జననాడి: ప్రజాధనానికి పూచీకత్తు ఎవరు
జననాడి: ప్రజాధనానికి పూచీకత్తు ఎవరు... Who is the guarantor of public money
దేశ ప్రజలు ఎప్పుడు ఏ అంశాన్ని ఎలా తీసుకుంటారో తెలియదు. ఉపాధిహామీ, సమాచార హక్కు వంటి మంచి చట్టాలు తీసుకువచ్చిన యూపీఎ 1 (2004-09) ప్రభుత్వం పై పెద్దగా అవినీతి ఆరోపణలు, అవకతవకల అభియోగాలు లేకపోవడంతో తిరిగి అధికారంలోకి తెచ్చారు. అదే యూపీఎ-2 (2009-14) పైన 2జి స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్ గేమ్స్, బొగ్గు కుంభకోణం వంటి అవినీతి ఆరోపణలు రావడంతో ఇంటికి పంపారు. ఇదివరకు జరిగిన స్టాక్ స్కామ్‌లన్నింటిలోనూ దర్యాప్తు జరిపించి, ఇప్పుడు ఇంత పెద్ద స్టాక్ అవకతవకల్ని కేంద్ర ప్రభుత్వం 'మాకేం సంబంధం' అనటాన్ని పౌరులెలా పరిగణిస్తారో చూడాలి.
అదానీ గ్రూప్ సంస్థల ఆర్థిక పతనాన్ని, స్టాక్ అవకతవకల్ని, తదనంతర పరిణామాలను ఎలా చూడాలి దేశంలో ఇప్పుడిదొక చర్చనీయాంశమైంది. ఒక వ్యాపారి కేంద్రక కంపెనీల ద్వారా పదిలక్షల కోట్ల రూపాయల సంపద పట్టుమని పది రోజుల్లో ఆవిరైపోయిన దుస్థితిపై నిష్పాక్షిక దర్యాప్తుకు డిమాండ్ పెరుగుతోంది. అది జరక్కుండా.. రాజకీయ విమర్శ, ప్రతి విమర్శలు చేయటం లక్షలాది మంది మదువుదారులు, మదుపు సంస్థల ప్రయోజనాలకు భంగకరమే! వాస్తవాలను పరిశీలించకుండా, నిజాల్ని అంగీకరించేందుకు సిద్ధపడకుండా చేస్తున్న చిత్రవిచిత్ర వాదనల పుణ్యమా అని మూడు రోజుల పార్లమెంటు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. 'మాకేమీ సంబంధం లేదు. సెబి నార్మల్‌గానే దర్యాప్తు చేస్తుంది' అని కేంద్రం అంటోంది. కేంద్ర ప్రభుత్వం గానీ, పాలకపక్షం, దాని మాతృసంస్థ, అనుబంధ విభాగాలు తీసుకుంటున్న సమర్థింపు వైఖరి గానీ విమర్శలకు తావిస్తోంది.
