అమరుల బలిదానాలకు ఆత్మశాంతి ఎప్పుడు?

When is the peace of mind for the sacrifices of the immortal heroes of Telangana?

Update: 2023-06-22 00:00 GMT

తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తొలి దశ తెలంగాణ ఉద్యమంలో సుమారు 369 మంది పోలీస్ కాల్పుల్లో మరణిస్తే, మలి దశ తెలంగాణ ఉద్యమంలో 1386 మంది తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు.. ప్రతి ఒక్క తెలంగాణ అమరవీరుడి ప్రాణత్యాగం వెనక ఒక్కో వీర గాధ ఉంది. ప్రపంచంలో ఏ ఉద్యమంలోనూ ఏ నాయకుడు కూడా ఆత్మహత్యల వైపు ఉద్యమాన్ని నడిపించలేదు. కానీ మన తెలంగాణ నాయకులు మాత్రం భావోద్వేగాలు రగిలించి ఒంటిపై పెట్రోల్ పోసుకొని 1386 మంది ఆత్మహత్య చేసుకోవడానికి మార్గదర్శనం చూపించారు.. తెలంగాణ విద్యార్థులు, యువత ఆత్మత్యాగాలు చేసింది మేము చనిపోయినా మా తెలంగాణ అభివృద్ధి చెంది మా రైతన్నలకు నీళ్లు వస్తాయని, నా అన్న చెల్లెలకు ఉద్యోగాలు వస్తాయని, కోటి ఆశలతో వాళ్లు నిప్పు కణికలై తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించుకున్నారు... తెలంగాణ రాష్ట్ర నినాదంలో మరో ప్రధానమైన నినాదం స్వపరిపాలన.. మరి ఈరోజు తెలంగాణను ఏలుతున్నది ఎవరు?

ఉద్యమద్రోహులతో.. నివాళులా?

ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి వ్యతిరేకంగా ఎవరైతే మా పిల్లలపై లాఠీలు ఎత్తారో, వాళ్లే ఈరోజు అధికారం అనుభవిస్తున్నారు. నాడు మా పిల్లలు పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసుకుంది ఉద్యమద్రోహం చేసిన నాయకులు అధికారం అనుభవించడానికా? అమరవీరుల స్మృతి వనం దగ్గర రేపు నివాళులర్పించనున్న మంత్రులలో ఎంతమంది అమరవీరుల చావుకు కారణం? అమరవీరులు ఉద్యమ ద్రోహుల గురించి రాసుకున్న మరణ వాంగ్మూలాలను మరచిపోయారా ఈ పాలకులు! ఇటువంటి తెలంగాణ ఉద్యమ ద్రోహులు నివాళులు అర్పిస్తే అమరవీరుల ఆత్మలకు ఆత్మ శాంతి కలుగుతుందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఎమ్మెల్యేలకు మంత్రులకు జీతాలు పెంచుకున్న మీకు, అసలు తెలంగాణ రాష్ట్ర చిరకాల స్వప్నం సాధించుకున్న తెలంగాణ అమరుల కుటుంబాలకు ప్రభుత్వం చేసిన సహాయం ఏమిటి? ఒక తెలంగాణ అమరవీరుడి ప్రాణం ఖరీదు పది లక్షల రూపాయలా? ఒక అటెండర్ ఉద్యోగమా? ఒక డబుల్ బెడ్ రూమా? ఇదేనా మనం తెలంగాణ అమరవీరులకు ఇచ్చే గౌరవం? తెలంగాణ ఉద్యమాన్ని చిత్రంగా తీసి వ్యాపారం చేసుకున్న వ్యక్తికి వందల కోట్ల విలువచేసే భూమిని ఉచితంగా ఇస్తారు.. కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇవ్వడానికి మీకు అడ్డు వచ్చిన నిబంధనలు ఏంటి? పార్లమెంటు సాక్షిగా 1000 మందికి పైగా నా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పిన కేసీఆర్, ఈరోజు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో నిర్లక్ష్యం ఎందుకు? కేవలం 459 మందిని గుర్తించి మిగతా 837 మంది కుటుంబాలను గుర్తించకపోవడానికి గల కారణాలు ఏమిటో ప్రజలకు చెప్పవలసిన అవసరం బాధ్యత ఉంది.

వారికి ఏం కావాలో చర్చించారా?

తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు..వారు కలలు కన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ చేరినప్పుడే వారి ఆత్మలకు ఆత్మ శాంతి కలుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, యువత వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తెలంగాణ అమరవీరుల స్మృతి వనం ఏర్పాటు చేస్తున్న ఈ ప్రభుత్వానికి, కనీసం దాని ప్రారంభోత్సవానికి అమరవీరుల కుటుంబ సభ్యులను ఆహ్వానించకపోవడం అంటేనే తెలంగాణ అమరవీరుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందో గుర్తించాలి! అసలు నిజంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఏమి కావాలని కోరుకుంటున్నారో ఏనాడైనా వారితో చర్చించారా? వారికి కావాల్సింది ఆత్మగౌరవంతో బతకడానికి కనీసం 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, గ్రూప్ 2 స్థాయికి తగ్గకుండా ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ నగరంలో 1000 గజాలకు తక్కువ కాకుండా ఇంటి స్థలంతో పాటు, వారి కుటుంబాలకు ప్రతినెల 50 వేల రూపాయల పెన్షన్ ఇచ్చినప్పుడు వారి పట్ల మన కృతజ్ఞత. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల స్మృతి వనం ఏర్పాటు చేసిన చేయకున్న మా పిల్లల త్యాగాలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ గుర్తే ఉంటాయి. అందుకే తెలంగాణ అమరవీరుల స్మృతి వనం పేరు మార్చి కేసీఆర్ కపట దీక్షకు గుర్తుగా కల్వకుంట్ల స్మృతి వనంగా నామకరణం చేసుకోండి.. లేదా మీకు నిజంగా తెలంగాణ అమరవీరుల పట్ల గౌరవం ఉన్నట్లయితే తెలంగాణ అమరవీరులైన 1386 మందిని గుర్తించి, వారి కుటుంబ సభ్యులతో ఈ అమరవీరుల స్మృతి చిహ్నం ప్రారంభించినప్పుడే నిజంగా తెలంగాణ అమరవీరుల ఆత్మలకు ఆత్మ శాంతి కలుగుతుంది..

ఎం. రఘు మా రెడ్డి

తెలంగాణ అమరవీరుల కుటుంబాల పరిరక్షణ అధ్యక్షులు

83282 12979

Tags:    

Similar News