భయంతోనో, ఒత్తిడితోనో, ఆందోళనతోనో, పీడితుడిగానో చేసుకునే ఆత్మహత్యలన్నీ ‘సామాజిక హత్య’లే అంటాడు ఫ్రెడరిక్ ఎంగెల్స్. ‘సామాజిక హత్యలు’ అనే పదాన్ని 1845లో ‘ది కండిషన్ ఆఫ్ ది వర్కింగ్-క్లాస్ ఇన్ ఇంగ్లాండ్’ గ్రంథంలో ఆయన ఉపయోగించాడు. దేశంలో, రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు చూస్తుంటే ఇవి నిజమేననిపిస్తున్నది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదు. సరైన పరిష్కారాలు చూపించాల్సిన విపక్షాలు.. దీన్ని రాజకీయ అంశంగా వాడుకుంటున్నాయి. దీంతో యువతలో నిరాశ, నిస్పృహలు అలుముకుంటున్నాయి. ‘సమాజం’ నుంచీ సరైన మద్దతు లేక.. ‘బలవన్మరణాలు’ చోటుచేసుకుంటున్నాయి. ఈ ఆత్మహత్యలను కొందరు ప్రభుత్వ హత్యలుగా అభివర్ణిస్తుంటే.. మరికొందరు మాత్రం సమాజం చేసిన హత్యలుగా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సూసైడ్స్‌ను ఆపడానికి.. నిరుద్యోగుల్లో భరోసా కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలపై మాత్రం సరైన చర్చలు జరగడం లేదు.
ఆందోళనకరంగా ఆత్మహత్యలు
దేశంలో ప్రతియేడు నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దీనిపై పార్లమెంట్ స్థాయీ సంఘం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. రైతుల ఆత్మహత్యలను జాతీయ సంక్షోభంగా అభివర్ణిస్తున్నప్పటికీ విద్యార్థుల మరణాలు మాత్రం ఎవ్వరి దృష్టినీ ఆకర్షించడం లేదని పేర్కొంది. కాగా, 1995 తర్వాత నిరుద్యోగుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల డేటా ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా 1,39,123 మంది ఆత్మహత్యలు చేసుకోగా, వీరిలో 14,019 మంది నిరుద్యోగులే ఉన్నారు. 2018లో 1,34,516 మంది ఆత్మహత్య చేసుకోగా, వీరిలో 12,936 (9.6%) నిరుద్యోగులు ఉన్నారు. 2017లో 1,29,788మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 12,241(9.4%)మంది నిరుద్యోగులు ఉన్నారు. 2016లో 1,31,008 మంది ఆత్మహత్యలు రికార్డ్ కాగా, అందులో 11,173 (8.5%)మంది నిరుద్యోగులు ఉన్నారు. 2015 లో ఆత్మహత్య చేసుకున్న వారిలో నిరుద్యోగుల శాతం 8.2 కాగా, 2014లో 7.5 శాతముంది. కాగా, 2021లో రైతుల ఆత్మహత్యల సంఖ్య 10,881 ఉంటే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 13,089గా ఉందని పార్లమెంట్ స్థాయి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
వాయిదాలతో నిరాశ, నిస్పృహలు
రాష్ట్రంలో 80,039 పోస్టుల ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ప్రకటించారు. మొత్తంగా ఈ రెండు కలుపుకుని 91,142 పోస్టులు భర్తీ అవుతాయని చెప్పారు. ఆ తర్వాత వరుసగా గ్రూప్స్, టీఆర్టీ, ఎస్ఐ, కానిస్టేబుల్ సహా వివిధ పోస్టులకు నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ మొదలైంది. పరీక్ష నిర్వహించిన తర్వాత పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్-1 రద్దయింది. ఆ తర్వాత మరోసారి పరీక్ష నిర్వహించగా, బయోమెట్రిక్ తీసుకోలేదన్న వివాదంతో మరోసారి పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-2 పరీక్ష ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. నవంబర్‌లో జరగాల్సిన డీఎస్సీని కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 30 లక్షల మంది నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నరు.
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పార్టీలు సరైన పరిష్కారమార్గాలు చూపలేకపోతున్నాయి. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి.. ఆ తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నాయి. గత ఎలక్షన్ టైమ్‌లో నిరుద్యోగ యువతకు రూ.3,016 భృతి ఇస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. 2019-20 బడ్జెట్‌లో రూ.1,810 కోట్లు కేటాయించినా.. ఆ తర్వాత ఆ హామీని నెరవేర్చలేకపోయింది. దీంతో యువతను ఓటు బ్యాంకుగా చూస్తున్న వివిధ పార్టీలు, ఈ ఎన్నికల సమయంలోనూ అనేక హామీలు ఇస్తున్నా.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అనే మీమాంసలో యువత ఉన్నది.
కౌన్సెలింగ్ అవసరమే!
పార్లమెంట్ స్థాయి సంఘం సూచించిన విధంగా పోటీ పరీక్షల్లో విఫలమైన వారికి ప్రభుత్వాలు ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులో ఉంచితే మంచిది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరమున్నది. మరోవైపు ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాలు, ధోరణులను కనిపెట్టడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే బావుంటుంది. అయితే ఏ సమస్యకైనా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదని యువతలో నమ్మకం నింపగలిగేది సమాజం మాత్రమే. ప్రభుత్వాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఓ వైపు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తూనే... యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ప్రయివేటు రంగంలోనూ కనీస వేతనాలు అమలయ్యేలా ప్రత్యేక చట్టాలు తీసుకువస్తే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు రాకున్నా ప్రయివేటు ఉద్యోగాల వైపు ఆసక్తి చూపే అవకాశముంటుంది.
-ఫిరోజ్ ఖాన్,
సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
96404 66464