గృహిణులపై హింస ఆగేదెన్నడో!

When will violence against housewifes decrease

Update: 2023-11-03 00:15 GMT

దేశవ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన జాతీయ గృహిణుల దినోత్సవం జరుపుతూ వివిధ కార్యక్రమాలు చేపడుతూ, అభినందనలు తెలుపుతూ ఉంటాం. కానీ నేటికీ దేశంలో 81.2% శాతం మహిళలు వెట్టిచాకిరి వలలో జీవితాలు గడుపుతూ ఉండుట గమనార్హం. ఇంటికి దీపం ఇల్లాలే అనే పేరుతో మన పితృస్వామిక కుటుంబ వ్యవస్థలో మహిళలను ఇంటికే పరిమితం చేస్తూ, వంటింటికే తన జీవితం అంతా అంకితం చేసేలా మన కుటుంబ వ్యవస్థను నిర్మించారు. ఎన్ని సామర్థ్యాలు ఉన్నా మహిళల ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేలా మన దేశంలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థను నిర్మించారు.‌ అనేక సామాజిక పోరాటాలు ద్వారా ముఖ్యంగా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, రఘుపతి వెంకటరత్నం నాయుడు, గురజాడ, వీరేశలింగం, అంబేద్కర్ వంటి ఎందరో సంఘసంస్కర్తల కృషి ఫలితంగా దేశంలో మహిళలకు చదువు, ఉద్యోగం, హక్కులు, చట్టాలు వచ్చాయి. అంతేకాకుండా వరకట్న నిషేధ చట్టం, నిర్భయ చట్టం, దిశ యాప్, 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం వచ్చినా మహిళలకు రక్షణ భద్రత లేకుండా, ఎక్కడ చూసినా మహిళల పట్ల వివక్షత లైంగిక వేధింపులు దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో చాలా కుటుంబాల్లో వెలుగు చూడని మహిళలపై జరుగుతున్న దాడులు, హింసలు కోకొల్లలు. ముఖ్యంగా వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళలు ఎందరో...! ఆ తల్లిదండ్రుల కడుపుకోత తీరేదెన్నెడు...! అనాధలుగా మిగులుతున్న వారి పిల్లలకు రక్షణ ఎవరు..! అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంది.

ఇంట్లో, బయటా హింసలు..

ఇక పిల్లలను కని, పెంచి పెద్ద చేసిన మాతృమూర్తిగా, తల్లిదండ్రులు (లేదా) పెద్దవారు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన (లేదా) తాను ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసి కొని ప్రతీ క్షణం తన జీవితాన్ని తన కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ తాను వెలుగుతూ, కరుగుతూ తన జీవితాన్ని అర్పించే గృహిణిల త్యాగం కొలవగలమా? వెలకట్టలేని ఆ జీవితాలను మానవతా వాదులుగా మనమే (మగవారం) మనలో సగభాగంగా అన్ని విధాలుగా తీర్చిదిద్దాలి. గృహిణిలు అంటే వంటింటికే పరిమితం అనే భావన నుంచి బయటపడాలి.‌ వారి శ్రమలో భాగస్వాములు కావాలి. కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉండాలి. సమాన అవకాశాలు, హక్కులు కల్పించాలి. మత, కుల, లింగ ఆధారంగా అణిచి వేయరాదు. ముఖ్యంగా మహిళల చదువులకు పెద్దపీట వేయాలి. మహిళల ఆరోగ్యానికి కుటుంబ సభ్యులు, ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఎందుకంటే మహిళల్లో ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి పోషకాహారం లోపం ఎక్కువగా ఉంటుంది అని ఆరోగ్య సర్వే పేర్కొంటుంది.‌ కరోనా కాలంలో ఎక్కువగా వీరికే నష్టం వాటిల్లింది. ఇంట్లో తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త పిల్లల పోషణలోనే గృహిణుల జీవితం గడిచిపోతుంది. దీంతో వీరి ఆరోగ్యం క్షీణిస్తుంది. చదువుకుని, ఉద్యోగం చేస్తున్న గృహిణుల జీవితాల్లో కూడా అణచివేత, హింసా జరుగుతూనే ఉంది.‌

మహిళా రిజర్వేషన్‌లో జాప్యమెందుకు?

మహిళలు గృహిణులకు ఆర్థిక స్థోమత, స్వాతంత్య్రం కంటే సామాజిక న్యాయం చేయాలి.‌ మగవారితో సమానంగా మహిళలకు స్థానం కల్పించాలి. ప్రస్తుతం వచ్చిన చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ చట్టం తక్షణమే అమలు చేయాలి. అంతేకానీ 2029 నుంచి అమలు చేస్తాం అనే భావన వెనుక ఉన్న అణిచివేసే గుణాన్ని ప్రశ్నించాలి...! ఇల్లాలి చదువు - ఇంటికి వెలుగు అనే భావన మరువరాదు. ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఇటీవల కాలంలో దేశ భద్రతకు సంబంధించిన ఆర్మీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, క్రీడల్లో మహిళలు రాణిస్తూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.. అదే విధంగా ప్రతీ ఇంట్లో మహిళగా, గృహిణిగా అనేక సేవలు అందిస్తున్న మహిళల శ్రమను ఇకనైనా గుర్తించాలి. గౌరవించాలి. మహిళలు, బాలికలు, గృహిణిలపై జరుగుతున్న దాడులు, అణిచివేతలు, హింసలపై మనం అందరం గళం ఎత్తాలి. మహిళా సాధికారత దిశగా ప్రయాణం చేయాలి.‌ చట్టాలు చేయడమే కాదు వాటిని సక్రమంగా అమలు చేయాలి. ముఖ్యంగా మహిళా చట్టాలపై గృహిణిలకు, బాలికలకు అవగాహన కల్పించాలి. మహిళలు, బాలికలు, గృహిణిల భద్రత రక్షణ కోసం వారి అభివృద్ధి కోసం పురుషులు, ప్రభుత్వాలు, మీడియా, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ సహకరించడమే ఈ దినోత్సవ ప్రాధాన్యత అని అందరూ గ్రహించాలి.. అంతేకానీ, మొక్కుబడిగా సంబరాలు, సత్కారాలు చేసి చేతులు దులుపుకోరాదు.

(నేడు జాతీయ గృహిణుల దినోత్సవం)

-ఐ. ప్రసాదరావు

63056 82733

Tags:    

Similar News