కంపెనీల స్టాక్ విలువ రమారమి పడిపోయి, ఇంకా ఎంత పతనమౌతుందో అంచనాకు అందని ఒక ఆర్థిక సంక్షోభంపై తక్షణ విచారణ, ఉపశమన చర్యలు చేపట్టక ముందే చేస్తున్న వితండ వాదం విమర్శలకు, విపరిణామాలకు దారితీస్తోంది. ఈ ముందస్తు వైఖరి, పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని అదానీ గ్రూప్ సంస్థల్లో మదుపుచేసిన ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, అప్పులిచ్చిన ఎస్‌బీఐ, పీఎన్బీ వంటి బ్యాంకులు, ఆర్బీఐ వంటి నిఘా విభాగాలు, సెబీ వంటి నియంత్రణ వ్యవస్థల్ని ప్రభావితం చేసే ప్రమాదముంది. తప్పును సరిదిద్దుకోకపోగా సమర్థింపు కోసం మాటలు, వాదనలు వెతుక్కుంటున్నట్టుంది పరిస్థితి. స్వీయార్జితాన్ని స్టాకుల్లో మదుపుపొదుపు చేసుకున్న కోట్ల మంది మదుపుదారుల మానసిక స్థితిని ఇది మరింత కృంగదీసేదిగా ఉంది. న్యూయార్క్ (అమెరికా) కేంద్రంగా పనిచేసే హిండెన్‌బర్గ్ అనే స్టాక్ పెట్టుబడి`పరిశోధనా సంస్థ చేసిన ఒక ప్రకటనతో ఈ పతనం మొదలైంది. ఇదే విషయమై అనుమానాలు, వాటిని దృవీకరించే సంకేతాలు ఎప్పట్నుంచో ఉన్నా దేశీయ సంస్థలు, నిపుణులు నోరు విప్పలేదు. అది చేయకపోగా, ఇప్పుడు అలా చేసిన సదరు సంస్థపైన, దాని విశ్వసనీయతపైన విమర్శలు చేస్తున్నారు. అదానీని దెబ్బతీయడానికి, తద్వారా దేశ ప్రతిష్టను మంట గలపడానికి చైనా, బ్రిటన్, అమెరికాలు చేస్తున్న కుట్రగానూ కొందరు అభివర్ణిస్తున్నారు.
ఒక ప్రకటనతో ఢమాల్...
జనవరి 24 సాయంత్రం (భారత కాలమానం ప్రకారం) నేనొక మిత్రుడు, వాణిజ్యరంగంలో పెద్దమనిషి మనవడి పుట్టినరోజు వేడుకలో పాల్గన్నా! అక్కడ భోజన సమయం నలుగురు సంపన్నుల నడుమ సాగిన సంభాషణలో అదానీ ప్రస్తావన వచ్చింది. 8 ఏళ్లలో 30 వేల కోట్ల నుంచి ఆయన సంపద 15 లక్షల కోట్లకు ఎదిగిన అసాధారణ స్థితి ప్రశ్నార్థకమనే మాటకు, సంపన్నులంటే ఉండే ఈర్శ్య తప్ప ఇది మరోటి కాదనే విమర్శ వచ్చింది. 24 గంటలు గడవక ముందే, జనవరి 25 ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం, జనవరి 24 సాయంత్రం) బండారం బయటపడిరది. కేవలం ఎవరిపైనో, ఎవరికో ఉండే ఈర్శ్యా`ద్వేషాల వల్ల ఇంత జరుగుతుందా పది రోజుల కిందట అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం విలువ 22,000 కోట్ల డాలర్లు (సుమారు రూ. 18 లక్షల కోట్లు) గా ఉండేది.
హిండెన్‌బర్గ్ జనవరి 24న, అదానీ గ్రూప్ కార్పొరేట్ అవకతవకలకు పాల్పడినట్లు ఓ నివేదిక విడుదల చేయడంతో ఒక్కసారిగా అంతా మారిపోయింది. ఈ పది రోజుల స్వల్ప వ్యవధిలో అదానీ గ్రూప్ సంస్థల మొత్తం విలువ సగానికి పడిపోయింది. ఆ గ్రూప్‌కు చెందిన కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 120 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.10 లక్షల కోట్లు తగ్గిపోయింది. షేర్ల వరుస పతనంతో గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలోని టాప్-20లో లేకుండా స్థానం కోల్పోయారు. ఇది ఆయనకు మాత్రమే జరిగిన నికర నష్టం కాదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితులైన కొన్ని లక్షల కుటుంబాల కన్నీటి గాథ! హిండెన్‌బర్గ్ ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించి, నిరాధారమని తోసిపుచ్చింది. ఆందోళన చెందుతున్న ఇన్వెస్టర్లు మాత్రం షేర్లను అమ్ముతూనే ఉన్నారు. నిత్యపతనం ఆగట్లేదు.
