ముస్లిం మైనారిటీలు ఎటువైపు?
Where are the Muslim minorities in the Telangana elections?
స్వాతంత్య్రం సిద్ధించి డెభ్భై ఐదేళ్లయినా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా అనేక వర్గాలకు ఇంకా ఆ ఫలాలు అందని ద్రాక్షలుగానే ఉన్నాయి. అందులో ముస్లిం సమాజం ముందు వరుసలో ఉంది. అందుకే జస్టిస్ సచార్ నివేదిక అయినా, సుధీర్ కమిషన్ అయినా వారిలో చాలా ఆశలు రేపింది. మిగతా వర్గాలతో పోలిస్తే ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులు ఏ మాత్రం మెరుగ్గా లేవని నివేదికలు తేల్చాయి. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ముస్లింల జీవన పరిస్థితుల్లో మార్పులు రాకపోగా అభద్రతా భావం పెరిగింది. వారిలో పేదరికం కూడా ఎక్కువే. పల్లెటూళ్ళలో సెంటు భూమి కూడా లేని వారిలో ఎక్కువ మంది ముస్లింలే. దీంతో వారు రోజువారీ కూలీలుగా బతుకులీడుస్తున్నారు. ఊర్లలో ఉపాధి అవకాశాలు తగ్గడంతో చాలా మంది దగ్గరలోని పట్టణాలవైపు వలస బాట పట్టారు. రోడ్ల పక్కన పండ్లు ఫలాలు అమ్ముకోవటం, రిపేరింగ్ , మెకానిక్ లాంటి పనులతో సరిపెట్టుకుంటున్నారు. ముస్లిం సమాజ సమస్యలను అర్థం చేసుకోవటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఫలితంగా ఎన్నేళ్లు గడిచినా అవి పరిష్కారాలకు నోచుకోవడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నైనా తమ బతుకులు బాగుపడతాయని ముస్లింలందరూ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించారు. కేసీఆర్ లౌక్యానికి, ఆయన మాట్లాడే ఉర్దూకు ముస్లింలు ఫిదా అయ్యారు. కచ్చితంగా తమ వాటా తమకు దక్కడంలో కేసీఆర్ నూరుశాతం పనికొస్తాడని నమ్మారు. ముఖ్యంగా బారా పర్సెంట్ రిజర్వేషన్ (12%రిజర్వేషన్ ) నాలుగు నెలల్లోనే సాధించి తీరతానని చేసిన వాగ్దానానికి ఉబ్బితబ్బి పోయారు. ఆయన మాట్లాడిన తీరుకు పరవశులై ఖచ్చితంగా రిజర్వేషన్ సాధించి తీరతాడని నమ్మారు.
అడిగితే నోర్మూసుకో అంటారా?
కానీ మొక్కుబడి తీర్మానం చేసి చేతులు దులుపుకుంటాడని అస్సలు అనుకోలేదు. అయినా సరే ఆశకొద్దీ రెండు దఫాలూ నెత్తిన పెట్టుకొని మోశారు. కానీ కేసీఆర్ మాత్రం ఆ నమ్మకాన్ని విజయవంతంగా వమ్ము చేశారు. పదేళ్ళు గడిచినా దాని ఊసేలేదు. ఒక ముస్లిం వ్యక్తి ఓ సభలో ఆ విషయాన్ని గుర్తు చేయగా, చిర్రెత్తిన ముఖ్యమంత్రి, 'ఎవడ్రా నువ్వు నోర్మూసుకుని కూర్చో... నీ అయ్యకు కూడా సమాధానం చెబుతా' అని ఆగ్రహించారు. మైనారిటీ రుణాలకు దిక్కేలేదు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన ఫండ్ సగం మురిగిపోవడమే తప్ప, ఎవరికీ రుణాలిచ్చిందే లేదు. మొన్నటికి మొన్న ప్రకటించిన లక్ష రుణం కూడా మండలానికి ఒకటో రెండో పార్టీ కార్యకర్తలకిచ్చారు తప్ప మైనారిటీలకు ఒరిగింది శూన్యం. ఆ పేరుతో వేలాదిమంది అప్లికేషన్లు, జిరాక్సుల పేర మీ సేవా కేంద్రాల ముందు సమయమంతా వృధా చేసుకొని వేలాది రూపాయలు నష్టపోయారు. ఇమాం, మౌజన్‌లకు కూడా అక్కడక్కడా విదిల్చేది వక్ఫ్ బోర్డ్ ఫండే తప్ప మరొకటి కాదు. షాదీ ముబారక్ ఇస్తున్నామని మరో డబ్బా. కళ్యాణలక్ష్మినే ఉర్దూలో షాదీ ముబారక్ అంటున్నారు తప్ప ప్రత్యేకంగా ఏమీ ఒరగబెట్టడం లేదు.
