Ask Dr. Bhartahi: సెక్స్‌ని సైన్స్‌గా చూడకపోతే?

ఆడపిల్లలు ఎదిగే సమయంలో లైంగిక విషయాల పట్ల భయం, అసహ్యం కలిగేట్లు, అదేదో పాపం, నీచం అనేట్లు, సిగ్గుపడే అంశంగా... పద్ధతులు

Update: 2024-09-22 01:00 GMT

ఆడపిల్లలు ఎదిగే సమయంలో లైంగిక విషయాల పట్ల భయం, అసహ్యం కలిగేట్లు, అదేదో పాపం, నీచం అనేట్లు, సిగ్గుపడే అంశంగా... పద్ధతులు, సంప్రదాయాలు, సంస్కృతి పేరుతో హద్దులు, నియమాలు ఏర్పరుస్తూ మాట్లాడటం వలన సెక్స్ పట్ల నెగెటివిటీ, భయం, ఆందోళన కలిగి విముఖత ఏర్పడుతుంది. అలాగే వారిపై పురుషులు చేసే లైంగిక అత్యాచారాలు కూడా వారిలో పురుషుల పట్ల ద్వేషాన్ని, సెక్స్ పట్ల విముఖతను పెంచుతాయి. కానీ కలయిక సమయంలో నొప్పిని భరిస్తూ బయటకు చెప్పకుండా భర్త ఆనందం కోసం మౌనంగా సహకరించడం భార్య ధర్మమన్న భావన ఇప్పటికీ స్త్రీ, పురుషులిద్దరిలో ఉంది. సెక్స్‌లో స్రీలతో శాస్త్రీయ పద్దతులు అవలంబించేలా, అమానవీయంగా స్త్రీ దేహం మీద అధికారాన్ని, స్త్రీని తన స్వంత ఆస్తిగా భావించి బలవంతపు హింసాత్మక సెక్స్‌ని చేసే పురుషాహంకార ధోరణిని మాన్పించే మానవీయ ధోరణితో కౌన్సెలింగ్, థెరపీ చేయవలసి ఉంది. 

ప్రశ్న: డాక్టర్ గారూ, నాకు పెళ్లయి ఎనిమిది నెలలు అవుతున్నది. ఇప్పటిదాకా మా మధ్య కలయికే జరగలేదు. నా భార్య ప్రతీసారీ నొప్పి అని బాధ పడుతూనే ఉంది. నాకు నిరాశగా ఉంది. ఇంట్లో కూడా నా భార్య దాంపత్యానికి పనికి వస్తుందా? అని సందేహ పడుతున్నారు. పుట్టింటికి పంపే ఆలోచన చేస్తున్నారు. దీంతో నా భార్యా, ఆమె పుట్టింటివాళ్లు ఆందోళన పడుతున్నారు. నా భార్యని పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. కానీ ఆమె సమస్య వల్ల నాకు కూడా ఇబ్బందిగా, విసుగ్గా ఉంది. నన్ను ఏం చేయమంటారు?

- వివేక్(నిజామాబాద్)

జవాబు: వివేక్ ముందుగా నీ సౌజన్యానికి అభినందనలు. సమస్య ఉన్నప్పటికీ భార్యని కోల్పోవడం ఇష్టం లేదన్నావు చూడు అది చాలా గొప్ప విషయం. దాన్ని అలాగే నిలబెట్టుకోవాలంటే నువ్వు విసుగు పడకుండా ఆమెని అర్థం చేసుకోవాలి. నీకే ఆ సమస్య వస్తే ఆమె ఇలాగే విసుక్కుంటే, నీకేలా అనిపిస్తుంది? ముందుగా ఆమెకు నొప్పి రావడానికి గల కారణాలను అన్వేషించాలి. ఆమె సమస్యకి పూర్తిగా చికిత్స ఉంది. ముందు ఆమె సమస్యని వైద్య, మానసిక పరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 

కలయికలో నొప్పికి కారణాలు ..

