పార్టీలు.. ఈ హామీలెందుకు ఇవ్వవు!?
Why don't the parties give this guarantees
రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల్లో తాజా ఎన్నికలు మూడోవి. అయితే, ఈ ఎన్నికల ప్రచారంలో విచిత్రమైన విషయం ఏమిటంటే కేసీఆర్ పదేళ్లుగా తెలంగాణకు ఏం చేశామో, తన పార్టీ ఏం చేసిందో చెప్పి ఓట్లడగకుండా ఫలానా పార్టీకి ఓటేస్తే జరగబోయే నష్టం ఏమిటో చెప్పి ఓట్లు అడుగుతున్నారు. అంటే ఆయన నైతికంగా తన ఓటమిని అంగీకరించినట్లేనా? తొమ్మిదేళ్ల పాలన తర్వాత తాను సాధించిన విజయాలు చెప్పి ఓట్లడిగితే బాగుండేది కానీ, ఆ నైతిక బలం ఆయన దగ్గర ఉన్నట్టుగా లేదు. ఇక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇతర చిన్నా చితకా పార్టీలన్నీ తమకు ఓటేయమని చెప్పడానికి రకరకాల హామీలను తమ మేనిఫెస్టోల్లో గుప్పించాయి. అయితే ప్రధాన పార్టీల మేనిఫెస్టోలని గమనిస్తే, ఆ మేనిఫెస్టోలన్నీ జిరాక్స్ కాపీల్లా కనిపిస్తాయి. డబ్బుల పంపిణీలో నామమాత్రపు హెచ్చుతగ్గులు తప్ప, అన్ని పార్టీలదీ ఒకటే విధానం. పథకాల పేరుతో పంచబోయే డబ్బు తప్ప, వాటి మేనిఫెస్టోల్లో ఏ తేడా లేదని ఎవరైనా సులభంగానే గ్రహించవచ్చు.
గెలిస్తే.. ప్రజలు ప్రశ్నించొద్దా?
రాజ్యాంగం అమలైన మొదట్లో.. దేశ ప్రజలలో సింహభాగానికి అక్షర జ్ఞానం లేకపోవడం, సామాజిక చైతన్యం లేకపోవడం వల్ల రాజ్యాంగం ఆశించిన ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రజల్లో కొరవడటం అప్పటికి సహజమే! అయితే 75 సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ అదే పరిస్థితి ఉండటానికి కారణం రాజకీయ పార్టీలు కాదా? ప్రజాస్వామ్యానికి ఎన్నికల నిర్వహణ పునాది కావడం వల్ల ఆ ఎన్నికల వ్యవస్థను మొదట్లో రాజకీయ పార్టీలు వివిధ అనైతిక పద్ధతులైన రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ చేయటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవారు. ఆ తరువాత ప్రజలకి మద్యం పంపిణీ చేయడం, ఇప్పుడైతే పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డబ్బు, మద్యం పంచడమే కాక, పథకాల పేరుతో డబ్బు పంపిణీ చేస్తామని ఓట్లు అడగటం ట్రెండింగ్! ఇలా రకరకాల ప్రయత్నాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, ఓట్లను సంపాదించి అధికారాన్ని చేపట్టి ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యామంటే ప్రజాస్వామ్యమా? ఓ సారి ఓటు వేశాక, మేము ఏ రకంగా పరిపాలన చేసిన అడిగే హక్కు లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదని చెప్పడమే ప్రజాస్వామ్యమా? ఇంత సొగసుగా సాగుతున్న ఎన్నికల ప్రహసనం ద్వారా అధికారాన్ని చేపట్టిన రాజకీయ పార్టీలకు సంక్రమించే అధికారం విచక్షణ లేనిదా? హద్దులు లేనిదా? ప్రజలు ఓటేసిన తర్వాత వారికి హక్కులు ఉండవా? ప్రజా వ్యతిరేకమైన పనులు చేస్తే, ప్రజలకు అడిగే స్వేచ్ఛ లేదా?
ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మొదటి ఎన్నికల్లో.. అప్పటి టీఆర్ఎస్ ఎన్నో హామీలతో అధికారం చేపట్టింది. కానీ వచ్చిన అనతికాలంలోనే ప్రజల ఆకాంక్షలను తెలియజేసేందుకు రాజకీయ వేదికగా ఉన్న ధర్నచౌక్‌ను ఎత్తేశారు. ఆ తర్వాత ఎన్నో ప్రజా వ్యతిరేక రాజకీయ నిర్ణయాలను అమలుపరిచింది. అభివృద్ధి పేర ఎన్నో ప్రాజెక్టులను నిర్మించడం కోసం, పరిశ్రమల కోసం వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్నది. అయితే వీటివలన ఎవరూ లాభపడలేదనేది జగమెరిగిన సత్యం. ఇలా లక్షలాది రైతు కుటుంబాలను భూమిలేని వారిని చేసి రోడ్డుకిడ్చి నడిబజార్లో నిలబెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? రేపు అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీ ఏది ఏదైనా అభివృద్ధి పేరు మీద భూములు లాక్కోమని హామీ ఇస్తున్నదా? ప్రభుత్వ విధానం పట్ల తమ నిరసన తెలియజేసే హక్కు ఇస్తుందా? అలా అని ఏ రాజకీయ పార్టీ అయినా హామీ ఇచ్చిందా? ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్న రాజకీయ పార్టీలు ఏవైనా ఇలాంటి నియంతృత్వ, నిరంకుశ ధోరణిని మేము ప్రదర్శించం అని హామీ ఇస్తున్నాయా?
