స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాలు, గ్రామ పంచాయతీలకు రూపకల్పన చేసినప్పటికీ, వాటికి కావలసిన నిధులు, విధానాలు, సిబ్బందిని సమకూర్చకపోవడంతో అవి కేవలం దిష్టిబొమ్మలుగా ఉండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి, వాటిని స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలుగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగం అధికరణ 40 చెబుతున్నది. రాజ్యాంగం అధికరణ 243- 1 ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం పంచాయతీల అవసరాలను గుర్తించి వాటికి కావలసిన నిధులను రాష్ట్ర బడ్జెట్ నుంచి విడుదల చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఆ నివేదికను అసెంబ్లీ సమావేశాలలో చర్చించి గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని రాష్ట్రాలు తప్ప, చాలా రాష్ట్రాలు పంచాయతీలను బలోపేతం చేసే చర్యలు తీసుకోలేదు.
భారత రాజ్యాంగంలోని మూడంచెల వ్యవస్థలో ప్రజలకు దగ్గరగా పనిచేస్తున్న సంస్థలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు. రాజ్యాంగం అధికరణ 243 జి గ్రామపంచాయతీలను బలోపేతం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 11వ షెడ్యూల్‌లో చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు 29 శాఖలకు సంబంధించిన పనులను గ్రామ పంచాయతీలకు బదలాయింపు చేయాలని చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి కేంద్రం 1992లో రాజ్యాంగ సవరణ చేసి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు రాజ్యాంగ భద్రత కల్పించింది. అంటే, ఏ విధంగానైతే పార్లమెంట్, రాష్ట్ర శాసనసభకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయో.. అలాగే పంచాయతీలకు, మున్సిపాలిటీలకు కూడా వాటి పదవీ కాలం ముగిసే ముందే ఎన్నికలు జరపాలి. కొత్త పాలకవర్గం పాత వారి పదవికాలం ముగిసేనాటికి సిద్ధంగా ఉండాలి.
నిధులలో జాప్యం
గత పది సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదికను అసెంబ్లీ ముందు ఉంచడానికి, ఆర్థిక సంఘం సూచించిన ప్రకారం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడం గాని జరగలేదు. దీంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీల నిర్వహణ పెనుభారంగా మారింది. ప్రతినెల ఎస్‌ఎఫ్‌సి నిధులు విడుదల చేయాలని ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల చేయకపోవడం, గ్రామపంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతూ కుంటుపడుతున్నాయని చివరికి పారిశుద్ధ్యం, వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా, సిబ్బందికి నెల నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి .
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో దాదాపు 8000 గ్రామ పంచాయతీలు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం 200 జనాభా లేని గ్రామాలను కూడా పంచాయతీలుగా చేసి రాజకీయ నాయకులకు ఉద్యోగాలు కల్పించడం తప్ప పంచాయతీలకు ఎటువంటి లాభం కలగలేదు. 2011 జనాభా ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా 12769 గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రతినెలా దాదాపు రూ.1080 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్‌సి క్రింద ప్రతి నెలా రూ. 129 కోట్లు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్రంలోని పంచాయతీలకు కేంద్రం నిధులు 5 నెలలకు సంబంధించి రూ.5,480 కోట్లు,ఎస్ఎఫ్‌సి నిధులు 16 నెలలకు సంబంధించి రూ. 1,920 కోట్లు రావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ఈ నిధులు విడుదలైతేనే గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
సర్పంచులపై కర్ర పెత్తనం
పంచాయతీలకే కాక శాసనసభ నియోజకవర్గాల్లో కూడా పక్షపాత ధోరణితో గత ముఖ్యమంత్రి పదివేల కోట్లు దగ్గర పెట్టుకొని కొన్ని నియోజకవర్గాల్లో వందల కోట్లు మంజూరు చేయడం, కొన్నింటికి మొండి చేయి చూపించడం జరిగింది. 2018 లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం సెక్షన్ 37 ప్రకారం జిల్లా కలెక్టర్లకు సర్పంచులపై విస్తృత అధికారాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలు సర్పంచ్ అమలు చేయకున్నా, అధికార దుర్వినియోగం వంటి సందర్భాల్లో సర్పంచులను పదవి నుంచి తొలగించవచ్చు. కొన్ని సందర్భాలలో సర్పంచులు స్థానిక శాసనసభ్యునికి అనుకూలురు కానప్పుడు శాసనసభ్యుడు కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడం, దానిపై కలెక్టర్ సర్పంచులు పదవి నుంచి తొలగించడం వంటివి జరగడంతో సర్పంచుల్లో ఒక భయానక వాతావరణం నెలకొంది.
పంచాయతీ ఎన్నికలు జరిపించాలి!
ప్రస్తుత గ్రామ పంచాయతీల కాల పరిమితి 1 ఫిబ్రవరి 2024 నాటికి ముగిసి, ఫిబ్రవరి 2 నుంచి స్పెషల్ ఆఫీసర్‌ల పాలనలోనికి వెళ్ళింది. 2018 లో ప్రభుత్వ అనుమతి తీసుకుని మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని.. గత ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం తనకు అనుకూలమైనప్పుడు మాత్రమే పంచాయతీ ఎన్నికలు జరిపే వెసులుబాటు ఏర్పడింది. ఈ ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి, ప్రభుత్వంలో ఒక శాఖగా మారిపోయింది. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ జూలై నెలలో ఎన్నికలు జరుపుటకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
ఫిబ్రవరి ఒకటితో పదవీకాలం ముగిసింది.. వారు అప్పులు సప్పులు చేసి అభివృద్ధి పనులు చేశారు. అట్టి బిల్లులు ఇంతవరకు రాలేదు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సర్పంచుల సంఘం కోరింది. గత ప్రభుత్వంలో అధిక మొత్తంలో బిల్లులు బకాయిలు ఉన్నవి. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ పెండింగ్ బిల్లులపై స్పందించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల కోడ్ పేరుతో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరమని, వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఉజ్జిని రత్నాకర్ రావు
94909 52646