సినీ బడ్జెట్ పెంపుదలకు కారకులెవ్వరు?
What are the reasons for the increase in film budget?
వర్తమాన సాంకేతిక విప్లవం అరచేతిలో ఇమిడిపోయింది. చేతి వ్రేళ్ళ చివరి నుంచి ‘ప్రపంచ సినిమా’ కళ్ళ ముందు సంపూర్ణమైన విశ్లేషణలతో ప్రత్యక్షమవుతుంది. నాసిరకం కథ, స్క్రీన్ ప్లేలను సగటు ప్రేక్షకుడు అంగీకరించడం లేదు. ప్రతీ నిర్మాత దర్శకులు తమ చిత్రం గొప్పదిగానే చెబుతారు (చెప్పాలి కూడా). ప్రచారం చేసుకుంటారు. కానీ.. వీటిని నమ్మే దశలో ప్రేక్షకులు (అభిమానులు కూడా) లేరు. ఈ నేపథ్యం నుంచి ఓ రెండు వందల చిత్రాలు ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ‘మెప్పు’ కోసం విడుదలైనాయి. ఓ పది సినిమాలు కూడా పట్టుమని పది రోజులు ఆడలేదు. ఒకట్రెండు సినిమా వాల్ పోస్టర్స్ మీద మాత్రమే మూడవ వారమనే ప్రింటు చూస్తున్నాము.
‘సినిమా అనేది కోట్ల మీద వ్యాపారం. కానీ.. మాటల మీద వ్యాపారం కాదు. మరి దానిని అనుకున్న బడ్జెట్‌లో ఎలా పూర్తి చేయాలో, ఎంత నిష్కర్షగా, నిక్కచ్చిగా ఉండాలో నిర్మాత ప్రణాళిక వేసుకోవాలి. మిగిలిన సాంకేతిక నిపుణులకు అతడే మార్గదర్శి’ అంటారు కె.వి. రెడ్డి. ఆయన తన చేతిలో ఉన్న స్క్రిప్ట్ తోనే బడ్జెట్ అంకెలను సహితం పేర్కొనే వారని చెప్పేవారు ఉన్నారు. బ్యాండ్ స్క్రిప్ట్ చేతిలో లేకుండా షూటింగ్‌కు వెళ్లేవారు కాదు. ఆనాటి దర్శక నిర్మాతలు, కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి సహితం రచయిత మహారథి స్క్రిప్ట్, సంభాషణలు వంటి వాటి పట్ల నిబద్ధమైన సంప్రదింపులు జరిపారని ఆయనే చాలా సందర్భాలలో చెప్పారు. పూర్తిస్థాయిలో, కొన్ని వందల మందితో, అడవిలో షూటింగ్ చేసుకున్న ఆ చిత్రం ‘బడ్జెట్’ అంచనాలను దాటి పోలేదు. ప్రముఖ నటులంతా అందులో ఉన్నారు. ఇందుకు కారణం ఆ చిత్ర నిర్మాతలుగా వ్యవహరించిన ఆది శేషగిరిరావు, హనుమంతరావులేనని అంటారు సూపర్ స్టార్. ఆ చిత్రం ఓ చరిత్ర. ఇది గతం.
