విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం ఎవరు?

విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం ఎవరు?... what is the cause of student suicides

Update: 2023-03-14 19:00 GMT

విద్య అనేది ఒక సామాజిక సాంస్కృతిక జీవన మార్గాన్ని రూపొందిస్తుంది. విద్య ప్రపంచ జ్ఞానానికి మార్గం. ప్రపంచాన్ని మనముందు ఆవిష్కరిస్తుంది. ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తుంది. మానవ జీవన సోపానమైన విద్య ప్రపంచ వ్యక్తిత్వాన్ని మనకు ఆవాహనం చేస్తుంది. విద్య అంటే ముందు తనను తాను తెలుసుకోవడం. తనను తాను తెలుసుకోలేని మనిషి చరిత్ర చెప్పే పాఠాలను నేర్వలేడు. విద్యకు ఏకాగ్రత దిక్సూచి. మనిషిని విద్యేతరమైన అంశాలు నిరంతరం వెంటాడుతూ వుంటాయి. వాటిని అధిగమించే శక్తినిచ్చేదే స్వీయ నియంత్రణ. నిజానికి మనిషి మేధో శక్తి అనితర సాధ్యమైంది. దానికి విన్నవి, కన్నవి తన మేధస్సుకు సమన్వయించి సముజ్వలం చేయగల శక్తి ఉంది.

విద్యాబోధనలో నాణ్యత అవసరం..

ప్రస్తుత సమాజ గమనంలో విద్య కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి వెళ్ళింది. కార్పోరేట్ విద్యా వ్యవస్థ మెదడుకు వత్తిడిని కలిగించి, జ్ఞానాన్ని ధ్వంసించి పరీక్షోన్ముఖమైన దారి చూపుతుంది. ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్న వారు కొందరు తమ పిల్లల్ని కార్పొరేట్ విద్యలోకి నెట్టి జ్ఞాన శూన్యమైన విద్యా సోపానాన్ని ఎక్కించాలని ప్రయత్నిస్తున్నారు. కార్పొరేట్ విద్యాలయాలకు అధిక ధనాన్ని విద్యార్జన కోసం వెచ్చిస్తున్నారు. విద్యను ఒక జ్ఞాన స్రవంతిగా, వాస్తవ జీవన ప్రవాహంగా అభ్యసించినప్పుడే వాళ్ళు ప్రపంచ గమనంలోకి వెళ్లగలుగుతారు. దానికి భిన్నమైన కృత్రిమ విద్య వారు గ్రహించలేరు. అందుకే విద్యలో అంతరాలు ఏర్పడుతున్నాయి. విద్యలోకి కూడా మత, కుల, వర్గ భేదాలు జొరబడ్డాయి.

అయితే ఇప్పుడు విద్యా బోధనలో నాణ్యత తీసుకురావడమే ముఖ్యమైన అంశం. కార్పొరేట్ విద్యాలయాల్లో ఉన్న వ్యాపార సంస్కృతిని ప్రభుత్వం నేరపూరితమైనదిగా గుర్తించాలి. అందులో ఆటస్థలాలు లేవు. ల్యాబ్‌లు లేవు. ఎన్‌రోల్‌మెంట్ కూడా వేరే ప్రభుత్వ కాలేజీల్లో వాళ్ళు చేస్తున్న విషయం గుర్తించవలసి ఉంది. ప్రభుత్వ విద్య అభివృద్ధి చెందాలంటే ప్రపంచ భాషగా అభివృద్ధి చెందిన ఇంగ్లీష్ మాధ్యమ బోధన అనివార్యం. అంతమాత్రాన మాతృభాషను విస్మరించకూడదు. మాతృభాషలో జీవశక్తులు ఉంటాయి. ఆ జీవశక్తులను నేర్చుకునే భాషలోకి పరివర్తితం చేయగలగాలి. ఇంగ్లీష్ భాషని మనం నేర్పే క్రమంలో గృహాన్ని కూడా మోడ్రన్ స్ట్రక్చర్‌లోకి తీసుకు వెళ్ళాలి. విద్యార్థులకు ప్రత్యేకమైన గదులుండాలి. టేబుళ్లుండాలి. డిక్షనరీలు ఉండాలి. గ్లోబ్ ఉండాలి. ‘‘బైజూస్’’ లాంటి తగిన నూతన పరికర ప్రాయోగిక అంశాలు గృహ వాతావరణం లేకుండా వర్ధిల్లవు. ముఖ్యంగా మధ్య తరగతి గృహిణుల గృహ వాతావరణాన్ని విద్వేషపూరితంగా సీరియల్స్ ద్వారా మారుస్తున్నాం. దానివల్ల విద్యార్థులకు అవసరమైన విద్యా వాతావరణం గృహాల్లో లేదు.

పోషకాహార లేమితో విద్యార్థులు..

