ఇదీ సంగతి:విద్వేషాలతో ఏం సాధిస్తారు?

Update: 2022-05-25 18:30 GMT

80-20 రాజకీయాలు, మాటలతో ఎందుకు ఒక వర్గాన్ని అవమానాలకు, అభద్రతా భావానికి గురి చేస్తున్నారు? అధికారంలోకి రావాలంటే ఇట్లనే మాట్లాడాలా? ఇది అవసరమా? చెప్పండి నేతలారా? మధ్యప్రదేశ్‌లో ముస్లిం అనుకుని మీ పార్టీ వ్యక్తిని మీ పార్టీ నేతే చంపేశాడు. దీనికి ఏం సమాధానం చెబుతారు? దేశం అప్పులతో ఆర్థికంగా కుదేలు అయ్యింది. కోట్లాది మందికి ఉద్యోగాలు లేవు. ఆకలి అసమానతలతో జనం ఆగం అవుతున్నారు. ధరల పెరుగుదల కుటుంబాలలో ఆర్థిక సంకటాలను తీవ్రస్థాయికి చేర్చింది. ఈ విషయాలు మాట్లాడండి. చర్చించండి. కులమతాలకు అతీతంగా బతుకుతున్న దేశాన్ని ముఖ్యంగా తెలంగాణ మనుషుల మనసులను విడదీయకండి.

ప్రపంచంలో అగ్రదేశం అయిన అమెరికా మీద భారతీయులకు మోజు ఎక్కువ. మన దేశం నుంచి యేటా ఎనిమిది లక్షల మందికి పైగా విదేశాలకు వెళుతుంటే, అందులో దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగాల కోసమో, చదువుల కోసమో అమెరికాకే పోతున్నారు. గ్రీన్‌ కార్డు దొరికానవారు అక్కడే సెటిల్ అయిపోతున్నారు. సంపాదనతోపాటు తాము అనుకున్న కోరుకున్న రీతిలో బతకాలనే ఆశయం ఉన్నవారు మనకు ఇందులో ఎక్కువగా కనిపిస్తారు. అమెరికా కరోనా కాలాన్ని కూడా ఎన్నో కష్టాలు పడి ఎదుర్కున్నది. నేటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నది. టెక్సాస్‌లోని ఒక స్కూల్‌లో మంగళవారం 18 ఏండ్ల యువకుడు 19 మంది విద్యార్థులు, ఇద్దరు సిబ్బందిని కాల్చి చంపాడు.

చనిపోయిన విద్యార్థులంతా ఏడు నుంచి పదేండ్ల వయసు ఉన్నవారే. 2018, 2019లో 24 మంది చొప్పున 48 మందిని ఇలాగే కాల్చి చంపారు. ఇలాంటి ఘటనలు 2018లో 119, 2021లో 34, 2022లో 28 జరిగాయి. 2012 డిసెంబర్‌లో 26 మందిని చంపారు. 2018‌లో 17 మంది చనిపోయారు. 18 ఏండ్ల వయసు కలిగిన తెల్లజాతి యువకుడు ఒకరు 200 మైళ్లు ప్రయాణం చేసి వచ్చి మరీ 2018 మే 14న న్యూయార్క్ దగ్గరి బబ్లోలోని ఒక సూపర్ మార్కెట్‌లో పది మంది నల్ల జాతీయులను కాల్చి చంపాడు. పాకిస్తాన్‌లోని పెషావర్ ఆర్మీ స్కూల్‌లో ఆల్‌ ఖైదా ఉగ్రవాదులు 132 మంది విద్యార్థులను, 10 మంది సిబ్బందిని కాల్చి చంపారు. ఈ ఘటనలో దాదాపు 100 మంది గాయపడ్డారు. ఇపుడు వీరు ఆప్ఘనిస్తాన్‌లో అధికారంలో ఉన్నారు.

ప్రపంచమంతటా ఇలాగే

2019లో జరిగిన ఘటనలో న్యూజిలాండ్‌లోని ఓ మసీదులో 51 మంది ముస్లింలను దుండగులు కాల్చి చంపారు. 2015లోనూ అమెరికాలో 9 మంది నల్ల జాతీయులను కాల్చి చంపారు. 2011 నుంచి ఇప్పటి వరకు 160 మంది నల్ల జాతీయుల హత్యలు జరుగాయి. ఇక టెక్సాస్ విషయానికి వస్తే 46 శాతం మంది ప్రజల వద్ద తుపాకులు ఉంటాయి. లైసెన్స్ అవసరం లేని తుపాకులను మాల్స్‌లో అమ్ముతారు. అమెరికా‌లో ఆయుధాల కంపెనీలది ఒక పెద్ద రాకెట్ ఉంది. వారు వారి వ్యాపారం కోసం వీటి అమ్మకాల మీద ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా చూసుకుంటారు.

