కార్పొరేషన్లతో బీసీలకు ఒరిగిందేంటి? ఒరిగేదేంటి?

కార్పొరేషన్లతో బీసీలకు ఒరిగిందేంటి? ఒరిగేదేంటి?... what is the use of 56 bc corporations in andhrapradesh is they helpful

Update: 2023-01-30 18:45 GMT

ప్రభువు మనస్తత్వమే పరిపాలనగా ఉంటుందని చరిత్ర చెప్పిన మాట. నేటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన మూడున్నరేళ్ల పాలనలో అత్యధిక జనాభాగా ఉన్న బీసీలను నిరంతరం మభ్యపెడుతున్నా తీరు మోసపూరితం. బీసీ కులాల వారికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు మార్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్న తీరు హాస్యాస్పదమని చెప్పవచ్చు. రెండేళ్ళ క్రితం ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లు వాటికి నిధులు, పాలకవర్గాలకు అధికారాలు లేని, నిర్ణయాధికారం లేని పదవులను కట్టబెట్టారు. గౌరవం లేని గౌరవ వేతనం పొందుతూ చైర్మన్, డైరెక్టర్లు కాలం వెళ్లదీస్తూ, ఎవరికి చెప్పాలో, ఎక్కడ చెప్పాలో దిక్కుతోచక పార్టీ అదేశాలతో ప్రభుత్వ పథకాల ప్రచారం చేయడానికి ఔట్ సోర్సింగ్ నాయకులుగా మారారడనంలో ఎలాంటి సందేహం లేదు. గత రెండేళ్ళుగా ఈ కార్పొరేషన్లు ఉన్నా, తమ కులాల అభివృద్ధికి ఒక్క రూపాయి మంజూరుకు ప్రభుత్వ అనుమతి తీసుకురాని దురదృష్టవంతులుగా మిగిలారు. ఇప్పుడు ఆయా కులాల కార్పొరేషన్ల పాలక వర్గాలను మరో రెండేళ్ళు కొనసాగించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా బీసీలకు ఒరిగిందేమిటి? ఒరిగేదేంటి? అన్నది బీసీ ప్రజల మదిలో నేడు మెదలుతున్న ప్రశ్న. ఇలా పసలేని, పైసాలేని పదవుల పందేరం ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందన్న వాదన రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉంది.

అన్ని నిధులు నవరత్నాలకే..

రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతోకొంత ఉద్యమ నేపథ్యం ఉన్న బీసీ సంఘాల నేతలకు చైర్మన్, డైరెక్టర్ లాంటి ఉత్తిత్తి ఉద్యోగాలు ఇచ్చి ఉద్యమాలను, నాయకత్వాలను అణచివేశారు. గతంలో బీసీలుగా ఐక్యతగా ఉన్నవారిని ఉపకులాల కార్పోరేషన్ల పేరుతో వారిని విభజించి ప్రభుత్వ పథకాలకు సోషల్ మీడియా ప్రచారకర్తలుగా ప్రభుత్వం మార్చిందనేది వాస్తవం. గతంలో ఏ ప్రభుత్వం బీసీలకు ఇలాంటి సామాజిక, రాజకీయ ఆర్థిక అన్యాయం చేయలేదు. బ్యాక్ వర్డ్ కులాలు కాదు, బ్యాక్ బోన్ కులాలు అంటూనే బీసీలను బోన్‌లెస్ చేశారు. సంక్షేమం పేరుతో బీసీలకు రావాలసిన అనేక పథకాలకు మంగళం పాడారు. అలాగే అరకొర ఆర్థిక సహాయం అందించే బీసీ కార్పొరేషన్‌కు ఎన్ఎఫ్‌బీసీ రుణ సదుపాయాలు లేవు. పేరుకే బీసీలకు బడ్జెట్ కేటాయించినా, ఆచరణలో మాత్రం అన్ని నిధులను నవరత్నాలకు మళ్ళిస్తున్నారు.