ఇవి మనం అడగాల్సింది..
రాష్ట్ర సాకారం కాకముందు నుంచి ఒక ప్రధాన సమస్యగా ఉన్న రైతు ఆత్మహత్యలు, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా కొనసాగడం నిజంగా దురదృష్టకరం, విషాదకరం కాదా! దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోగా ఆత్మహత్య చేసుకున్న చాలామంది రైతులు వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం అనడం ఎంతవరకు సబబు. ఈ అవమానం పొందడం కోసమా మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నది! మరి ఈ రోజు ఓట్లు అడగడానికి వస్తున్న ఏ రాజకీయ పార్టీ అయినా మరణించిన ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని భేషరతుగా సహాయం చేస్తామని ప్రకటిస్తున్నదా? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో విత్తన భాండాగారంగా రూపొందుతుందని, రైతులకు ఎరువులు, పురుగు మందులు ఉచితంగా కాకపోయినా కనీసం సబ్సిడీ ధరకైనా లభిస్తాయని అనుకుంటే, గత పది ఏళ్లలో ఇవేవీ జరగలేదు.
ప్రస్తుతం ప్రతి రైతు అడిగేది మద్దతు ధర, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కానీ ఇవేవి ఇవ్వకుండా కేవలం రైతుబంధు పేర రెండు సార్లు డబ్బు విదిల్చి చేతులు దులుపుకోవడం అన్యాయం కాదా? అలాగే యువకులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఇది మా విధానం అని ఎక్కడైనా స్పష్టం చేస్తున్నాయా? గత ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు చేస్తున్న పార్టీలు రేపు తాము అధికారం చేపడితే అవినీతిపై విచారణ జరుపుతాయా? అవినీతికి పాల్పడ్డ వారిని శిక్షిస్తాయా? మానవుల సామాజిక జీవితానికి అతి ముఖ్యమైన విద్యా, వైద్య రంగాలను ప్రభుత్వ యాజమాన్యంలో కనుక ఉంచితే జరిగే మేలు అంతా ఇంతా కాదు. మరి ప్రభుత్వ రంగంలో విద్యను, వైద్యాన్ని కొనసాగిస్తామని ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా ప్రకటించిందా? అలా ప్రకటించాలని మనం డిమాండ్ చేయాలి కదా. ప్రైవేటీకరణను తమ దేశాల్లో పెద్ద ఎత్తున అమలు చేస్తున్న అభివృద్ధి చెందిన దేశాలు సైతం విద్య, వైద్య రంగాలను ప్రభుత్వ యాజమాన్యంలోనే కొనసాగిస్తున్నాయి కదా, దీన్ని మనం కూడా డిమాండ్ చేయాలి కదా! ఓట్ల కోసం వచ్చే రాజకీయ పార్టీలను ఈ ప్రశ్నలు అడుగుదామా?
ఓటు అమ్ముకుంటే..
ఓట్ల వేటలో రాజకీయ పార్టీల వేటగాళ్లు మన తక్షణ అవసరాలు తీర్చే, డబ్బులు పంచే, కానుకలు పంచే కార్యక్రమాలతో మనల్ని ఉచ్చులో పడేయటానికి పెద్ద ఎత్తున ప్రచారంలోకి దిగారు. మన తక్షణ అవసరాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలకు అధికార సోపానాలుగా ఉపయోగపడదామా? లేక మన సుస్థిర భవిష్యత్తు కోసం ఈ ప్రశ్నలు అడుగుదామా? ఆలోచించండి. రాజకీయాలంటే ప్రజల ఉమ్మడి సమస్యలకు సరళమైన, సామరస్య పూర్వకమైన పరిష్కారాలు చూపే కళ అని మేధావులు అంటుంటారు. స్వాతంత్ర్యం సిద్దించిన నాటినుండి మన ప్రజాస్వామ్యపు నడక, మన రాజకీయాల సరళి, పైన చెప్పిన నిర్వచనానికి పూర్తి వ్యతిరేకంగా సాగుతూ ఉన్నది. మొత్తంగానే పరిపాలనలో గాని, విధి విధానాల రూపకల్పనలో గాని పౌర సమాజపు ప్రభావం క్రమంగా కుంచించుకుపోయి, ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసి, అదే ప్రజాస్వామ్యం అని భ్రమసి, జరిగే ప్రతికూల పర్యవసానాలన్నింటికీ మౌన ప్రేక్షకులుగా మారుతున్న విషాదకర పరిస్థితిలో మనం ఉన్నాం. మనకు చిన్న మొత్తపు డబ్బుతో తీరే తక్షణ అవసరాలు ఎన్ని ఉన్నా, వాటికోసం సుదీర్ఘ భవిష్యత్తును బలి పెట్టవద్దని, అది మనకే కాదు రాబోయే తరాల వారికి కూడా నష్టదాయకమని, అంతిమంగా ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓట్ల కోసం వచ్చే పార్టీలను, అభ్యర్థులను భద్రతతో కూడిన సుస్థిర భవిష్యత్తు కోసం పై డిమాండ్లను నెరవేర్చమని నిలదీద్దాం.
టి. హరికృష్ణ
మానవ హక్కుల వేదిక
9494037288