కార్పొరేట్ విద్యాశాలలు బలవంతంగా విద్యను బుద్ధి మీద రుద్దుతున్నాయి. దానివల్ల ప్రభుత్వ విద్యార్థులకు, కార్పొరేట్ విద్య నిర్దేశించే విద్యార్థులకు మధ్య తీవ్రమైన వైరుధ్యాన్ని అది ముందుకు తీసుకువచ్చేసింది. పైగా విద్యార్జనకు సంబంధించిన శారీరక శక్తి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థికి లేదు. హైస్కూళ్ళలో అసెంబ్లీ మొదలయ్యే సమయానికి విద్యార్థులకు రాగి బిస్కెట్లు, కాల్సియం బిస్కెట్లు, గ్లాసు పాలు ఇవ్వాల్సి ఉంది. దానిమ్మ, యాపిల్, బొప్పాయి, జామ వంటి పండ్లు ఉదయం 11 గంటలకు అందివ్వాల్సి ఉంది. విద్యార్థులు పోషకాహార లేమితో రక్తహీనతతో బాధపడుతున్నారు. లైన్ డేట్స్ జెల్ వారికి పాలలో కలిపి ఇవ్వాల్సి ఉంది. జీడి పప్పు, బాదం పప్పు, వేరుశనగ పప్పు వంటి బలవర్ధకమైన ఆహారాలు విద్యార్థులకు అందివ్వాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఇజ్రాయేల్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాలలోని స్కూల్స్‌లో తప్పనిసరిగా అందిస్తున్నారు. మెదడుకు ఆహార శక్తి చాలా అవసరం. శారీరక శక్తి లేని విద్యార్థులు చివరి పీరియడ్ కల్లా బల్లమీద ఒరిగిపోతున్నారు.

బహుముఖ ప్రత్యేకత అవసరం

ప్రభుత్వ విద్య అంటే కేవలం అక్షరార్జన కాదని తెలుసుకోవాలి. విద్య అంటే అది జీవన సంస్కృతీ నిర్మాణం. మానవాభ్యుదయానికి అది సోపానం. కార్పొరేట్ విద్యాలయాల్లో చదువుతున్న వారికి జీవితం తెలియడం లేదు. జీవించడం అంటే సమాజంతో జీవించడమే. మానవత్వంతో జీవించడమే. సుఖదుఃఖాలతో జీవించడమే. ప్రపంచ వ్యాప్తంగా విద్య పెరుగుతుంది. విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి. భాషాధ్యయనమే ఒక ఉపాధిగా కూడా పెరుగుతోంది. వరల్డ్ బ్యాంక్, యూ.ఎన్.ఓ, యునెస్కో, డబ్ల్యుహెచ్‌ఓ, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో లాంగ్వేజ్ ఎక్స్‌ఫర్ట్స్ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక్క ఇంగ్లీషే కాదు, చైనీస్, జర్మని, ఫ్రెంచ్, రష్యన్ వంటి అన్ని భాషలూ నేర్చుకోవాల్సిన అవసరం ముందుకొచ్చింది. భాషలతో పాటు శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం, కవిత్వం వంటి అనేక కళలు, క్రీడల సామర్థ్యం, సాంకేతిక విద్యలు ఈనాడు బహుముఖంగా విద్యార్థులు అభ్యసించవలసిన చారిత్రక దృక్పథం అవసరమైంది.

ఈ చారిత్రక సందర్భాన్ని మరచిన కార్పొరేట్ వ్యవస్థలు పిల్లలపై ఒత్తిడి తీసుకొచ్చి వారిని ఆత్మహత్యలకు గురిచేస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలైన నారాయణ, శ్రీచైతన్య అధిపతులు సామాజిక విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. వీరి ఆగడాలపై సీబీఐ విచారణ జరిపించాల్సిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. విద్య ఒత్తిడి వల్ల రాదు. విద్యను ప్రేమతో, మమతతో, అనునయంతో, ఆత్మీయతతో, జ్ఞానంతో నేర్పవలసిన అవసరం ఉంది. విద్యార్థి ఆసక్తిని బట్టి నేర్పాలి. తల్లిదండ్రుల ఆకాంక్షను బట్టి ఆయా కోర్సులకు విద్యార్థులను బలవంతంగా నెట్టడం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. విద్య ఒక జ్ఞాన సోపానం మానవాభ్యుదయానికి మార్గం. జీవన సౌరభాలు వెదజల్లాల్సిన జీవితాలపై ఉక్కుపాదాలు మోపటం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అంబేద్కర్ మార్గంలో విద్యా వ్యవస్థను పునర్నిర్మించుకోవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఆ మార్గంలో నడుద్దాం.

డా.కత్తి పద్మారావు

అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్

9849741695

Tags:    

Similar News