ప్రశ్నించే గొంతులకు స్థానమెక్కడ?
ప్రశ్నించే గొంతులకు స్థానమెక్కడ?... Where is the position of questioning voices
కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న కేసీఆర్ తెలంగాణ సీఎంగా రాష్ట్రంలోనూ అదే తీరులో వ్యవహరిస్తున్నారు. కేంద్రంపై విమర్శలు చేసే ముందు సొంత రాష్ట్రంలో ఎలాంటి ధోరణి కొనసాగుతున్నదో ప్రశ్నించుకోవడం అవసరం. ఎదుటివారిని వేలెత్తి చూపే ముందు దాన్ని ఆచరించడం సహజ సూత్రం. కానీ ఈ విషయంలో మాత్రం తనకు వర్తించదనే తీరులో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామిక సూత్రాలను వల్లెవేసే ఆయన అదే సూత్రాలను ఉల్లంఘిస్తున్నారు. ప్రశ్నించే అవసరం ఉండదంటూ కేసీఆర్ చెప్పిన మాటలు చివరకు ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తామనే తీరులో అమలవుతున్నాయి. విపక్షాల నుంచే కాక ఏ సెక్షన్ ప్రజల నుంచీ అసమ్మతిని, అసంతృప్తిని, వ్యతిరేకతను ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నది. నియంతృత్వం, నిరంకుశత్వం అనే పదాలకు అర్థాలు, వివరణల సంగతి ఎలా ఉన్నా ప్రశ్నించేవారి గొంతుల్ని నొక్కేస్తున్నది. రోడ్లమీద నిరసనలను సహించలేకపోతున్నది. ప్రతిపక్షాలైనా, ప్రజా సంఘాలైనా అదే తీరు. కేంద్రాన్ని విమర్శించే కేసీఆర్ తన రాష్ట్రంలో ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు క్లారిటీ ఇవ్వడంతో పాటు అలాంటి వాతావరణాన్ని నెలకొల్పితే అదే పదివేలు. ఆయన మాటలకు తగిన చేతలతో పరిపాలన సాగిస్తే అది బంగారు తెలంగాణ. అప్పుడే దేశానికి తెలంగాణ రోల్‌మోడల్.
ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది తెలుగు నానుడి. కానీ తెలంగాణలో దానికి విరుద్ధంగా జరుగుతున్నది. తాను పాటించకుండా ఇతరులు పాటించాలనే రాగాన్ని ఎత్తుకున్నది. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను అధికార బీఆర్ఎస్ ఒకవైపు నొక్కేస్తూనే ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నది. ప్రతిపక్షాలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందంటూ ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీ వేదికగా కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కానీ ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నది.
ప్రశ్నించడానికి, గొంతెత్తడానికి కూడా వీలులేని పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకతవకలపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ భారత్ రాష్ట్ర సమితి అధినేతగా కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావించిన సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను విశ్లేషించుకోవడం సందర్భోచితం.
మనీష్ సిసోడియా అరెస్టుపై ఎనిమిది పార్టీలు కలిసి ప్రధానికి రాసిన సంయుక్త లేఖలో కేసీఆర్ చొరవ తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం. “భారతదేశం ఇంకా ప్రజాస్వామ్య విలువలను పాటించే దేశమేనని మీరు అంగీకరిస్తారని మేం ఆశిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను పచ్చిగా దుర్వినియోగపరచడం చూస్తుంటే మనం ప్రజాస్వామ్య నుంచి నిరంకుశ పాలన దిశగా పరిణామం చెందుతున్నట్టుగా అనిపిస్తున్నది” అంటూ ఆ లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్న కేసీఆర్ తెలంగాణ సీఎంగా రాష్ట్రంలోనూ అదే తీరులో వ్యవహరిస్తున్నారు. కేంద్రంపై విమర్శలు చేసే ముందు సొంత రాష్ట్రంలో ఎలాంటి ధోరణి కొనసాగుతున్నదో ప్రశ్నించుకోవడం అవసరం.
కక్షసాధింపు చర్యలు నిజం కాదా?
కేంద్ర ప్రభుత్వ నిరంకుసత్వం, నియంతృత్వం, ప్రజాస్వామ్యానికి తిలోదకాలు గురించిన చర్చ ఎలా ఉన్నా తెలంగాణలోని పరిస్థితుల మాత్రం దానికి భిన్నంగా ఏమీ లేవు. గత కొన్నేళ్ళుగా, మరీ ముఖ్యంగా అనూహ్య మెజారిటీతో గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఒక్కసారిగా కక్ష సాధింపు చర్యలు అక్షర సత్యం. విపక్షాల నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, బహిరంగసభలు లాంటివాటిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సి వస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ సహా తెలంగాణ జనసమితి, వైఎస్ఆర్‌టీపీ తదితర అన్ని పార్టీలకూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రజాస్వామిక హక్కే అని చెప్తూనే పరోక్షంగా ప్రభుత్వం ఆటంకాలు సృష్టించడం నిత్యం జరుగుతున్న ప్రహసనం.
అధికార పార్టీకి అన్ని రకాల అనుమతులు ఇచ్చిన పోలీసు శాఖ విపక్షాలపైన మాత్రమే భిన్నమైన స్టాండ్ తీసుకుంటున్నది అనే విమర్శలే ఇందుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చిన తొలి టర్ములోనే ధర్నాచౌక్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. చివరకు హైకోర్టును ఆశ్రయించి దానిని తిరిగి పునరుద్ధరించుకోవాల్సి వచ్చింది. ధర్నాలకు అవసరమే లేని తీరులో పరిపాలన ఉంటుందని అధికారంలోకి రాకముందు కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కానీ తీరులో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలను అందిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బుద్ధిజీవులు, మేధావులు, ఉద్యమకారులు, వివిధ రంగాల నిపుణుల సలహాలతో పరిపాలన సాగిస్తానని మేనిఫెస్టోలోనే కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రశ్నించే అవసరం ఉండదని చెప్పి..