చిత్ర ఫలితం గల్లంతయితే…
గత వర్తమానాలు బేరీజు వేసుకుంటే సినిమా నిర్మాణం అనేది ‘కొంతమంది’ చేతిలోకి వెళ్లిపోయింది. వారు కూడా చిత్ర ఫలితాలు తారుమారైతే ‘నష్టపోయిన’ సందర్భాలున్నాయి. కానీ.. థియేటర్లు, పంపిణీ, రాజకీయ, సామాజిక, సాంకేతిక సమీకరణాల వలన తక్కువ నష్టాలతో ఒడ్డున పడుతున్నారు. నటీనటుల కాంబినేషన్స్‌లో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించి, పాపులర్ అయిన వారున్నారు. కర్ణుడి చావుకు లక్ష కారణాలు అని చెప్పడంలో ఇటువంటి అంశాలున్నాయి. బడ్జెట్‌ను ఎవరు అదుపు చేస్తారనేది వర్తమాన చిత్ర పరిశ్రమలో మిలియన్ డాలర్ల ప్రశ్న. తారల రేట్లు విపరీతంగా పెంచుకుపోతున్నారు (డిమాండ్, సప్లై సూత్రం ఇక్కడ వర్తిస్తుంది.) కానీ.. చిత్రం ఫలితం గల్లంతయితే నిర్మాతలకు కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. అలాగని చిన్న చిత్రాలు తీసే వారికి థియేటర్లు దొరకని స్థితి. ఓ సిండికేట్ వ్యవస్థ నియంత్రత్వమే దీనికి కారణమని ఒక వాదన. నిజానిజాలు పక్కన పెడితే విపరీతమైన ప్రచారం చేస్తున్న హైప్ మొదటి ఆటతోనే ‘తుస్సు’మంటున్నది. అంతే రెండో ఆట నుంచి టికెట్లు తెగటం నెమ్మదిస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఈ మధ్య కాలంలో విడుదలైన ‘కొన్ని’ చిత్రాలను చెప్పుకోవచ్చు. నిర్మాతల నష్టాన్ని భర్తీ చేసే నటులు ఇద్దరు, ముగ్గురు అటు తమిళ, ఇటు తెలుగు పరిశ్రమలో ఉన్నారు. వారికి ‘నిర్మాతల’ సంక్షేమం, జీవితాలు గురించి తెలుసు. వారు కూడా నిర్మాణ రంగంలోనికి దిగి చేయి కాల్చుకోవడం అందరికీ తెలిసిందే.
వారి భవిష్యత్తు ఆలోచిస్తున్నారా?
ఓటీటీల ప్రభావం చిత్ర పరిశ్రమ మీద ఎక్కువ అనేది ఎవరూ అంగీకరించని, (అంగీకరించవలసిన) అంశం. కానీ.. తెరపైన సినిమాని ఇది శాసిస్తుంది. కరోనా సమయంలో దీని విశ్వరూప సందర్శన పరమార్ధం అందరికీ అర్థమైంది. దానికి ఎడిక్ట్ అయిపోయారు. ‘చిత్రాల విజయాలను శాసిస్తున్నది థియేటర్లలోని పాప్ కార్న్ కూడా’నని దర్శకుడు తేజ చెప్పిన మాటలను కొట్టిపారేయలేం. థియేటర్ యాజమాన్యం, షాపు ఓనరు కలిపి పది రూపాయల పాప్ కార్నును వందకు పెంచేసి, ప్రేక్షకులు జేబుకు చిల్లు పెడుతున్నారు. నలుగురు కుటుంబ సభ్యులతో సినిమా థియేటర్‌కు వెళ్లిన వారికి మినిమం ఇంటర్వల్ ఖర్చు వెయ్యికి పైనే…ఈ పరిస్థితుల్లో స్నేహితులు, కుటుంబాలతో సరదాగా కలిసి సినిమా చూసి అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయనే చెప్పాలి. “తారల పారితోషకాలు ఎందుకు పెరుగుతున్నాయనేది, దాని వలన చిత్ర ఫలితాలు, తదనంతర కాలంలో నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్, కార్మికులు, నిర్మాత, దర్శకులు వంటి ఇరవై నాలుగు విభాగాల వారు ఏమవుతారో, వారి భవితవ్యం ఏమిటో కూడా చిత్ర పరిశ్రమకు ఆలోచిస్తున్నట్టు లేదు. చిత్ర సీమలో నిబద్ధత లేదని చాటుకుంటున్నామోననే అపవాదు ఉంద”ని సుందర లాల్ నహతా ఆరున్నర దశాబ్దాల క్రితం చేసిన వ్యాఖ్యానం. వెరసి అటు సాంకేతికత, ఇటు పరిశ్రమ పరమైన ‘స్వంత లాభం’ వంటివి ప్రేక్షకులపైన భారంగా పడుతున్నాయి. క్రమేపీ సినిమాను పెద్ద తెరపై చూసి ఆనందించే స్థాయిని దూరం చేస్తున్నాయి.