వక్ఫ్ ఫండ్‌కే గతిలేదు...
మైనారిటీలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న వాగ్దానం ఏ వాగులో కలిసిందో చెబితే బాగుంటుంది. ఉర్దూను రెండవ అధికార భాషగా అమలు చేస్తామన్న వాగ్దానమూ కాగితాలకే పరిమితమైంది. ఇఫ్తార్ విందు అని మరో డంబాచారం. మాకీ ఇఫ్తార్ విందులు, చీకిపోయిన చీరలు వద్దు.. ఉద్యోగాలివ్వండి, ఉపాధి అవకాశాలు కల్పించండి మొర్రో అని మొత్తుకుంటుంటే, ఒక పూట బిర్యానీ తిని పండగ చేస్కోండి అని ప్రభుత్వం చెబుతోంది. వక్ఫ్ ఫండును ఈ విధంగా దుర్వినియోగం చేసి ఇది మా సర్కార్ ఘనకార్యం అని చెప్పుకోవడం మరో సిగ్గుచేటు. గుడ్డిలో మెల్లలా మైనారిటీ గురుకులాలను చెప్పుకోవచ్చు. ఇవి పేరుకు మైనారిటీ హాస్టళ్ళయినా అక్కడి ప్రధాన ఉద్యోగులంతా మైనారిటీయేతరులే. తుమ్మితే ఊడేముక్కు లాంటి ఉద్యోగులు మాత్రం ముస్లిం మైనారిటీలు. ఇటువంటి నేపథ్యంలో ఈసారి కేసీఆర్‌ను ముస్లింలు నమ్మడం కష్టంగానే కనబడుతోంది. పదేళ్ళుగా ఏమీ చేయని కేసీఆర్ ఇప్పుడేదో చేస్తాడని అనుకోవడం కూడా అవివేకమే. ఇఫ్తార్ విందు లాంటి తాత్కాలిక తాయిలాలు తప్ప, నిర్దిష్టంగా ముస్లింల సంక్షేమానికి చేసింది నూటికి నూరు శాతం సున్నా. ఆయనగారి మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదు. మరో విషయం ఏమిటంటే, కేసీఆర్‌కు బీజేపీతో ఏదో లోపాయికారీ అవగాహన ఉన్నదని, బీజేపీకి బీఆర్‌ఎస్, బీటీమ్ అని ఇటీవల ఉధృతంగా జరుగుతున్న ప్రచారం కూడా నిజమేనేమోనన్న అనుమానమూ వారిలో కనబడుతోంది.
ఓటు బ్యాంకులుగా మిగలొద్దు
ఈ కారణాలతోనే ఈసారికి ముస్లింలు బీఆర్‌ఎన్‌ను కాదని కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆ మేరకు ముస్లింలకు నమ్మకం కలిగించే విధంగా కాంగ్రెస్ వ్యవహరించాల్సి ఉంది. ముస్లింల విషయంలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాబోవని నమ్మించవలసి ఉంది. తెలంగాణలో కనీసం 40 నుంచి 50 స్థానాల్లో ముస్లింల ఓట్లు గెలుపోటములను నిర్ణయించే శక్తిగా ఉన్నాయి. అందుకని ముస్లిం మైనారిటీలను లైట్ తీసుకుంటే కుదరదు. ఇకపోతే ముస్లింలు కూడా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఇంకా ఎదురు చూడటం మాని, రాజ్యాంగ ప్రసాదితమైన హక్కుల సాధనకు రాజ్యాంగ బద్దంగానే పోరాడాలి. పాలక పక్షాలు చురుగ్గా స్పందించేలా దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులు, హక్కుల నేతలు, లౌకిక వాదులు, వామపక్షీయులు, బహుజన శక్తులతో కలిసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలి. ప్రజాస్వామ్య శక్తులు, భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌరసమాజం సహకారంతో ముస్లిం నేతలు, సంఘాలు ఐక్య కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమాలకు పూనుకోవాలి. బాధిత వర్గాల్లో చైతన్యం రానంత కాలం పాలక పక్షాలు వారిని ఓటు బ్యాంకులుగానే పరిగణించి చిన్నచిన్న తాయిలాలతోనే సంతృప్తి పరిచే ప్రయత్నాలు చేస్తుంటాయి. కనుక చైతన్యంతో కార్యాచరణ రూపొందించుకొని సాధన దిశగా ముందుకు సాగాలి. మతపరమైన అంశాలను పక్కనపెట్టి అభివృద్ధి దిశగా ముస్లిం సమాజం ముందడుగు వేయాలి. ఇది నేటి తక్షణ అవసరం.
- ఎండి. ఉస్మాన్ ఖాన్
సీనియర్ జర్నలిస్ట్
99125 80645