రామగుండం ఫెర్టిలైజర్స్ నిర్వాసితుల హామీలు ఏమయ్యాయి?
రామగుండం ఫెర్టిలైజర్స్ నిర్వాసితుల హామీలు ఏమయ్యాయి?... What happened to Ramagundam Fertilizers residents' assurances
ప్రజాస్వామ్యంలో అధికార పక్షాల వారికి ప్రజా వ్యతిరేకత విధానాలను ప్రజలకు తెలిసే విధంగా ప్రజల భాగస్వామ్యంతో బహిరంగంగా నిరసన రూపకంగా నివేదించడం ప్రజాస్వామిక మార్గం అవుతుంది. నవంబర్ 12 న ఆర్ఎఫ్‌సీఎల్‌ను జాతికి అంకితం చేయడానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీని అడ్డుకుంటామని కొన్ని సంస్థలు ప్రకటించాయి. అందుకే, ప్రజాస్వామ్య బద్ధ నిరసనలను, ప్రజాస్వామిక పద్ధతిలో ఆదరించి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పరిశ్రమలను, పర్యావరణాన్ని పరిరక్షించి ఉపాధి ,ఉద్యోగ అవకాశాలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
దేశంలో ఎరువుల కొరత తీవ్రమవడంతో రామగుండం, తాల్చేర్, సింద్రీ, గోరఖ్‌పూర్ ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ ఆవశ్యకత పెరిగింది. అందులో భాగంగానే 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ 'రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్)'ని రిమోట్ ద్వారా ప్రారంభించారు. దీని అంచనా వ్యయం సుమారు రూ.6.175.51 కోట్లు. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) 26 శాతం, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఈఎల్) 26 శాతం, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్) 11 శాతం, తెలంగాణ ప్రభుత్వం 11 శాతం, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్ ఇండియా) 14.3 శాతం, హాల్దార్ టాప్స్ కన్సార్టియం (హెచ్‌టీఎఎస్) 11.7 శాతం అప్పు రూపేణా రూ. ఐదు వేల కోట్ల దాకా సమకూర్చాయి.
2018 ఆగస్టు 18న అగ్రిమెంట్ జరిగింది. ఈ ప్రాజెక్టుకు ఎల్లంపల్లి నుంచి నీరు, తెలంగాణ జెన్‌కో నుంచి కరెంటు, స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ అనుసంధానంతో కాకినాడ నుంచి పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుంది. ఈ కంపెనీ మార్చి 2022 నుంచి 'కిసాన్ బ్రాండ్' పేరుతో రోజుకు 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియం, 3850 మెట్రిక్ టన్నుల యూరియా తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
వారి హామీలు బుట్టదాఖలు
ఆర్ఎఫ్‌సీఎల్‌ను పునరుద్ధరించడంతో నాలుగు గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు. సమీప గ్రామాల ప్రజలు కాలుష్యానికి, ప్రమాదాలకు గురయ్యారు. ఇక్కడి యూరియాను రైలు ద్వారా తెలంగాణకు 43,120 టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 14,631, మహారాష్ట్రకు 11,205, కర్ణాటకకు 23,477, ఛత్తీస్‌గఢ్‌కు 11,513 టన్నులు సరఫరా చేశారు. ఆర్ఎఫ్‌సీఎల్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను 759.76 కోట్ల నష్టాలను చవిచూసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.67 కోట్ల లాభాలను గడించింది. పునరుద్ధరణ కోసం స్థలం సర్వే చేపడుతున్న సమయంలో అప్పటి కలెక్టర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారి, ఆర్ఎఫ్‌సీఎల్ ముఖ్య కార్యనిర్వణాధికారి అక్కడి నిర్వసితులకు ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేశారు.
రాష్ట్రపతి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మార్గదర్శకాలకు విరుద్ధంగా కింది స్థాయి ఉద్యోగాలను ఎక్స్ఛేంజీల సహాయంతో నియమించుకుని స్థానికులకు అన్యాయం చేశారు. మొత్తం 16 పని స్థలాలను గుర్తించి అందుకుగాను 600 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 1000 మంది కాంట్రాక్టు కార్మికులు అవసరమని అంచనా వేశారు. కానీ, వారిని పూర్తిస్థాయిలో నియమించుకోకపోగా, వారి దగ్గర నుంచి పర్మినెంట్ చేస్తామని రూ. ఐదు లక్షలు వసూలు చేశారు. దీంతో మోసపోయామని గ్రహించి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్ఎఫ్‌సీఎల్‌లో ఇప్పటికే రెండుసార్లు అమ్మోనియా వాయువు లీక్ అయింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలతో ఇండ్ల నుంచి బయటకు వచ్చారు.
అది ప్రజాస్వామికం
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, వరద కాలువ, ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులు, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు, దుమ్ముగూడెం, దేవాదుల ఎత్తిపోతల పథకాలు, ధవళేశ్వరం బ్యారేజ్ పోలవరం ప్రాజెక్టుల ద్వారా తాగునీరు, సాగునీరు గోదావరి నది ద్వారా ఉపయోగించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 'మిషన్ భగీరథ' పేర తాగునీరు సరఫరా చేస్తున్నారు. కానీ, గోదావరి నది కలుషితం కాకుండా, నీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం లేదు. దాదాపు రెండున్నర లక్షల జనాభా ఉన్న రామగుండం కార్పొరేషన్, 2,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన్ ఎన్‌టీపీసీ, 62.50 మెగావాట్ల జెన్‌కో, ఆర్ఎఫ్‌సీఎల్ పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజీ నీరు గోదావరి నదిలో కలిసిపోతున్నాయి. 99 శాతానికి మించి కాలుష్యం నదిలో కలుస్తున్నది.
సింగరేణికి ప్రభుత్వం 2014 నుంచి బడ్జెట్ సపోర్ట్ అందించకపోయినా స్వయం కృషితో ప్రగతి సాధించుకుంది. పన్నుల రూపేణా 14,362.18 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి, 13,105.22 కోట్లు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి 2,26285 కోట్లు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేర 44.391 కోట్లు, కొత్తగూడెం రైల్వే లైన్‌కు 700 కోట్లు అటవీ భూమల పరిహారానికి 450 కోట్లు చెల్లించడం జరిగింది.
అయినా, నిరాదరణే
ఇంత చేస్తున్నా సింగరేణిని కోల్ మైన్స్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ 2015 పేర కమర్శియల్ మైనింగ్ పేర 100 శాతం ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడంతో ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలకు నష్టం వాటిల్లే సంస్కరణలను వేగిరం చేసింది. ప్రజాస్వామ్యంలో అధికార పక్షాల వారికి ప్రజా వ్యతిరేకత విధానాలను ప్రజలకు తెలిసే విధంగా ప్రజల భాగస్వామ్యంతో బహిరంగంగా నిరసన రూపకంగా నివేదించడం ప్రజాస్వామిక మార్గం అవుతుంది.
నవంబర్ 12 న ఆర్ఎఫ్‌సీఎల్‌ను జాతికి అంకితం చేయడానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీని అడ్డుకుంటామని కొన్ని సంస్థలు ప్రకటించాయి. అందుకే, ప్రజాస్వామ్య బద్ధ నిరసనలను, ప్రజాస్వామిక పద్ధతిలో ఆదరించి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పరిశ్రమలను, పర్యావరణాన్ని పరిరక్షించి ఉపాధి ,ఉద్యోగ అవకాశాలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
మేరుగు రాజయ్య
కేంద్ర కార్యదర్శి
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)
94414 40791