మోడీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిందేంటి..!?

What development has India achieved during nine years of Modi government?

Update: 2023-06-06 00:15 GMT

ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి మే 26వ తేదీకి సరిగ్గా 9 ఏండ్లు పూర్తి చేసుకున్నారు. మే 30 నుండి జూన్ 30 వరకు మోడీ అభివృద్ధి ఉత్సవాలను బీజేపీ నిర్వహిస్తుంది. 2014 ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండాతో కొత్తతరం నేతగా మోడీ తెరపైకి రావడంతో దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దేశ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోనికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు తొమ్మిదేళ్లు, ఒకసారి వెనక్కి తిరిగి చూసి, ఈ తొమ్మిది పాలనలో ఆయన ఏం చేశారు అని సింహావలోకనం చేస్తే, చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా అసమర్థ, అసంబద్ధ పాలన విధానాల ద్వారా దేశ ఆర్థిక, సామాజిక జీవనాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారు. అప్పటి వరకు ఉన్న రాజకీయ అవినీతి వ్యవస్థను మెరుగుపరిచి, ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచి అందరి శ్రేయస్సుకోసం నిర్ణయాలు తీసుకునే సమర్థవంతమైన నేత మన ముందుకు వచ్చారని సంబరపడ్డారు. అయితే అద్భుత ప్రసంగాలు, అమోఘమైన వాగ్దానాలు, హావభావ విన్యాసాలు, ఆచరణ ఎరుగని ఆదర్శాలతో దేశ ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన మోడీ దేశాన్ని అధోగతి పాలు చేశారు.

15 లక్షలు ఇచ్చేస్తారట..

దేశంలోని అవినీతి పరులు దేశ సంపదను లూటీ చేసి స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లు దోచుకున్నారని, 2014లో నల్లధనాన్ని వెనక్కి తెస్తానని దానిని దేశ ప్రజలకు పంచితే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వస్తాయని, వాటిని ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తామని మోడీ వాగ్దానం చేశారు. గత ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని పెంచి పోషించారని 2015 లో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగాన్ని రూపుమాపుతానని.. దేశంలో అత్యధిక మంది ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి వైపు తీసుకొచ్చి రైతు ఆత్మహత్యల నుండి రక్షించుతామని, దేశాన్ని ముందుకు తీసుకుపోయే సామర్థ్యం నరేంద్ర మోడీకి మాత్రమే ఉందని కమలనాధులు ఊదరగొట్టారు. అయితే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వ విధానాల వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ధరలు, భారీగా పెరిగిపోయాయి.

రైతుల నడ్డి విరిచిన చట్టాలు

దేశానికి వెన్నెముకైన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు వ్యవసాయాన్ని మానేసే పరిస్థితి తీసుకొచ్చారు, వ్యవసాయ సబ్సిడీలు తగ్గించారు. వ్యవసాయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చి కోట్లాదిమంది వ్యవసాయ రంగాన్ని వదిలేస్తున్నారు. కార్పోరేట్లకు అనుకూలంగా మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చారు. దీనిపై దేశవ్యాప్తంగా రైతాంగంలో పెల్లుబికిన నిరసనలతో తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. వంద సంవత్సరాలుగా భారతదేశ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను సంస్కరణ పేరుతో కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 కోడ్‌లుగా మార్చి కార్మిక వర్గ హక్కులపై దాడి చేయడం జరుగుతుంది. కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానాలకు నిరసనగా కార్మికవర్గం ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో 7 సార్లు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలు చేయడం జరిగింది..

పెద్ద నోట్ల రద్దు.. ఒరిగిందేమిటి?