రాష్ట్రంలో సాంఘీక, సామాజిక సంక్షేమానికి సమాధి కట్టి తాత్కాలిక తాయిలాల పథకాలతో జగన్ తరహా సంక్షేమం నేడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభానికి దారి తీసే పరిస్థితులు కనపడుతున్నాయి. దీనినే పదే, పదే సంక్షేమ రాజ్యంగా, ఎక్కడా లేని అభివృద్ధి అంటూ ప్రభుత్వ పెద్దలందరూ సభలు పెట్టి ప్రచారం చేస్తుండటం విచారకరం. కానీ ప్రభుత్వం మాత్రం బీసీల ప్రభుత్వం అని డాంబికాలు కొట్టుకుంటోంది. అందుకే ప్రభుత్వం బీసీల ప్రయోజనం కోసం చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మెజారిటీ బీసీ ప్రజల నుంచి డిమాండ్ గా ఉంది. ప్రభుత్వం కూడా దీనిని ముందుకు వచ్చి విడుదల చేయడం బాధ్యతగా భావించాలి.

వాళ్ళకే ప్రాధాన్యత ఉన్న పదవులు

గత మూడేళ్లుగా బీసీల కోసం ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టకపోగా, గతంలో ఉన్న పథకాలను సైతం ఎత్తేశారు. ఈ మూడేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ బీసీ యువతకు అందలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రావలసిన బడ్జెట్లు కాగితాలకే పరిమితమవుతున్నాయి. వీటిని ప్రభుత్వం అన్ని కులాలకు సామూహికంగా ఇచ్చే నవరత్నాలులో కలగలిపింది. దీనిపై ఎవరైన నిలదీస్తే వారిని నాయకులు దబాయిస్తున్న పరిస్థితి నేడు కనిపిస్తుంది. ఎలాంటి నిర్ణయాధికారం, నిధులు లేని కార్పోరేషన్లు ఏర్పాటు చేసి కులంలో ఉద్యమకారులుగా ఉన్న వారికి డైరెక్టర్, చైర్మన్ ఆశ చూపి వారిని ప్రభుత్వ ప్రచారకర్తలుగా ఉండేలా చేసి బీసీల కులాల ఐక్యతను నిలువులా చీల్చిన ఘనత జగన్‌కే దక్కుతుంది. అలాగే వివిధ ప్రధాన కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలలోనూ, ప్రభుత్వ సలహాదారులలోనూ, ఐఏఎస్, ఐపీఎస్, జిల్లా స్థాయి అధికారుల నియామకాల్లోనూ, బదిలీల్లోనూ బీసీలకు అన్యాయమే చేశారు చేస్తున్నారు.

బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత లేని పదవులు ఇచ్చి సొంత కులానికి మాత్రం హోదా కలిగిన పదవులు కేటాయించారు. బీసీలకు పారిశ్రామిక రంగంలో రాయితీలు ఎండమావులు గానే ఉన్నాయి. విదేశీ విద్య, జగనన్న కాలనీల్లోనూ బీసీలకు తీవ్ర అన్యాయమే జరుగుతోంది. పోలవరం, వెలుగొండ లాంటి ప్రాజెక్టులు పూర్తి కానందున అరకొర భూములున్న బీసీ కుటుంబాలు ఆర్థికంగా బాగుపడలేదు. అవి ఎక్కడ వేసిన గొంగళి తరహాలోనే ఉన్నాయి. సుప్రీంకోర్టు 10 శాతం బీసీ రిజర్వేషన్లను కొట్టేసినప్పటికీ తాను ఓపెన్ కేటగిరిలో బీసీలకు జగన్ కోటా పేరుతో రిజర్వేషన్లు కేటాయిస్తానని కేబినేట్‌లో చర్చలు జరిపి కూడా అమలు చేయని ఘనత జగన్‌కే దక్కుతుంది. ఇలాంటి మోసపూరిత చర్యలను బీసీ ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బీసీ ప్రజలు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు.

జి. వీరభద్రాచారి

బీసీ నాయకులు

63017 96606

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

అసమానతలపై ప్రశ్నించిన- మూక్ నాయక్ 


Tags:    

Similar News