కొన్ని జాతులవారు, వర్గాలవారు అమెరికాను ఆక్రమించేసి తమకు అన్యాయం చేస్తున్నారని, తమ మీద హుకుం చెలాయిస్తున్నారని భావించి, పగలు పెంచుకుని కాల్చి చంపడంలాంటి ఉన్మాద చర్యలకు ఒడిగడతారు. మంగళవారం టెక్సాస్‌లో విద్యార్థుల మీద కాల్పులు జరిపిన డెన్‌డ్రాం కూడా కాల్పులలో మరణించాడు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు, అమెరికాలో ఏం జరుగుతున్నది? అక్కడ మనవాళ్లు సురక్షితమేనా? అనే అనుమానం, భయం, ఆందోళన ఇక్కడివారిలో కలుగుతుంది. తుపాకీ పేల్చడం, హింసకు పాల్పడడం వెనుక సంకుచిత ఆలోచనా విధానం, మానసిక స్థితి, జాతిలాంటి వాటి ప్రభావం ఉంటుంది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు.

భారతదేశంలోనూ ఇదే పరిస్థితి

మన దేశంలోని మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన చూద్దాం. దినేశ్ అనే యువకుడు అమర్‌లాల్ జైన్ అనే వృద్ధుడిని ముస్లింగా భావించి చితకబాదాడు. దెబ్బలకు తాళలేక అమర్‌లాల్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దినేశ్‌ను అరెస్ట్ చేసారు. అమర్‌లాల్‌ను పేరు అడిగినపుడు దినేశ్‌కు మొహమ్మద్ అని వినపడిందట. అంతే ఏకంగా దాడి చేసేశాడు. నిజానికి అమర్‌లాల్‌కు మాట సరిగా రాదు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అమర్‌లాల్, దినేశ్ ఇద్దరూ బీజేపీ కార్యకర్తలే కావడం గమనార్హం. హర్యానాలోని పానీపత్‌లో '786' అని రాసుకున్నాడంటూ అక్లాస్ అనే యువకుడి చేతిని నరికేశారు. ఒక వర్గం మీద, ఒక సముదాయం ఎందుకింత కక్షనో అర్థం కాదు.పరాయి పాలన నుంచి ఈ దేశం విముక్తి కోసం హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయిలు కలిసి పోరాడారు, కలిసి త్యాగాలు చేశారు.

ఆ చరిత్ర మరిచిపోయి బీజేపీ నాయకులు 'మసీదులు తవ్వుతామని, శవాలోస్తే మీకు, శివమొస్తే మాకు' అంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణ‌లో అధికారంలోకి వస్తే ఉర్దూ బాషను, మదర్సాలను రద్దు చేస్తామంటారు. రిజర్వేషన్ ఎత్తేస్తామంటారు. టెక్సాస్‌లో పిల్లలను కాల్చి చంపిన ఉన్మాదికి వీరికి తేడా ఏమిటి? అతడూ విద్వేషం నింపుకుని దాడి చేసాడు. ఇతను విద్వేషంతోనే మాట్లాడుతున్నాడు. 80-20 రాజకీయాలు, మాటలతో ఎందుకు ఒక వర్గాన్ని అవమానాలకు, అభద్రతా భావానికి గురి చేస్తున్నారు? అధికారంలోకి రావాలంటే ఇట్లనే మాట్లాడాలా? ఇది అవసరమా? చెప్పండి నేతలారా? మధ్యప్రదేశ్‌లో ముస్లిం అనుకుని మీ పార్టీ వ్యక్తిని మీ పార్టీ నేతే చంపేశాడు. దీనికి ఏం సమాధానం చెబుతారు? దేశం అప్పులతో ఆర్థికంగా కుదేలు అయ్యింది. కోట్లాది మందికి ఉద్యోగాలు లేవు. ఆకలి అసమానతలతో జనం ఆగం అవుతున్నారు. ధరల పెరుగుదల కుటుంబాలలో ఆర్థిక సంకటాలను తీవ్రస్థాయికి చేర్చింది. ఈ విషయాలు మాట్లాడండి. చర్చించండి. కులమతాలకు అతీతంగా బతుకుతున్న దేశాన్ని ముఖ్యంగా తెలంగాణ మనుషుల మనసులను విడదీయకండి..

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Tags:    

Similar News