జగన్, ఢిల్లీలో ధర్నా దేనికోసం..!

ఒక దేశమైనా, ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలతో పాటు ప్రధానమైనది శాంతిభద్రతల పరిరక్షణ.

Update: 2024-07-25 01:15 GMT

ఒక దేశమైనా, ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలతో పాటు ప్రధానమైనది శాంతిభద్రతల పరిరక్షణ. తమ పరిశ్రమలు, వ్యాపారాలు నిరాటంకంగా సాగుతాయని, తమ పెట్టుబడులకు రక్షణ ఉంటుందనే నమ్మకం ఉన్నచోటే పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడతారు. ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకపోయినా, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అనుమానం వచ్చినా వారు నిస్సంకోచంగా మరో ప్రాంతానికి తరలిపోతారు.

డెబ్బయ్యవ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజధాని హైదరాబాద్‌లో తరచుగా మతకల్లోలాలు జరగడం వలన అభివృద్ధికి ఆటంకం కలిగింది. కానీ 1983లో ఎన్టీఆర్ సారధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం మతకల్లోలాలను, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసి శాంతిభద్రతలను కాపాడటం వలన హైదరాబాద్ నగరానికి రాష్ట్రం నలుమూలల నుండి వలసలు మొదలైనాయి. తదుపరి చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత, ఐటి రంగ అభివృద్ధికి చేసిన కృషిని తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించడం వలన ఈరోజు హైదరాబాద్ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలను ఆకర్షించి తెలంగాణా రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి చోదకశక్తిగా రూపుదిద్దుకుంది.

వైసీపీ హయాంలో..

యాభై రోజుల టీడీపీ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని 36 రాజకీయ హత్యలు, 35 రాజకీయ ప్రేరేపిత ఆత్మహత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు, 1050 పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసంతో ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిందని నిరాధారంగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. దీనిపై రాష్ట్ర పోలీసు శాఖ స్పందిస్తూ జూన్ 4 నుండి రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలలో మృతిచెందిన నలుగురిలో ముగ్గురు టీడీపీ, ఒకరు వైసీపీకి చెందిన వారని స్పష్టం చేసింది. నిజానికి సిటిజెన్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రిపోర్ట్ ప్రకారం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు వంటి సంఘటనల్లో ఆంధ్రప్రదేశ్ 2,375 ఘటనలతో (2021) దేశంలో 7వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీలపై 33.7 శాతం క్రైం రేటు నమోదైతే.. గత ప్రభుత్వంలో 37.5 శాతం ఉందని తేల్చింది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం, రాజకీయ హత్యల విషయంలో 2022లో 16 హత్యలు, 244 రాజకీయ ప్రేరేపిత దాడులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల తరువాత 3వ స్థానంలో నిలిచింది. 2020-2022 వరకు మహిళలపై 60,344 దాడులు, 621 మానభంగం హత్య కేసులు, 300 పైగా హత్యా ఘటనలు జరిగాయి. సుమారు పది వేల మంది మహిళల ఆచూకీ లభ్యం కాలేదని కూడా నివేదిక తెలిపింది. ఇవి కాకుండా ఎంపీ రఘురామకృష్ణం రాజుపై జరిగిన 'కస్టోడియల్ టార్చర్' డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతం, విజయనగరం జిల్లాలో జరిగిన ఉపాధ్యాయుడు కృష్ణ దారుణ హత్యతో పాటు సుమారు 2868 టీడీపీ నాయకులపై జరిగిన దాడులు, హత్యలకు జగన్ బాధ్యుడని టీడీపీ తీవ్రంగా తప్పు పడుతోంది. కేవలం ఆంధ్రప్రదేశ్ పరపతిని దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నం తప్ప జగన్ పాలనలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా దిగజారడంతో పాటు రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి స్వాతంత్య్రం ప్రశ్నార్థకం అయినప్పుడు రాష్ట్రపతి పాలన విధించారా? అని టీడీపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కోసం..

ఏదేమైనా రాష్ట్రంలో కక్షలు, కార్పణ్యాలు లేని ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటానికి అన్ని రాజకీయ పక్షాలు కృషి చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకపక్షంతో పాటు నిర్మాణాత్మకంగా, సునిశితంగా వ్యవహరించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతిపక్షం మీద కూడా ఉంటుంది. కానీ ప్రస్తుత రాజకీయ పార్టీలు ఈ మౌలిక ప్రజాస్వామ్య సూత్రాన్ని విస్మరిస్తున్నారు. విభజన సమస్యలు, దిగజారిన ఆర్థిక వ్యవస్థ వలన ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఇటీవల కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే దృష్టితో కార్యాచరణ చేపట్టడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వంలో తనకున్న పలుకుబడితో కేంద్ర బడ్జెట్లో అమరావతి కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్లు, పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన మొత్తం నిధులు ఇస్తామన్న హామీ, వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి సాధించడం హర్షణీయం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా పారిశ్రామిక వేత్తలతో స్వయంగా ముఖ్యమంత్రి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటువంటి తరుణంలో మరింతగా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేయవలసిన ప్రతిపక్ష నాయకులు వై.ఎస్ జగన్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్‌తో ఢిల్లీలో ధర్నా చేయడం విచారకరం, బాధ్యాతారాహిత్యం. గత ఐదేళ్లల్లో ప్రతిపక్షాలు 'రాజ్య హింస'ను అనుభవించారనేది కాదనలేని సత్యం. అయితే రాష్ట్రంలో కక్ష సాధింపులకు తావు ఉండకూడదని, అదే సమయంలో తప్పు చేసిన వాళ్లను న్యాయబద్ధంగా శిక్షిస్తామని. టీడీపీ కూటమి నాయకులు కూడా సంయమనం పాటించాలని శాసనసభలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఆహ్వానించదగింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యాలుగా సాగుతున్న ముఖ్యమంత్రి విధానాలు అప్రతిహతంగా సాగాలంటే అందరి సహకారం అవసరం.

- లింగమనేని శివరామ ప్రసాద్

7981320543

Tags:    

Similar News