కలయిక సమయంలో స్త్రీలకి అంతర, బాహ్య ప్రత్యుత్పత్తి అవయవాల్లో, ముఖ్యంగా యోని నాళం లోపలా, బయటా, చుట్టూ, పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి కలగడాన్ని డిస్పెరూనీయా అంటారు. 35-45% మందికి నొప్పి ప్రతిసారీ ఉండవచ్చు. కొంతమందికి కొన్నిసార్లే అనిపించవచ్చు. తొలి కలయికలో నొప్పి రావాలని ఏమీ లేదు. తొలి కలయికలో ఫెయిల్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ నొప్పి వస్తుందని లేదు. అయితే ఈ నొప్పికి, చికిత్సకి సెక్సాలజిస్ట్ దగ్గరికి కానీ, సైకోథెరపిస్ట్ దగ్గరికి కానీ 4% మంది కూడా వెళ్లడం లేదు. నొప్పిని భరిస్తూ బయటకు చెప్పకుండా భర్త ఆనందం కోసం మౌనంగా సహకరించడం భార్య ధర్మమన్న భావన ఇప్పటికీ స్త్రీ, పురుషులిద్దరిలో ఉంది. నొప్పితో విలవిల లాడే భార్యను పట్టించుకోకుండా తమ ఆనందమే లక్ష్యంగా తమ పని చేసుకోవడం పితృస్వామ్య వ్యవస్థలో పురుష కేంద్రంగా రచించబడిన సూత్రాల్లో భాగంగా, మూసిన తలుపుల వెనకాల నిశబ్దంగా సాగించే సాధారణమైన విషయంగా నడుస్తూనే ఉంది. దాదాపు 45% శాతం మంది స్త్రీలు డిస్పెరూనీయా అనే సెక్స్ సమస్య వల్ల నొప్పి ఒకటే కాదు మంట, రక్త స్రావాన్ని కూడా ఎదుర్కొంటూ తరువాత ఇన్ఫెక్షన్స్‌కి గురవుతున్నారు.

డిస్పెరూనీయాకి శారీరక కారణాలు..

శృంగార సమయంలో భయాందోళనలతో కటివలయపు కండరాలను అతిగా అసంకల్పితంగా బిగుసుకుపోయినా భర్త బలవంతంగా అంగ ప్రవేశం చేయటం వలన నొప్పి ఎక్కువగా కలుగుతుంది. ఇక ప్రతిసారీ నొప్పి కలుగుతుందేమోనని కండ రాల బిగింపు జరుగుతూనే ఉంటుంది. ఇదొక సైకిల్. భర్త ఫోర్ ప్లే సరిగా చేయక పోవడం వల్ల లూబ్రికేషన్‌కి కావాలసినంతగా యోనిలో విడుద ల కాకపోవడం వలన అక్కడ ఎండిపోయి, కలయిక జరగక మంట, నొప్పి కలుగుతాయి. కలయిక సమయంలో యోని పొడవులో, వెడల్పులో బలవంతంగా సాగవలసి రావడం వలన. గర్భాశయ కండరాలు బిగుసుకు పోవడం. సెక్స్ అవయవాల్లో బాక్టీరియాల, ఫంగల్ ఇన్ఫెక్షన్ వలన వాటి చుట్టూ, యోని నాళం {వెజినల్ కెనాల్} లోపల బయటా వాపు నొప్పి కలుగుతాయి. PCOD వలన ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపం ఏర్పడి యోని ఎండుకుపోయి. లూబ్రికేషన్ కాక డ్రైగా మారి నొప్పి కలుగుతుంది.

అలాగే... కాపర్ టీ, లూప్ వంటి స్థానికంగా నొప్పి కలిగించే కుటుంబ నియంత్రణ సాధనాలు. బారథోలిన్ గ్రంథుల్లో వాపు, ఇన్ఫెక్షన్, బాహ్య జననాంగాల్లో పుండ్లు, దద్దుర్లు, మెనోపాజ్ దశలో వెజినా డ్రై అయిపోవడం, మందమైన హైమెన్ పొర, షుగర్ తగ్గడానికి వాడే మందుల వల్ల వెజైనా లోపలి పొరలు మందబారుతాయి. జననాంగాలను సబ్బుతో, డెట్టాల్‌తో శుభ్రపరుచుకోవడం వలన రసాయనాల రియాక్షన్ వలన అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి కలయికలో నొప్పి ఉంటుంది.