2016 లో పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం బయటపడి, అవినీతి అంతమవుతుందని ఊదరగొట్టారు. రాత్రికి రాత్రే పెద్ద నోట్ల రద్దుతో... ఆచరణలో నల్లధనం బయటికి రాకపోగా కోట్లాదిమంది అనేక ఇబ్బందులు పాలయ్యారు. ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అతిపెద్ద వైఫల్యమని వెల్లడైంది. 2017 లో సర్జికల్ స్ట్రైక్ తరువాత దేశంలో ఉగ్రవాదం ఉండదని చెప్పుకొచ్చారు. నేటికీ ఉగ్రవాదం అంతం కాకపోగా జడలు విప్పుకుని ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూనే ఉంది. 2018లో జీఎస్టీతో అద్భుతాలు జరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. వాస్తవంగా జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందే తప్ప ప్రజలపై మరింత పన్నుల భారం మోపింది. ప్రభుత్వాలు ఉన్నది ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడానికా లేక వారి జీవన ప్రమాణాలు పణంగా పెట్టి ఆదాయం సమకూర్చుకోవడానికా? నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్ ధరలు, వంట నూనెల ధరలు మంట మండుతున్నాయి. ఆ మంటల్లో సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలు మగ్గిపోతున్నాయి. ఒకవైపు పడిపోతున్న ఆదాయాలు, మరోవైపు ఆకాశాన్ని అంటుతున్న ధరలతో అసంఖ్యాక అభాగ్యుల పరిస్థితి దారుణంగా తయారయింది.

మోడీ పాలనకు ముందు వంట గ్యాస్ రూ. 450 ఉంటే నేడు రూ.1175 అయ్యింది. పెట్రోల్ రూ.70 నుండి రూ.110కి, డీజిల్ రూ. 50 నుంచి రూ. 97 కు, వంట నూనె ధరలు రూ. 83 నుండి రూ. 175 కు పెరిగాయి. ఈ ధరాభారం మోయలేక సామాన్యుల నడ్డి తిరుగుతున్నది. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వేల కోట్ల ఆదాయం తెచ్చి పెడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను, బ్యాంకులు, బీమా సంస్థలు, రైల్వేలు పోర్టులు ఇలా అనేక వ్యవస్థలను అమ్మకానికి పెట్టారు. మేడ్ ఇండియా అంటూ ఊదరగొట్టారు. ఆవరణలో స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ వారికి రాయితీలిస్తూన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఇచ్చే వ్యవసాయ సబ్సిడీలు తగ్గించారు. ఉపాధి హామీ ద్వారా కోట్లాది పేదల బతుకుల్లో వెలుగులు నింపే నరేగాకు నిధులు తగ్గిస్తున్నారు. పేదలకు చౌక డిపోల ద్వారా అందించే నిత్యావసర వస్తువులపై సబ్సిడీలను తగ్గిస్తున్నారు.

మూడు రెట్లు పెరిగిన అప్పులు

స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని పాలించిన వివిధ ప్రభుత్వాలు చేసిన అప్పులకు మూడు రెట్లు అధికంగా ఈ తొమ్మిదేళ్లలో చేయడం జరిగింది. అంటే 2023 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కల్లా భారతదేశం లోనే అత్యధికంగా ప్రజలు పేదరికంలోకి జారుకున్నాడని ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించడంతో మోడీ పరిపాలన అంతా డొల్ల అని తేలిపోయింది. ప్రపంచ ఆహార సూచికలో 101వ స్థానానికి చేరి జనం పెడుతున్న ఆకలి కేకలు, దేశాన్ని పట్టి పీడిస్తున్న దారిద్ర్యం, నిరుద్యోగం పెరగడంలో కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. ప్రైవేటీకరణ విధానాలు, జీఎస్టీ వల్ల ప్రజలపై పడిన అదనపు బారాలు, అవినీతి, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, ప్రజాస్వామ్య హక్కుల పై దాడి, న్యాయస్థానాలను బలహీనం చేసే చర్యలు, ఆత్మనిర్బర్ భారత్ అంటూనే మరో ప్రక్క అప్పులతో కూడిన దుర్బర్ భారత్ ఆవిష్కరించారు. ప్రజలను కులాలు, మతాల పేరుతో విడదీసి పాలిస్తున్నారు. రాజ్యాంగంలో రాష్ట్రాలకు ఇచ్చిన హక్కులను కూడా హరించి తానే సర్వాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా పాలన విధానం కొనసాగిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకున్నాయి.

ఉజ్జిని రత్నాకర్రావు

94909 52646

Tags:    

Similar News