అవగాహన లేమితో.. డబ్బుందని
ఒకనాడు ఇసుక నేలలో సింగిల్ ప్రాజెక్టుపై ‘పాత ఎన్టీవోడు, అక్కినేని వోడు’ సినిమాలను చూసే క్రింది వర్గానికి ‘ధరల మెట్లు’ దిగువ స్థాయికి చేర్చేసాయి. సెల్ ఫోన్‌లో అక్రమంగా చిత్రాన్ని చూసుకునే అవకాశమిస్తున్నాయి. ‘సినిమాలోని లాజిక్‌ను పట్టించుకోకుండా సరదాగా మూడు గంటల సినిమా చూడాలనుకునే వాడికి ‘మాల్’ లోని థియేటర్లు సహకరించే స్థితి లేదు. అందరూ కలిసి ఇంట్లో ఓటీటీలో చూసుకుంటున్నారు. నష్టం లేని పని కుటుంబ సభ్యులంతా ఖర్చు లేకుండా చూస్తున్నారు. ఈ నిర్ణయం సగటు ప్రేక్షకుడు ఎందుకు తీసుకుంటున్నాడు? ఆలోచించేది ఎవరు? వంద సినిమాలకు కనీసం పది సినిమాలైనా పెట్టుబడి వచ్చేటట్టు చేసుకునేది ఎవరు? కోట్లు పెట్టేవాడు కోట్లు లాభం ఆశించడం తప్పు కాదు. కానీ.. వాటిని తెచ్చుకునే పథకం కూడా తెలియాలి. ఆ దిశగా ఆలోచించుకోవాలి.
ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందనేది తరచుగా వినపడే మాట. అసలు పోస్ట్ ప్రొడక్షను, ప్రీ ప్రొడక్షన్ సమయాలలో ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఏయే విభాగంలో ఈ రెంటి మధ్య సమన్వయం, అవసరం ఉంటాయో ఎంతమంది క్రొత్త నిర్మాతలకు తెలుసు అనేది సందేహం. ప్రాథమికమైన అవగాహన లేమితో కేవలం ‘డబ్బుందనే’ కారణంగా ‘ఆశ’తో చిత్ర నిర్మాణం కొనసాగించి మధ్యలో చతికిలబడిన వారు, ల్యాబ్‌లలో ప్రింట్సు వదిలేసుకున్నవారు సినిమా చరిత్రలో ఎందరెందరో మరి. ‘ఒక్క అవకాశం అని’ వెళ్ళి, చివరకు బతుకులో కనీసం ‘ఒక్క ఛాన్స్’ కూడా లేకుండా పోయినవారు పరిశ్రమలో ఉన్నారు. మురళీమోహన్ లాంటివారు అన్ని విభాగాలపై పట్టు, చిత్ర పరిశ్రమలోని లోగోట్టు తెలిసిన తరువాతనే క్రమశిక్షణతో, ఆర్థికపరమైన పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లారు. చిత్రాలు తీశారు. విజయవంతమైనారు. నాటి విజయ, భరణి, సురేష్ బాబు మూవీస్, కౌముది, ఎన్.ఎ.టి., అమృత వంటి బ్యానర్లు క్రమశిక్షణతోనే విజయాలకు చిరునామాగా మిగిలాయి. వారు నడిచిన మార్గాలు, పాటించిన నైతిక సూత్రాలు తెలుసుకునే వారేరి?
-భమిడిపాటి గౌరీశంకర్
94928 58395