వివరణలో వివరాలే లేవు
లేవనెత్తిన అంశాలకు సమాధానాలివ్వకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ 'బెదిరించడం' సరికాదని, న్యాయ విచారణకు తాము సిద్ధమేనని హిండెన్‌బర్గ్ ప్రకటించింది. ఇంకో మాటా అంది. 'పరిశోధనలో భాగంగా, మేం ఎక్కడెక్కడో తంటాలు పడి ఆధారాలు, పత్రాలు అనధికారికంగా సేకరించాల్సి వచ్చింది, మీరే కోర్టు అంటున్నారు కద! అప్పుడన్నా అసలు పత్రాలు ప్రపంచం వెలుగు చూస్తాయి, రండి మేం రెడీ!' అని పేర్కొంది. సుమారు 400 పేజీల వివరణో, ఖండనో అదానీ గ్రూప్ విడుదల చేసింది. తామడిగిన 88 ప్రశ్నల్లో 62 ప్రశ్నలకు స్పష్టమైన జవాబులివ్వడంలో అదానీ గ్రూప్ విఫలమయిందని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని కోల్పోవడంతో ముందుముందు పెట్టుబడుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు సేకరణ కష్టమౌతుంది. దీంతో అదానీ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తికి చాలా సమయం పట్టచ్చు. ఇప్పటికే గ్రూప్‌పై రుణభారం అధికంగా ఉండడంతో రుణాలిచ్చేవారిలోనూ ఆందోళన నెలకొంది.
వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తూపోవడం వల్ల అదానీ గ్రూప్‌పై సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర రుణభారం ఉంది. గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్ట్, 5జీ వంటి కొత్త వ్యాపారాల్లో అడుగుపెడుతూ అదానీ తన వ్యాపార విస్తరణతో మూడేళ్లలోనే ఆ సంస్థ తీసుకున్న రుణపరిమాణం రెట్టింపైంది. సంస్థ ఆదాయం, లాభాలలో వృద్ధి వేగం కంటే రుణాలలో వృద్ధి వేగం అధికంగా ఉండడంతో కంపెనీకి దివాలా ముప్పు ఉందని హిండెన్‌బర్గ్ నివేదిక చెప్పింది. అమెరికా స్టాక్‌మార్కెట్‌లోనూ అదానీకి ఎదురుగాలి వీస్తోంది. డోజోన్స్ సస్టెయినబిలిటీ సూచీ నుంచి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ (ఏఈఎల్) షేర్లను తొలగించారు. ఎస్ అండ్ పీ డోజోన్స్ ఈ మేర ప్రకటన విడుదల చేసింది.
స్థిరాస్తి ప్రాజెక్టులే ఆదుకోవాలేమో!
రుణాల కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆస్తులు, షేర్లను పూచీకత్తుగా సమర్పించేవారు. ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు సగానికి తగ్గడంతో పూచీకత్తుల విలువ కూడా తగ్గినట్లయింది. రుణదాతలు కుదువ షేర్ల సంఖ్యను రెట్టింపు చేయమని అడగొచ్చు. అదానీ గ్రూప్ షేర్లను తనఖా పెట్టుకొని లోన్లు ఇవ్వడాన్ని అమెరికాకు చెందిన సిటీగ్రూప్ నిలిపివేసింది. పెద్దబ్యాంకులు అదానీ గ్రూప్ బాండ్లను తాకట్టు పెట్టుకోవడానికి నిరాకరించడం నిజమే అయితే అందుకు కారణం షేర్ల ధరలు తగ్గడమే. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తరువాత అదానీకి రుణాలివ్వాలంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మరింత జాగ్రత్తపడతాయి. ఓడరేవులు, విమానాశ్రయాలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి అదానీ గ్రూప్ వ్యాపారాల్లో అదానీ గ్రూప్ నగదు సమకూర్చుకుంటోంది. కాబట్టి, స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం వీటిపై ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొత్త వ్యాపారాలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, విమానాశ్రయాల నిర్మాణం, ఎక్స్‌ప్రెస్ వే వంటివన్నీ అదానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ 'అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్' ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. ప్రస్తుతానికి దీనికి నగదు లభ్యత బాగున్నప్పటికీ ఇక్కడి నగదును గ్రూప్‌లోని ఇతర కంపెనీల రుణాల చెల్లింపు కోసం ఉపయోగించడం ప్రారంభిస్తే కష్టాలు మొదలవుతాయి. ఎయిర్‌పోర్టుల నుంచి పోర్టుల వరకు అనేక రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపారం చేస్తోంది. ఆ గ్రూప్‌కు చెందిన ఏడు కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయి ఉన్నాయి. అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు వేల కోట్ల రూపాయల రుణాలివ్వడమే కాకుండా ఎల్‌ఐసీ వంటి బీమా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.