మానసిక కారణాలు..

కలయిక అంటేనే భయం, ఆందోళన ఎందుకు? అంటే నొప్పి, రక్తస్రావం అవుతాయన్న భయం వల్ల వెజినా కండరాలు బిగించడం. మొదటి కలయికలో భర్త దురుసుగా ప్రవర్తించి బలవంతపు కలయిక జరపడం వల్ల కలిగే భయం తరువాతి కలయికల్లో నొప్పిని కలుగచేస్తుంది. ఆడపిల్లలు ఎదిగే సమయంలో లైంగిక విషయాల పట్ల భయం, అసహ్యం కలిగేట్లు, అదేదో పాపం, నీచం అనేట్లు, సిగ్గుపడే అంశంగా... పద్ధతులు, సంప్రదాయాలు, సంస్కృతి పేరుతో హద్దులు, నియమాలు ఏర్పరుస్తూ మాట్లాడడం వలన సెక్స్ పట్ల నెగెటివిటీ, భయం, ఆందోళన కలిగి విముఖత ఏర్పడుతుంది. సమాజంలో స్త్రీలు, పసిపిల్లల పట్ల పురుషులు చేసే లైంగిక అత్యాచారాలు కూడా వారిలో పురుషుల పట్ల ద్వేషాన్ని, సెక్స్ పట్ల విముఖతను పెంచుతాయి. సినిమాల్లో స్త్రీలను రేప్ చేసే దృశ్యాలు, ప్రసవించే దృశ్యాలు భయంకరంగా చూపించడం కూడా సెక్స్ పట్ల విముఖతను కలిగిస్తాయి. బాల్యంలో లైంగిక అత్యాచారాలకు లోను కావడం కూడా పురుషుల పట్ల భయాన్ని పెంచి పెద్దయ్యాక దాంపత్య జీవితంలో సమస్యలను సృష్టిస్తాయి.

చికిత్స

లైంగిక వ్యాధులకి గైనకాలజిస్ట్ వద్ద మందులు వాడాలి. సెక్స్ పట్ల భయాందోనలను, అనుమానాలను, అపోహలను తగ్గించుకోవడానికి సెక్సాలజిస్ట్, మ్యారేజీ కౌన్సెలర్‌ని కలవాలి. సైకోథెరపీ కూడా భయాందోళనలను తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. లైంగిక అవయవాల నిర్మాణాన్ని, పనితీరుని అర్థం చేసుకోవడం వల్ల కూడా అపోహలు తొలగుతాయి. వీటిని శాస్త్రీయంగా ఒక సైన్సు లాగా సెక్సువాలిటీ & సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా అర్థం చేయించాలి. కౌన్సెలింగ్‌కి భార్యాభర్తలు ఇద్దరూ పాల్గొనాలి. సెక్స్‌లో స్త్రీలతో శాస్త్రీయ పద్ధతులు అవలంబించేలా, అమానవీయంగా స్త్రీ దేహం మీద అధికారాన్ని, స్త్రీని తన స్వంత ఆస్తిగా భావించి బలవంతపు హింసాత్మక సెక్స్‌ని చేసే పురుషాహంకార ధోరణిని మాన్పించే మానవీయ ధోరణిని పెంచే ఫీమేల్ ఓరియెంటెడ్ కౌన్సెలింగ్‌ని, బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీని ఇస్తారు. భార్య సమస్యను సహానుభూతితో అర్థం చేసుకొని ఆమెకు తోడుగా ఉండి ఆమెలో భయం పోయేలా భర్త సహకరించాలి. కొడుకు లోపాలను దాచిపెట్టి, కోడలిని వేధించే, బెదిరించే అత్త మామలకి, ఇతర కుటుంబ సభ్యులకి కూడా ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇవ్వాలి.

- డాక్టర్ భారతి,

సెక్సువల్ హెల్త్ & ఫ్యామిలీ కౌన్సెలర్,

ప్రీ & పోస్ట్ మేరేజ్ & సెక్సువల్‌ కౌన్సెలింగ్

79892 27504

askdoctorbharathi@gmail.com

Tags:    

Similar News