స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు?

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నవంబర్ 30న జరిగాయి, డిసెంబర్ 3న తీర్పు వచ్చింది. 2023 డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది

Update: 2024-08-22 00:45 GMT

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నవంబర్ 30న జరిగాయి, డిసెంబర్ 3న తీర్పు వచ్చింది. 2023 డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 2024 జనవరి 31 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. త్వరలో స్పెషల్ ఆఫీసర్ల పదవీకాలం కూడా ముగియనుంది. లోక్‌సభ, శాసనసభ సభ్యుల పదవీకాలం ముగిసిన ఆరు నెలలలోపు ఎన్నికలు జరుపుతారు. మరి స్థానిక సంస్థల పదవీకాలం ముగిసిన ఆరు నెలల లోపు ఎన్నికలు ఎందుకు జరుపుతలేరన్నది ప్రశ్న.

పాత రిజర్వేషన్ ప్రకారం నిర్వహిస్తే..

కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు కావస్తున్నా కులగణన చేయలేదు. కులగణన చేస్తామని టీవీలలో చెప్తున్నారు, పేపర్లలో రాస్తు న్నారు కానీ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కులగణన నిర్వహించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ కుల సంఘాలు కోరుతున్నాయి. ఇంకో వారం పది రోజుల్లో బీసీ కమిషన్ పదవీకాలం కూడా ముగుస్తుంది. ఇప్పుడున్న బీసీ కమిషన్ పదవీకాలం పొడిగించడం లేదా కొత్త కమిషన్‌ని ఏర్పాటు చేసి బీసీ గణన చేసి ఎన్నికలు నిర్వహించాలంటే దాదాపు ఇంకో మూడు నాలుగు నెలలు అవుతుంది. లేదంటే పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తే నెల రోజుల్లో అన్నీ అయిపోతాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర నిధులు రాక గ్రామాలలో అభివృద్ధి కుంటుపడింది. భారత రాజ్యాంగం ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల ఐదేళ్ల పదవీకాలం ముగిసే లోపే తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలి. గ్రాంట్ల రిలీజ్ చిక్కులతో ఈమధ్య కేంద్ర పంచాయతీరాజ్ శాఖ త్వరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి, వీలైనంత త్వరగా ముగించండి అని రాష్ట్రానికి ఒక లేఖ రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం ఇంకా స్పందించడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఇకనైనా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా నిర్వహించాలి.

దుప్పల్లి జావీద్

99596 67609

Tags:    

Similar News