తాజా పరిస్థితీ అదే!
సోమవారం సెషన్‌లోనూ అదానీ షేర్లలో ఎక్కువ శాతం నష్టాల్లోనే ముగిశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ 10 శాతం నష్టంతో ముగియగా, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, అదానీ పవర్ షేర్లు 5 శాతం చొప్పున షార్ట్ సర్క్యూట్ తాకాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా 2.05 శాతం నష్టాలతో ముగిసింది. ఇక, అదానీ పోర్ట్స్ 8.63 శాతం, ఎన్డీటీవీ 2.42 శాతం, ఏసీసీ సిమెంట్స్ 1.97 శాతం లాభాలతో ముగిశాయి. కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ, ఎస్బీఐ, పీఎన్బీ షేర్లు ఇప్పటికీ కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, అదానీ గ్రూప్ షేర్ల పతనాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ 'టీ కప్పులో తుఫాను'గా అభివర్ణించారు. 'ఇది అదానీ గ్రూప్‌కు మదుపర్లకు సంబంధించిన వ్యవహారం, మాకేం సంబంధం' అని సాక్ష్యాత్తూ కేంద్రం అంటోంది. దేశ బ్యాంకింగ్ రంగంపైగానీ, ఆర్థిక సంస్థలపైగానీ ఈ ప్రభావం ఏ మాత్రం ఉండదని నమ్మబలుకుతున్నారు. 'మావి తక్కువ పెట్టుబడులే' అని ఒకరు, 'మేమిచ్చిన మొత్తం రుణాల్లో... ఇవి చాలా తక్కువ' అని ఇంకొకరు, 'దేశంలో బ్యాంకుల పటిష్టంగానే ఉన్నాయి, అటుపోట్లను తట్టుకునే స్థితిలో ఉన్నాయ'ని అసందర్భంగా వేరొకరు.... ఇలా భుజాలు తడుముకునే చిలుకపలుకులు పలుకుతూనే ఉన్నారు. మరోవైపు అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనంపై, ఎంఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. ఇందుకు కారణమని, హిండెన్‌బర్గ్ రీసెర్చి సంస్థ చీఫ్ నాథన్ అండర్సన్‌పై చర్యలు తీసుకోవాలని పిల్‌లో కోరారు.
దేశ ప్రజలు ఎప్పుడు ఏ అంశాన్ని ఎలా తీసుకుంటారో తెలియదు. ఉపాధిహామీ, సమాచార హక్కు వంటి మంచి చట్టాలు తీసుకువచ్చిన యూపీఎ 1 (2004-09) ప్రభుత్వం పై పెద్దగా అవినీతి ఆరోపణలు, అవకతవకల అభియోగాలు లేకపోవడంతో తిరిగి అధికారంలోకి తెచ్చారు. అదే యూపీఎ-2 (2009-14) పైన 2జి స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్ గేమ్స్, బొగ్గు కుంభకోణం వంటి అవినీతి ఆరోపణలు రావడంతో ఇంటికి పంపారు. ఇదివరకు జరిగిన స్టాక్ స్కామ్‌లన్నింటిలోనూ దర్యాప్తు జరిపించి, ఇప్పుడు ఇంత పెద్ద స్టాక్ అవకతవకల్ని కేంద్ర ప్రభుత్వం 'మాకేం సంబంధం' అనటాన్ని పౌరులెలా పరిగణిస్తారో చూడాలి.
-ఆర్.దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ,
dileepreddy.ic@gmail.com,
9949099802
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...