ప్రతిపక్షాలు నిరసనలకు ప్లాన్ చేయగానే కొన్ని గంటల ముందే ఆ పార్టీల నేతలను ముందస్తుగా అరెస్టు చేయడం, గృహ నిర్బంధంలో ఉంచడం తెలంగాణలో రొటీన్ ప్రాక్టీసుగా మారింది. మంత్రులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు వారి అవసరాల కోసం నిలదీయడం పెరిగింది. మంత్రుల పర్యటనల సందర్భంగా నిరసనలు తెలపడం, కాన్వాయ్‌లను అడ్డుకోవడం మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం గతంలో ఎన్నడూ లేని తీరులో ఇలాంటి చేదు అనుభవాలు తప్పలేదు. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు ప్రివెంటివ్ అరెస్టులు, హౌస్ అరెస్టుల బాటను ఎంచుకున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ టూర్‌కు వెళ్తే అక్కడ నిత్యకృత్యంగా మారిపోయాయి. ప్రతిపక్షాలపైనే ప్రభుత్వం ఎక్కువగా ఈ చర్యలకు పాల్పడుతున్నది.
ఇక అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ విద్యార్థులు, యువత, వివిధ కుల సంఘాలకు చెందిన సంఘాలు ధర్నాలు చేశాయి. అసెంబ్లీ ముట్టడి పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించాయి. ఒక దశలో పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తక తప్పలేదు. సహజంగానే పోలీసులు అరెస్టులూ చేశారు. ప్రశ్నించే అవసరం ఉండదంటూ కేసీఆర్ చెప్పిన మాటలు చివరకు ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తామనే తీరులో అమలవుతున్నాయి. విపక్షాల నుంచే కాక ఏ సెక్షన్ ప్రజల నుంచీ అసమ్మతిని, అసంతృప్తిని, వ్యతిరేకతను ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నది. ప్రతిపక్షాలతో సంబంధమే లేకుండా ప్రజలు ఎక్కడికక్కడ వారి స్థానిక, దైనందిన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
కేంద్రంపై విమర్శలు అలా.. రాష్ట్రంలో ఇలా
కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులే లేకుండా విపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తున్న కేసీఆర్ తన ఏలుబడిలో తెలంగాణలోనూ ఇదే అమలు చేస్తున్నారు. ఎదుటివారిని వేలెత్తి చూపే ముందు దాన్ని ఆచరించడం సహజ సూత్రం. కానీ ఈ విషయంలో మాత్రం తనకు వర్తించదనే తీరులో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామిక సూత్రాలను వల్లెవేసే ఆయన అదే సూత్రాలను ఉల్లంఘిస్తున్నారు. తరచూ హైకోర్టు అక్షింతలు వేస్తూ ఉన్నది. న్యాయస్థానాలను ఆశ్రయిస్తే మాత్రమే న్యాయం జరుగుతుందని ప్రజలు గ్రహించారు. దళిత బంధు విషయంలో సైతం కొద్దిమంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారానే న్యాయాన్ని పొందారు. నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తున్నదనేది ప్రభుత్వ ఆచరణ ద్వారా స్పష్టమవుతున్నది.
గణతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా జరిపే విషయంలోనూ ప్రభుత్వం ఏకపక్షంగానే వ్యవహరించింది. కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో పెరేడ్‌తో కూడిన ఉత్సవాలు జరగాలని ఆదేశించింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం విషయంలోనూ ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ప్రసంగం ఉండేలా ఇరు తరపున న్యాయవాదులే పరిష్కరించుకోవాలని సూచించింది. దీంతో చివరకు ప్రభుత్వం మెట్టు దిగి పాటించక తప్పలేదు. కోర్టుల దాకా వెళ్లిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన అందిస్తానని మాటల్లో చెప్తున్నా చేతల్లో భిన్నంగా వ్యవహరిస్తున్నది. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉన్నామని చెప్తూనే వాటిని తుంగలో తొక్కుతున్నది.
చెప్పేందుకే నీతులున్నాయా?
విలువలు, సూత్రాలు ఎదుటివారికే అనే తీరులో తెలంగాణ సర్కారు ప్రవర్తిస్తున్నది. అధికార పార్టీ నేతలపై ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉంటున్నది. విపక్షాలతో ముప్పు తప్పదనే భయం తలెత్తినప్పుడు అణచివేయడానికి వెనుకాడడం లేదు. నియంతృత్వం, నిరంకుశత్వం అనే పదాలకు అర్థాలు, వివరణల సంగతి ఎలా ఉన్నా ప్రశ్నించేవారి గొంతుల్ని నొక్కేస్తున్నది. రోడ్లమీద నిరసనలను సహించలేకపోతున్నది. ప్రతిపక్షాలైనా, ప్రజా సంఘాలైనా అదే తీరు. కేంద్రాన్ని విమర్శించే కేసీఆర్ తన రాష్ట్రంలో ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు క్లారిటీ ఇవ్వడంతో పాటు అలాంటి వాతావరణాన్ని నెలకొల్పితే అదే పదివేలు. ఆయన మాటలకు తగిన చేతలతో పరిపాలన సాగిస్తే అది బంగారు తెలంగాణ. అప్పుడే దేశానికి తెలంగాణ రోల్‌మోడల్.
ఎన్. విశ్వనాథ్
9971482403