అందులో పనిచేసే వర్కర్ల పేర్లు ప్రదర్శించాలని ఒక ఫర్మాన జారీ చేసింది. దీన్నిచూసి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇదే ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇలాంటి ఆర్డర్ ఇవ్వటంలో ఏ అంశాలు ఆ ప్రభుత్వాలను ప్రేరేపించినవో పరిశీలిస్తే.. ఇందులో రాజకీయ కోణం ఇమిడి ఉన్నట్టు తెలుస్తుంది.
మతకలహాలు సృష్టించి..
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు బీజేపీకి ఊహించని ఫలితాలనిచ్చారు. ఈ యాత్ర మార్గంలో ఉన్నా సహరాన్‌పూర్ డివిజన్లో బీజేపీ తుడిచి పెట్టుకుపోయింది. అంతేకాకుండా షామిలి, ముజఫర్‌నగర్ సీట్లను ఇండియా బ్లాక్ గెలుచుకొంది. మీరట్‌లో మాత్రం బీజేపీ తక్కువ మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ గెలుచుకున్న ముజఫ ర్‌నగర్ సీట్ హరిద్వార్ దగ్గర్లో ఉండటం, ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ హరిద్వార్‌ను అనుకోని ఉన్న మంగ్లర్, బద్రీనాథ్ అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలవటంతో.. బీజేపీకి దిక్కుతోచని స్థితిలో త్వరలో యూపీలోని 10 సీట్లలో జరిగే ఉప ఎన్నికల్లో గెలవాలని మెజారిటీ, మైనారిటి మధ్య విభజన తెచ్చి మతకలహాలు రెచ్చగొడితే తప్ప ఇది సాధ్యం కాదని కుట్ర పన్ని ఆహార పదార్థాలు విక్రయించే చోట యజమానుల పేర్లు రాయాలని ఉత్తర్వులిచ్చినట్టు తెలుస్తోంది. అయి తే, ముస్లిం యజమానుల వ్యాపారం క్లోజ్ చేసి ఇతరమతస్తుల బిజినెస్‌కు ఆర్థిక లాభం చేకూర్చడం ఈ ఉత్తర్వుల వెనక ఉన్న మతలబు అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఎన్నో ఏళ్ల నుంచి..
2023 యాత్రలో మొత్తం కావడి యాత్రలో వివిధ ప్రాంతాల్లో సుమారు రెండు కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు. అందులో కోటి మంది ఢిల్లీ - హరిద్వార్ జాతీయ రహదారి నుండే ప్రయాణించారు. ఈ మార్గంలో బీజేపీ నాయకుడు, చాందసవాది అయిన యాశ్వీర్ షామిలీ రోడ్డులో ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఇది ముజఫర్‌నగర్ దగ్గర్లోని బాంగ్రాలో ఉంది. ఈయన మూడేళ్ల క్రితమే ఒక 50 దాబాలను గుర్తించి, వాటి యజమానులు ముస్లింలు అని, వాటిని శాకాహారం పేరుతో హిందూ దాబాలుగా నడుపుతున్నారని ఆ హోటళ్లలో ఈ యాత్రికులు భోజనం చేస్తే కరప్ట్ అవుతారని.. కాబట్టి వాటిని యాత్ర జరిగినన్ని రోజులు మూసెయ్యడమో.. లేక ముస్లింల పేర్లను హోటళ్లపై రాయడమో చెయ్యాలని ముజఫర్‌నగర్ పోలీసులకు పిటిషన్ ఇచ్చాడు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయన ధర్నాలు చేసి మతాన్ని రెచ్చగొట్టేలా ఆందోళనలు నిర్వహించి శాంతిభద్రతల సమస్యను సృష్టించాడు. దీంతో పోలీసులు 2022లో ముస్లిం హోటళ్ల యజమానుల పేర్లు, వర్కర్ల పేర్లు సేకరించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే హిందూ వర్కర్లు ముస్లింల దాబాల్లో, ముస్లిం వర్కర్లు హిందువుల దాబాల్లో పనిచేస్తున్నారు. అయినా 2023లో పోలీసులు ముస్లిం దాబాలను అనధికారంగా మూసివేయించారు. ఈసారి ఏకంగా యోగి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి హోటళ్లు, దాబాలే కాకుండా పళ్లు, కూరగాయల తోపుడు బండ్లు, రేషన్ దుకాణాలపైన యజమానుల, వర్కర్ల పేర్లు ప్రదర్శించాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని చూసి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చింది. గమ్మత్తు ఏమిటంటే, ఎన్నో ఏళ్ల నుండి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వారి సహకారాలను తీసుకోవటం, యాత్ర మార్గంలో ముస్లింలు మంచినీరు, మందులు, భోజనాలు ఏర్పాటు చేయటం అక్కడ జరుగుతూనే ఉంది.
ఇతరులకు మేలు చేయడం కోసం..
హిట్లర్ నాజీ, ఫాసిస్ట్ ప్రభుత్వం పాలనలో కూడా విభజన బీజాలు నాటి 60 లక్షల మంది యూదుల ఉచకోతకు పాల్పడ్డ వైనం ప్రపంచం ఇంకా మరిచిపోలేదు. హిట్లర్ ఆనాడు జర్మనీ నేషనలిజం పేరుతో జర్మనీలోని యూదుల వ్యాపార కేంద్రాలన్నింటిపై నక్షత్రాన్ని ప్రదర్శించాలని, వారి శరీరంపైన వారి పేర్లు ప్రదర్శించాలని హుకుం జారీచేశారు. నక్షత్రం యూదు మత స్తుల గుర్తు.. ఆ గుర్తు ఆధారంగా యూదులను గుర్తించి వారి వ్యాపార కేంద్రాలను స్వాధీనం చేసుకోవటం ఆ తర్వాత వారిని నిర్బంధ కేంద్రాలకు పంపటం, 60 లక్షలమంది యూదులను హతమార్చడం, రెండు కోట్ల మంది ప్రజలు, సైనికులు ప్రాణా లు కోల్పోవటం చరిత్ర చెప్పే సత్యం. అలాగే యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ముస్లింల హోటల్స్‌ను మూసెయ్యటం, వ్యాపారం జరగకుండా చూడటాన్ని ఇతర మతస్తుల దాబాలకు వ్యాపారం జరిగేలాగా చేయడం ఈ ప్రభుత్వాల ఆర్డర్లో ఇమిడిన అంశంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. ఈ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమైనదని కొట్టివేస్తూ దాబాలు, హోటల్స్ కేవలం శాకాహారమా? మాంసాహారమా? అని బోర్డులు తెలుపుతూ ప్రదర్శించాలని ఉత్తర్వులివ్వటం జరిగింది.
డా. కె. సుధాకర్ రెడ్డి
89850 37713